జే బ్రాండ్‌ మద్యంతో ప్రాణాలకు ముప్పు

ABN , First Publish Date - 2022-08-10T04:34:14+05:30 IST

ల్తీ, ప్రభుత్వం దుకాణాల్లో విక్రయించే జే బ్రాండ్‌ మద్యం వల్ల మద్యపాన ప్రియుల ప్రాణాలకు ముప్పు ఉందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

జే బ్రాండ్‌ మద్యంతో ప్రాణాలకు ముప్పు
మాట్లాడుతున్న దినేష్‌రెడ్డి

తెలుగు యువత నేత దినేష్‌రెడ్డి

కోవూరు, ఆగస్టు 9 : కల్తీ, ప్రభుత్వం దుకాణాల్లో విక్రయించే జే బ్రాండ్‌ మద్యం వల్ల  మద్యపాన ప్రియుల ప్రాణాలకు ముప్పు ఉందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో విక్రయించని కల్తీ మద్యం ఏపీలో అమ్మి ప్రజాధనాన్ని కొల్లగొట్టి మద్యం ప్రియుల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నారని  విమర్శించారు. మద్యం అమ్మకాల ద్వారా రోజుకు సగటున ప్రభుత్వానికి రూ.30కోట్ల ఆదాయం వస్తోందన్నారు. ప్రభుత్వమే పక్క రాష్ట్రాల నుంచి దొడ్డి దారిన చీప్‌ లిక్కర్‌ తీసుకువచ్చి విక్రయించడం దారుణమన్నారు. ఇందుకూరుపేట ప్రాంతంలో అక్రమంగా తీసుకు వస్తున్న 16వేల మద్యం సీసాలను స్వాధీనపరుచుకున్నారని, చెన్నైలో జే బ్రాండ్స్‌ను  పరీక్షించి విషపూరిత రసాయనాలు ఉన్నట్లు మేధావి వర్గం గుర్తించినట్టు దినేష్‌రెడ్డి గుర్తు చేశారు.  అక్రమార్జన కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే జగన్‌ సర్కారుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు వచ్చాయన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు చెముకుల కృష్ణచైతన్య, మందా రవికుమార్‌, బాలరవి, ఫిరోజ్‌, బెల్లంకొండ విజయ్‌, సూరిశెట్టి శ్రీనివాస్‌, పాటూరు ప్రసాద్‌, జహంగీర్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అల్లా! జగన్‌ మనసు కరిగించు

తెలుగు యువత రాష్ట్ర నేత పోలంరెడ్డి దినేష్‌రెడ్డి

బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 9 : అల్లా!  సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి మంచి మనసు ప్రసాదించి టీడీపీ ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు ఏవైతే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలయ్యాయో వాటిని తిరిగి మళ్లీ అమలులోకి తెచ్చేలా అనుగ్రహించాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి ప్రార్థించారు. మంగళవారం ఆయన టీడీపీ మైనార్టీ నాయకులతో కలిసి బుచ్చిరెడ్డిపాళెంలోని పాత కాశీపాళెం పీర్లచావడిలో, ఖాజానగర్‌లో ఏర్పాటు చేసిన పీర్లను దర్శించుకున్నారు. ఆయన గోత్ర నామాలతో దర్గాలో పూజలు చేశారు. అనంతరం ఆయనను పూలమాలలు, టోపీ శాలువాలతో సన్మానించి ప్రత్యేక ప్రసాదాలను అందజేశారు. మత పెద్దలు  ఆశీర్వాదాలు అందజేశారు. ఆయన వెంట మైనారిటీ నాయకులు సుల్తాన్‌, ఖాజా, అక్తర్‌, కాలేషా, అహ్మద్‌ బాషా, యజ్దాని, షబ్బీర్‌, సర్దార్‌, ఎంవీ.శేషయ్య, బత్తల హరికృష్ణ, వింజం రామానాయుడు. దొడ్ల కోదండరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా బుచ్చిపట్టణంతోపాటు మండలంలోని రేబాల, దామరమడుగు, నాగమాంబాపురం తదితర గ్రామాల్లో నెలకొల్పిన పీర్లు  ముగిశాయి. 

Updated Date - 2022-08-10T04:34:14+05:30 IST