1200కి.మీ. తండ్రిని సైకిల్‌పై తీసుకెళ్లిన బాలిక గురించి ఇవాంకా ట్రంప్ ట్వీట్..

ABN , First Publish Date - 2020-05-23T20:52:18+05:30 IST

బిహార్‌లోని దర్భాంగాకు చెందిన 15 ఏళ్ల జ్యోతి కుమారి అనే బాలిక‌ త‌న తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీట‌ర్ల మేర సైక్లింగ్ చేసి సొంతూరికి తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే.

1200కి.మీ. తండ్రిని సైకిల్‌పై తీసుకెళ్లిన బాలిక గురించి ఇవాంకా ట్రంప్ ట్వీట్..

భార‌తీయ బాలిక అద్భుత‌మైన సాహ‌సమే చేసింది: ఇవాంక‌


బిహార్‌లోని దర్భాంగాకు చెందిన 15 ఏళ్ల జ్యోతి కుమారి అనే బాలిక‌ త‌న తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీట‌ర్ల మేర సైక్లింగ్ చేసి సొంతూరికి తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆ అమ్మాయికి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఆహ్వనించ‌డంతో పాటు ఉచితంగా శిక్షణ ఇస్తామని పేర్కొంది. ఇదిలాఉంటే... ఇప్పుడు జ్యోతి కుమారికి మరో అరుదైన ప్రశంస దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ప్రధాన సలహాదారు ఇవాంక ట్రంప్..  జ్యోతిపై ప్రశంసల వ‌ర్షం కురిపించారు. బాలిక ఏకంగా 1200  కిలోమీటర్లు సైక్లింగ్ చేయ‌డం ఆశ్చర్యానికి గురి చేసిందని ఇవాంక పేర్కొన్నారు. "ఆమె అద్భుతమైన ఫీట్ చేసిందని, తన తండ్రిపై ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని ఆమె కొనియాడారు. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి అద్భుతమైన ఫీట్ సాధించడం గొప్ప విషయం" అంటూ ట్వీట్ చేశారు.





జ్యోతి కుమారి ఈ అద్భుత‌మైన సాహ‌స యాత్ర వెనుక ఉన్న అస‌లు క‌థ ఇదే...

బిహార్‌లోని దర్భాంగాకు చెందిన 15 ఏళ్ల జ్యోతి కుమారి ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్థిని. ఆమె కుటుంబం ఉపాధి నిమిత్తం హ‌ర్యానాలోని గుర్‌గ్రామ్‌ చేరింది. తండ్రి మోహన్‌ పాసవాన్‌ ఆటోరిక్షా నడిపేవాడు. అయితే కరోనా లాక్‌డౌన్‌తో పనిలేకపోవడంతో ఆటోరిక్షా యజమాని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంతకుముందే ప్రమాదంలో పాసవాన్‌ గాయపడడం... లాక్‌డౌన్ కావ‌డం వ‌ల్ల వేరే ప‌ని కూడా దొర‌క‌లేదు. దాంతో ఇంటి అద్దె కట్టలేని ప‌రిస్థితి దాపురించింది. ఇక తండ్రి ఆర్థిక ప‌రిస్థితి గురించి తెలిసిన జ్యోతి... ఇంటి యజమాని ఖాళీ చేయాలని చెప్ప‌క‌ముందే స్వస్థలానికి వెళ్లిపోవాలనుకుంది. ఓ ట్రక్‌ డ్రైవర్‌ను అడిగితే దర్భాంగా వెళ్లేందుకు రూ. 6,500 అడిగాడు. కానీ వారి చేతిలో ఉన్న‌ది కేవ‌లం రూ. 600 మాత్ర‌మే.


దాంతో చేసేదేమిలేక రూ. 500 పెట్టి ఓ పాత సైకిల్ కొనుగోలు చేసింది. అనంత‌రం తండ్రిని వెనక కూర్చోబెట్టుకొని ఈనెల 10న గుర్‌గ్రామ్ నుంచి జ్యోతి తన ప్రయాణం ప్రారంభించింది. రోజుకు 100-150 కిలోమీట‌ర్ల‌ చొప్పున రాత్రనక పగలనక సైకిల్‌ తొక్కింది. తొమ్మిది రోజుల పాటు సైక్లింగ్ చేసి 1200 కి.మీ. దూరంలోని దర్భాంగాకు ఈనెల 18న చేరుకుంది. ఇలా 15 ఏళ్ల జ్యోతి కుమారి పెద్ద‌ సాహ‌స యాత్ర చేసింది. జ్యోతి చేసిన సాహసం సోషల్‌మీడియాలో వైరల్ కావ‌డంతో నెటిజన్లు ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెప్పారు. ఇప్పుడు ఏకంగా అగ్ర‌రాజ్యం అధ్య‌క్షుడి కుమార్తె సైతం జ్యోతిని ప్ర‌శంసించ‌డం విశేషం. 


Updated Date - 2020-05-23T20:52:18+05:30 IST