జర్నలిస్టులను ప్రభుత్వం ఫ్రoట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలి: ఐ.వి.సుబ్బారావు

ABN , First Publish Date - 2021-05-18T18:49:24+05:30 IST

జర్నలిస్టులందరినీ ప్రభుత్వం ఫ్రoట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి 50 లక్షల రూపాయల బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు డిమాండ్ చేశారు.

జర్నలిస్టులను ప్రభుత్వం ఫ్రoట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలి: ఐ.వి.సుబ్బారావు

ప్రకాశం: జర్నలిస్టులందరినీ ప్రభుత్వం ఫ్రoట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి 50 లక్షల రూపాయల బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు డిమాండ్ చేశారు. మంగళవారం సీఎం జగన్‌కు ఐ.వి.సుబ్బారావు లేఖ రాశారు. ఏపీలో పనిచేస్తున్న జర్నలిస్టులందరినీ ప్రభుత్వం ఫ్రoట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించటంతో పాటు కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని లేఖలో సీఎం జగన్‌ని కోరారు. ఏపీలో జర్నలిస్టులందరికీ ప్రభుత్వం వాక్సినేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కరోనా సమయంలో జర్నలిస్టులను ఆదుకోకపోగా భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా మీడియా సంస్థలపై కేసులు పెడుతున్నారని చెప్పారు.


కరోనా మొదటి వేవ్‌లో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల సాయం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినా ఇంత వరకూ పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. సెకండ్ వేవ్‌లో మరో 70 మందికి పైగా జర్నలిస్టులు కరోనాతో మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాల్సిన సమాచార శాఖ మంత్రి ఎక్కడున్నారో ఎవరికి తెలియదని చెప్పారు. జర్నలిస్టులకు సీఎం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ఉన్న అన్నీ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు. ఏపీలో కరోనా వైద్యం చేయించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకలు కూడా లభించని దయనీయ స్థితిలో జర్నలిస్టులు ఉన్నారని ఐ.వి.సుబ్బారావు లేఖలో తెలిపారు.

Updated Date - 2021-05-18T18:49:24+05:30 IST