జాక్‌మా మాట ఖరీదు 25 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-10-26T00:24:22+05:30 IST

జాక్‌మా వ్యాపారంపై నిఘా పెట్టి ఆయన స్థాపించిన యాంట్ గ్రూప్‌ను ఐపీవోకు వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో అలీబాబా షేర్లు స్టాక్ మార్కెట్లో పతనమవుతూ వచ్చాయి. ప్రపంచం కుబేరుల్లో ఒకడిగా ఉన్న జాక్‌మా ఏడాది తిరిగేలోపు 344 బిలియన్ డాలర్లు కోల్పోవాల్సి వచ్చింది..

జాక్‌మా మాట ఖరీదు 25 లక్షల కోట్లు

బీజింగ్: మాట చాలా విలువైంది.. ఏదైనా ఆచీ తూచీ మాట్లాడాలి అంటారు. నిజంగా ఆ మాట అంత విలువైందా అనే అనుమానం ఉంటే అలీబాబా అధినేత జాక్‌మాను గుర్తు చేసుకుంటే మాట ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన ఒక్క వ్యాఖ్య వల్ల 344 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అంటే ఇండియన్ కరెన్సీలో 25 లక్షల కోట్లకు పైమాటే. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మాటల్లో జాక్‌మా మాటను కూడా రాసిపెట్టుకోవాలేమో.


ఏడాది క్రితం చైనాలో ‘ది బండ్ సమ్మిట్’ పేరుతో జరిగిన సదస్సులో చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను జాక్‌మా ప్రశ్నించారు. బ్యాంకులు తాకట్టు దాకాణాల మనస్తత్వాన్ని వీడాలంటూ జాక్‌మా సూచన చేశారు. సంప్రదాయబద్దమైన పద్దతుల్లో సమూల మార్పులు తేవాలని, విస్తృత ఆలోచనలు అభివృద్ధి చేసుకోవాలంటూ ఆయన సూచించారు. జాక్‌మా చేసిన ఈ సూచనలు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మనసును గాయపరిచాయి. అంతే రంగంలోకి దిగిన ప్రభుత్వం చూస్తుండగానే జాక్‌మా వ్యాపారంపై తీవ్రమైన దెబ్బకొట్టాయి.


జాక్‌మా వ్యాపారంపై నిఘా పెట్టి ఆయన స్థాపించిన యాంట్ గ్రూప్‌ను ఐపీవోకు వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో అలీబాబా షేర్లు స్టాక్ మార్కెట్లో పతనమవుతూ వచ్చాయి. ప్రపంచం కుబేరుల్లో ఒకడిగా ఉన్న జాక్‌మా ఏడాది తిరిగేలోపు 344 బిలియన్ డాలర్లు కోల్పోవాల్సి వచ్చింది. ప్రపంచంలో ఏ సంస్థ కూడా ఇంత తీవ్ర స్థాయిలో ఇంత తక్కువ సమయంలో నష్టపోలేదు. చైనాలో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ అత్యంత నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుందని, ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకోలేదని అనేక విమర్శలు ఉన్నాయి. జాక్‌మాపై ప్రభుత్వ చర్యల పట్ల కూడా జిన్‌పింగ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే జిన్‌పింగ్ ప్రభుత్వం వీటిని లెక్క చేయలేదు.

Updated Date - 2021-10-26T00:24:22+05:30 IST