Feb 7 2020 @ 13:28PM

‘జాను’ మూవీ రివ్యూ

అనువాద చిత్రాలు... ప‌ర‌భాషా చిత్రాల‌ను అనువాదం చేయడం అనేది బ‌య‌ట నుండి చూసే వారికి సుల‌భంగానే అనిపించినా మేక‌ర్స్‌కు మాత్రం అది క‌ష్ట‌త‌ర‌మైన ప‌ని అని బ‌ల‌మైన వాద‌న ఎప్పుడూ ఉంది. అనువాద సినిమానే కదా! ...అదే కంటెంట్‌ను తెలుగులో మ‌క్కీకి మ‌క్కీ కొట్టేస్తారనుకుంటే మాత్రం పొర‌బ‌డ్డ‌ట్టే. ఎందుకంటే.. క‌థ‌లోని ఆత్మ‌ను, నెటివిటీని దృష్టిలో పెట్టుకుని అనువాదం చేయాల్సి ఉంటుంది. ఆ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక‌పోతే అనువాద‌ సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొంద‌దు. గ‌త ఏడాది  త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిత్రం ‘96’. క్లాసిక్ మూవీగా ఘ‌న విజ‌యాన్ని సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు అనువాదం చేయాల‌నుకున్నాడు.


ఓర‌కంగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు షాకింగ్ విష‌య‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే 17 ఏళ్ల కెరీర్‌లో దిల్‌రాజు చేస్తున్న తొలి రీమేక్ సినిమా ఇది. అంతే కాకుండా అస‌లు రీమేక్ చేయాలంటే మేక‌ర్స్ ఆలోచించిన ‘96’ చిత్రాన్ని దిల్‌రాజు రీమేక్ చేయాల‌నుకోవ‌డమే. విజ‌య్ సేతుప‌తి, త్రిష హీరో హీరోయిన్లుగా త‌మిళంలో రూపొందిన ‘96’ను తెలుగులో శర్వానంద్, సమంత అక్కినేనిలతో ‘జాను’గా రీమేక్ చేశారు. మ‌రి ‘జాను’ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఏమేర‌కు ఆక‌ట్టుకుంది?  శ‌ర్వానంద్‌, స‌మంత ఎలా న‌టించారు? త‌మిళంలో క్రియేట్ అయిన మేజిక్‌, తెలుగులోనూ క్రియేట్ అయ్యిందా?  అని తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...


స‌మ‌ర్ప‌ణ‌:  శ్రీమ‌తి అనిత‌

బ్యాన‌ర్‌:  శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌

న‌టీన‌టులు: శ‌ర్వానంద్‌, సమంత‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్‌, ర‌ఘుబాబు, తాగుబోతు ర‌మేశ్‌, శ‌ర‌ణ్య‌, గౌరి, సాయికిర‌ణ్‌, హాసిని త‌దిత‌రులు

మాట‌లు:  మిర్చి కిర‌ణ్‌

పాట‌లు:  సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి

ఆర్ట్‌:  రామాంజ‌నేయులు

సినిమాటోగ్ర‌ఫీ: మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌

సంగీతం:  గోవింద్ వ‌సంత‌

నిర్మాత‌లు:  దిల్‌రాజు, శిరీష్‌

ద‌ర్శ‌క‌త్వం:  సి.ప్రేమ్‌కుమార్‌


క‌థ‌:

కె.రామచంద్ర‌(శ‌ర్వానంద్‌) ట్రావెల్ ఫొటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. ఓ ప‌ని కోసం త‌న స్టూడెంట్‌తో వైజాగ్ వ‌చ్చిన రామ‌చంద్ర అక్క‌డ స్కూల్‌, థియేట‌ర్‌ను చూడ‌గానే త‌న గ‌త జ్ఞాపకాలు గుర్తుకువ‌స్తాయి. అప్పుడు త‌న‌తో పాటు 10వ త‌ర‌గ‌తి చ‌దువుకున్న ముర‌ళి(వెన్నెల‌కిషోర్‌), స‌తీష్‌(తాగుబోతు ర‌మేశ్‌)ల‌కు ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఆ క్ర‌మంలో అంద‌రూ హైద‌రాబాద్‌లో రీ యూనియ‌న్ కావాల‌నుకుంటారు. అన్న‌ట్లుగానే అంద‌రూ క‌లుసుకుంటారు. అప్పుడు రామ‌చంద్ర‌, జానకి దేవి(స‌మంత అక్కినేని)ని క‌లుసుకుంటాడు. దాదాపు 17 సంవ‌త్స‌రాలు త‌ర్వాత క‌లుసుకున్న ఇద్ద‌రూ రీ యూనియ‌న్ పార్టీ త‌ర్వాత జానకితో క‌లిసి రామ‌చంద్ర ఆమె ఉండే హోట‌ల్‌కి వెళ‌తాడు. అప్పుడు ఇద్ద‌రూ 10వ త‌ర‌గతి చ‌దువుకునేట‌ప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం, ఎలా విడిపోయాం అనే సంగ‌తుల‌ను గుర్తుకు తెచ్చుకుంటారు. జానుకి పెళ్లై ఉంటుంది. కానీ రామ‌చంద్ర మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. అస‌లు రామ‌చంద్ర  ఎందుకు పెళ్లి చేసుకోడు?  రామ‌చంద్ర‌, జాను ఎందుకు విడిపోతారు? అస‌లేం జ‌రిగింది?  చివ‌రికి ఇద్ద‌రి ప్ర‌యాణం ఎలా ముగిసింది?  అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 


విశ్లేష‌ణ‌:

రీమేక్ సినిమాల‌ను రూపొందించాల‌నుకోవ‌డం సుల‌భ‌మైన విష‌యం కాదు.. క్లాసిక్ మూవీల‌ను రీమేక్ చేయ‌డం క‌త్తిమీద సామే. అలాంటి ప్ర‌య‌త్నమే జాను. 96  సినిమాక ఇది తెలుగు రీమేక్‌. సినిమా ప్ర‌ధానంగా రెండు పాత్ర‌ల మ‌ధ్య‌నే సాగుతుంది. విజ‌య్‌సేతుప‌తి, త్రిష పాత్ర‌ల‌ను శ‌ర్వానంద్‌, స‌మంత‌లు క్యారీ చేశారు. రెండు సినిమాల‌ను, ఆ పాత్ర‌ల‌ను పోల్చి చూస్తే క‌ష్ట‌మే కానీ.. దేనిక‌దే విడిగా చూస్తేనే మంచిది. రామ్ పాత్ర‌లో శ‌ర్వా.. జానకి పాత్ర‌లో స‌మంత ఒదిగిపోయారు. చ‌క్క‌గా ఫీల్‌ను క్యారీ చేశారు. ప‌ద‌వ త‌ర‌గ‌తిలో పుట్టిన ప్రేమ.. అనుకోని ప‌రిస్థితుల్లో విడిపోవ‌డం.. 17 ఏళ్ల త‌ర్వాత క‌లుసుకున్న‌ప్పుడు వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయ‌నేదే ఈ సినిమా. ఆ ఫీలింగ్స్‌ను శ‌ర్వా, స‌మంత చ‌క్క‌గా తెర‌పై ఆవిష్క‌రించారు. ఇక వెన్నెల‌కిషోర్‌, తాగుబోతు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ర‌ఘుబాబుతో పాటు జూనియ‌ర్ శ‌ర్వానంద్‌గా న‌టించిన సాయికిర‌ణ్‌, జూనియ‌ర్ స‌మంత‌గా న‌టించిన గౌరి చ‌క్క‌గా న‌టించారు. ప్ర‌తి ఒక్క‌రికీ ప‌ద‌వ త‌ర‌గ‌తిలో క్ర‌ష్ ఉంటాయి. అలాగే ల‌వ్ బ్రేక‌ప్స్ ఉంటాయి. అలాంటి వారికి కొన్ని స‌న్నివేశాలు మ‌న‌సుని బాగా తాకుతాయి. కొన్ని సాదాసీదాగానే అనిపిస్తాయి. 10వ త‌ర‌గ‌తిలో ఎర్ప‌డేది ప్రేమా? అంటే ఔన‌ని చెప్ప‌లేం... కాద‌ని చెప్ప‌లేం. దాదాపు ఇలాంటి ప్రేమ‌లు విఫ‌ల‌మే అవుతుంటాయి.

కానీ అలాంటి ఓ క‌థ‌ను, కొన్ని స్న‌నివేశాల‌ను బేస్ చేసుకుని డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్  సినిమాను తెర‌కెక్కించారు. ఇక సినిమా మేకింగ్ విష‌యానికి వ‌స్తే మ‌హేంద్ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. ఇక ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకుంది ల‌వ్‌స్టోరీ. దానికి సంగీత‌మే ప్ర‌ధాన బ‌లం కావాలి. గోవింద్ వ‌సంత సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాల‌ను మ‌రో రేంజ్‌లో నిలిపాయి. సినిమాలో చాలా స్లో నెరేష‌న్‌లో కొన‌సాగుతుంది. ఇది ప్రేక్ష‌కుడికి బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇక 2004 స‌మ‌యంలో దూర‌ద‌ర్శ‌న్ చూసేలా ఉండే స‌న్నివేశాల‌ను పెట్ట‌డానికి గల కార‌ణాలేంటో అర్థం కాలేదు. త‌మిళంలో 1996 బ్యాక్‌డ్రాప్ కాబ‌ట్టి.. అలా చూపించి ఉండొచ్చు. కానీ తెలుగులో తెర‌కెక్కించిన 2004 బ్యాక్‌డ్రాప్‌లో ఆ స‌న్నివేశం ఇమ‌డ‌లేదు. ఇలాంటి మైన‌స్‌లు మిన‌హా.. ప్రేమ‌లు ఫెయిల్ అయిన‌వారికి, చిన్న‌పాటి ల‌వ్ ఎమోష‌న్స్ క్యారీ చేస్త‌న్న‌వారికి సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది.


బోట‌మ్ లైన్‌: జాను.. స్లోగా సాగే ఎమోష‌న‌ల్ లవ్ జర్నీ

రేటింగ్‌: 3/5