చేప పిల్లల సైజు, నాణ్యతలో రాజీపడేది లేదు

ABN , First Publish Date - 2020-08-13T07:34:52+05:30 IST

తెలంగాణ నీలి విప్లవంలో భాగంగా 3.15 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి

చేప పిల్లల సైజు, నాణ్యతలో రాజీపడేది లేదు

  • పంపిణీ ప్రక్రియ అంతా వీడియో చిత్రీకరణ 
  • పారదర్శకంగానే టెండర్లు
  • ‘ఆంధ్రజ్యోతి’తో మంత్రి తలసాని

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నీలి విప్లవంలో భాగంగా 3.15 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి కలిగించేందుకు రూ. 60 కోట్ల వ్యయంతో 81 కోట్ల చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాద వ్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల నీటి వనరుల్లో విడుదల చేసేందుకు చేపపిల్లల పరిమాణం (సైజు), నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడేది లేదని స్పష్టం చేశారు. చేప పిల్లల పంపిణీ నిలిపివేత, చేప పిల్లల టెండర్లలో గోల్‌మాల్‌ శీర్షికలతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాలపై మంత్రి స్పందించారు. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడారు. చేప పిల్లల సైజు, నాణ్యత, సంఖ్యను పరిశీలించటాని కి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతోపాటు లబ్ధిదారులు, మత్స్య సహకార సంఘాల ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. చేప పిల్లల పంపిణీ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేయాలని, అవసరమైతే చెరువుల వారీగా వీడియోగ్రఫీ చూసుకునేలా డేటా నిక్షిప్తం చేయాలని ఆదేశించినటు చెప్పారు. చేప పిల్లల టెండర్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో ప్రతి జిల్లాకు వేర్వేరుగా జిల్లా అదనపు కలెక్టర్‌ సారథ్యంలోని కొనుగోలు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి టెండర్లు ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. దేశంలో చేప పిల్లలు ఉత్పత్తిచేసే ఏ వ్యక్తయినా, ఏ సంస్థ అయినా ఈ- ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లలో పాల్గొనవచ్చునని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అనే పరిమితులు లేవన్నారు. వరంగల్‌ జిల్లాకు చెందిన ఒక సంస్థ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిందని, ఆ సంస్థ టెండర్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించిందని తెలిపారు. సదరు సంస్థ పాల్గొన్న 8 జిల్లాల్లో టెండర్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. ఆ జిల్లాల్లో టెండర్ల ప్రక్రియను తిరిగి సజావుగా నిర్వహిస్తాయని తెలిపారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం చేపడుతున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో, మత్స్యకారుల కుటుంబాలు ఆర్థిక పరిపుష్టిని సాధించాయని, మత్స్యకారుల కుటుంబాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌  భరోసా కల్పించారని ఆయన అన్నారు. 

Updated Date - 2020-08-13T07:34:52+05:30 IST