గోదారిలో జన నీరాజనం

ABN , First Publish Date - 2022-09-27T06:47:21+05:30 IST

అమరావతి రైతుల మహా పాదయాత్రకు గోదావరి జిల్లా వాసులు నీరాజనాలు పలికారు. ఎదురేగి, హారతులిచ్చి, పూలవర్షం కురిపించారు. ‘జై అమరావతి’ నినాదాలతో హోరెత్తించారు. అడుగడుగునా

గోదారిలో జన నీరాజనం

ఎదురేగి.. హారతులిచ్చి!

రాజధాని రైతులకు జన నీరాజనం.. గోదావరి వాసుల అపూర్వ ఆదరణ

15వ రోజు 17 కిలో మీటర్ల నడక

మంత్రి బొత్స వ్యాఖ్యలపై జేఏసీ ఆగ్రహం

ఎదురేగి.. హారతులిచ్చి అపూర్వ ఆదరణ

కొణికిలో వైసీపీ కవ్వింపు ఫ్లెక్సీలు

సంయమనం కోల్పోకుండా ముందుకు 

సాగిన అమరావతి మహాపాదయాత్ర

సీఎం మీద కన్నెర్ర చేయాలని ఫైర్‌


ఏలూరు/పెదపాడు సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతుల మహా పాదయాత్రకు గోదావరి జిల్లా వాసులు నీరాజనాలు పలికారు. ఎదురేగి, హారతులిచ్చి, పూలవర్షం కురిపించారు. ‘జై అమరావతి’ నినాదాలతో హోరెత్తించారు. అడుగడుగునా పాదయాత్రకు మద్దతు పలికారు. టీడీపీ సహా మిగతా విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు సంఘీభావం తెలిపి అడుగులో అడుగు కలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొణికి నుంచి 15వ రోజు పాదయాత్ర ఆరంభమైంది. అక్కడ నుంచి సత్యవోలు, నాయుడుగూడెం, పెదపాడు మీదుగా కొత్తూరు వరకు 17 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. మధ్యాహ్నం రెండు గంటలకు పెదపాడులో భోజన విరామం తీసుకుని అక్కడ నుంచి కొత్తూరు వరకు రైతులు యాత్ర సాగించారు. అమరావతికి మద్దతుగా దారి పొడవునా మహిళలు, యువకులు, వయో వృద్ధులు సైతం రైతులకు ఎదురేగి స్వాగతం పలికారు. మీ వెంట మేమున్నామంటూ ఉత్సాహపరిచారు. యాత్ర ప్రారంభంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, మాజీ ఎంపీ మాగంటి బాబు, గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌లు రైతులతో కలిసి నడిచారు. వీరి రాకతో మిగతా వారంతా ఇనుమడించిన ఉత్సాహంతో నినాదాలు చేశారు. కడిమికుంట గ్రామంలో మహిళలు, చిన్నారులు రైతులకు ఎదురేగి పూలవర్షం కురిపించి, హారతులిచ్చారు. అనుకున్నది సాధిస్తారంటూ పాదయాత్రలోని మహిళలకు ధైర్యం చెప్పారు.


చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ.. చేతకాని ప్రభుత్వం పాద యాత్రికులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తుందా? మంత్రులు ఇష్టానుసారం మాట్లడటమేంటి? అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఆరు నూరైనా రాష్ట్ర రాజధాని అమరావతేనని నినాదించారు. ప్రభుత్వ తీరుపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యే రామానాయుడు, రామరాజు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాటకు దిగుతున్నారంటూ తప్పు పట్టారు. సీపీఐ, సీపీఎం, బీజేపీ, జనసేన నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రకు మద్దతుగా నాయుడుగూడెం గ్రామానికి చెందిన రైతులు రూ.2.15 లక్షలు, వైద్య సాయం కోసం రూ.50 వేలు, బాపులపాడుకు చెందిన రైతులు రూ.1.75 లక్షలు, సత్యనారాయణపురానికి చెందిన కిలారు సాంబశివరావు రూ.5 వేలు అందజేశారు. కాగా, పాదయాత్ర ప్రారంభమైన కొణికిలో సోమవా రం వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు.


మూడు రాజధానులను ప్రస్తావిస్తూ ప్లెక్సీలు కట్టారు. స్థానిక ఎమ్మెల్యే నిలువెత్తు ఫొటోలతో ‘మూడు ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం’ అంటూ ప్లెక్సీలు వెలిశాయి. అయితే.. ఈ కవ్వింపు చర్యలను రైతులు పట్టించుకోకుండా సంయమనంతో వ్యవహరించారు. మరోవైపు పాదయాత్రలో పాల్గొంటున్న వారిని ప్రోత్సహిస్తూ స్థా నికులు ప్లెక్సీలు కట్టారు. ‘వీరులారా స్వాగతం.. త్యాగధనులారా మీకు నీరాజనం’ అని పేర్కొన్నారు. పాదయాత్ర కొనసాగిన ప్రాంతాల్లో పోలీసుల నిఘా కొనసాగింది. యాత్రలో పాల్గొంటున్న వారి గుర్తింపు కార్డులు చూపించాల్సిందిగా కొన్నిచోట్ల వత్తిడి చేశారు. సమీప గ్రామాల నుంచి తరలివస్తున్న వారిని వీడియో తీశారు. ఎక్కడికక్కడ యాత్ర వెంట ఉన్న వారి కదిలికలు గుర్తిస్తూ మరోవైపు ఫొటోలు తీస్తూ అనేక మంది పోలీసులు మఫ్టీలో కన్పించారు. అయినా యాత్రకు మద్దతు పలికేందుకు వచ్చిన వారంతా వీటిని ఖాతరు చేయలేదు. 




అమరావతి రైతులవి త్యాగాలు కావు

నా మాటలకు కట్టుబడి ఉన్నా.. మంత్రి బొత్స 

అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘మేం తలచుకుంటే 5 నిమిషాల్లో అమరావతి పాదయాత్ర ను ఆపేస్తాం’ అని వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ల్యాండ్‌ పూలింగ్‌ కొత్తదేం కాదని, అమరావ తి రైతులవి త్యాగాలు కావని అన్నారు. ‘ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఉం ది కదా అని మా ఊరు వచ్చి ఇక్కడ పరిపాలనా రా జధాని వద్దంటే మా ప్రాంత ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? ఆ యాత్ర రైతుల యాత్రా? రియల్‌ ఎస్టే ట్‌ యాత్రా? టీడీపీ యాత్రా? నిర్ధారించుకోవాలని చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను అన్నారు.


సీఎం మీద కన్నెర్ర చేయండి

మంత్రి బొత్స వ్యాఖ్యలు సరికాదు

మేమేం తప్పు చేశాం: జేఏసీ ఫైర్‌

పాదయాత్రను ఆపాలంటే ఐదు నిమిషాల పనంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై అమరావతి జేఏసీ తీవ్ర స్థాయిలో మండిపడింది. పాదయాత్ర 15వ రోజు ముగింపు సందర్భంగా పెదపాడు మండలం కొత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. జేఏసీ జనరల్‌ సెక్రటరీ గద్దె తిరుపతిరావు, జేఏసీ సభ్యులు రాయపాటి శైలజ, నాగుర్‌మీరా, అనుమోలు సునీత మాట్లాడుతూ.. బాధ్యత కలిగిన మంత్రి పాదయాత్రపై అవాకులు, చవాకులు పేలటం సరికాదన్నారు. ‘‘మా పాదయాత్రపై కన్నెర్ర చేస్తామంటున్నారు. మేమేం తప్పు చేశాం. చేతనైతే మీ సీఎం మీద కన్నెర్ర చేయండి’’ అని మంత్రి బోత్సపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మంత్రి గతంలో జగన్‌, విజయమ్మలను విమర్శించలేదా అంటూ ప్రశ్నించారు. ఇంకో మంత్రి బుద్ధి లేదంటున్నారని.. మరి మీ బుద్ధి ఏమైందని నిప్పులు చెరిగారు. ‘‘మంత్రి బొత్స తన రాజకీయ జీవితంలో కుటుంబ అస్తులు పెంచుకున్నారు. కుటుంబ సభ్యులకు పదవులు ఇప్పించుకున్నారు. అంతే తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిందేంటి’’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల మధ్య గొడవలు, విబేధాలు సృష్టించేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శల వర్షం కురిపింంంచారు. 

Updated Date - 2022-09-27T06:47:21+05:30 IST