కరోనా కట్టడికి చర్యలేవి?

ABN , First Publish Date - 2021-04-21T06:13:05+05:30 IST

ప్రజారోగ్యానికి పెను సవాలుగా, కారుచిచ్చులా మారిన కరోనా మహమ్మారి రెండవ దశ ఉధృతి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజారోగ్యంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టాలని అమరావతి బహుజన జేఏసీ కోరింది.

కరోనా కట్టడికి చర్యలేవి?

  ప్రజామోదనిర్ణయాలు లేకపోవటం విచారకరం

  సీఎంకు అమరావతి బహుజన జేఏసీ లేఖ

పాయకాపురం, ఏప్రిల్‌ 20 : ప్రజారోగ్యానికి పెను సవాలుగా, కారుచిచ్చులా మారిన కరోనా మహమ్మారి రెండవ దశ ఉధృతి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజారోగ్యంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టాలని అమరావతి బహుజన జేఏసీ కోరింది. కరోనాపై ప్రభుత్వం తీసుకుంటున్న పూర్తిస్థాయి చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. రెండుసార్లు ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమావేశం నిర్వహించినా ప్రజామోద నిర్ణయాలు లేకపోవటం పట్ల  జేఏసీ నేతలు విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పు పెరుగుతున్న కొద్దీ సౌకర్యాలు, సంసిద్ధత పెరగాలని ఆయన హితవు పలికారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల సూక్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తొలిదశలో రోజుకు 10 నుంచి 20 పాజిటివ్‌ కేసులు నమోదు అయితే, రెండవ దశలో రోజుకు 6 వేల నుంచి 7 వేల కేసులు రావటం ప్రభుత్వాల అసమర్ధత కాదా అని ప్రశ్నించారు. అఖరికి నలుగురు సచివాలయ సిబ్బంది, ఇద్దరు హైకోర్టు ఉద్యోగులు కూడా మృతి చెందినట్లు గుర్తు చేశారు. ఆసుపత్రిలో పడకల లభ్యత, ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలకు కొవిడ్‌ ప్రత్యేక నిధులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ నిధులతో గ్రామాల్లో పారిశుధ్య పనులు మెరుగుపరచాలని కోరారు. నియోజకవర్గాల స్థాయిలో అన్ని పక్షాల నాయకులతో మహమ్మారి నివారణ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల స్వీయ నియంత్రణ ఎంత అవసరమో ప్రభుత్వం కూడా స్వీయ నియంత్రణ పాటించి బహిరంగ సభలు, సమావేశాలకు ఫుల్‌స్టాఫ్‌ పెట్టాలని అన్నారు. గత ఏడాది ఇచ్చిన మూడు మాస్క్‌ల మాదిరిగా ప్రజలకు మరోమారు ఉచితంగా మాస్క్‌లు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక నిధులతో ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. తక్కువ ధరలో నాణ్యమైన వైద్యాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, కొవిడ్‌ సాకుతో వైద్యం పేరిట లక్షలు దోచుకునే కార్పొరేట్‌ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవలని సూచించారు. రాష్ట్రంలో ప్రజల ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ప్రభుత్వమే ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అన్ని చర్యలూ తీసుకోవాలని బాలకోటయ్య లేఖలో వివరించారు. 


Updated Date - 2021-04-21T06:13:05+05:30 IST