వ్యాక్సినేషన్‌కు వేళయింది!

ABN , First Publish Date - 2021-01-16T06:31:20+05:30 IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. కొంత కాలంగా ప్రపంచాన్ని వణికించిన కరోనాను నివారించేందుకు వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించనున్నారు.

వ్యాక్సినేషన్‌కు వేళయింది!
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సిద్ధమైన వ్యాక్సినేషన్‌ కేంద్రం

 జిల్లావ్యాప్తంగా 29కొవిడ్‌ టీకా కేంద్రాల ఏర్పాటు

 తొలిరోజు 2,900మంది మెడికల్‌ స్టాఫ్‌కు వ్యాక్సిన్‌ 

 సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తే సిద్ధంగా వైద్య సదుపాయాలు


చిత్తూరు, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. కొంత కాలంగా ప్రపంచాన్ని వణికించిన కరోనాను నివారించేందుకు వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించనున్నారు.  కేంద్ర నిర్ణయం ప్రకారం తొలి దశలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన మెడికల్‌ స్టాఫ్‌కు వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 37,703 మందికి మొదటి విడతలో వ్యాక్సిన్‌ వేసేలా జాబితా సిద్ధం చేయగా.. జిల్లాకు 41,500 డోసుల వ్యాక్సిన్‌ అందిన విషయం తెలిసిందే. ఇందుకోసం 29 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలిరోజు కేంద్రానికి వంద మంది చొప్పున 2,900 మందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. రెండో విడతలో పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్‌ శాఖకు చెందినవారికి, మూడో విడతలో 50 ఏళ్ల పైబడిన వారికి, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ఆయా సచివాలయాలు, ఆస్పత్రుల వద్ద వ్యాక్సిన్‌ వేస్తారు. వ్యాక్సిన్‌ వేశాక సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తే చికిత్స చేసేందుకు తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని ఇన్‌చార్జి కలెక్టర్‌ మార్కొండేయులు తెలిపారు. 108 అంబులెన్సులతోపాటు అవసరమైతే తిరుపతి, చిత్తూరు ప్రధాన ఆస్పత్రులకు బాధితులను తీసుకొస్తారని వివరించారు. వ్యాక్సినేషన్‌ ప్రారంభోత్సవం, వసతులపై జేసీ వీరబ్రహ్మం శుక్రవారం సాయంత్రం వైద్యఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, వ్యాక్సిన్‌ వేసే కేంద్రంలో పనిచేసే సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను ముఖ్య అతిథులుగా పిలిచి కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు. సిబ్బంది కేంద్రాలకు ఉదయం ఎనిమిది గంటలకు చేరుకోవాలన్నారు. తొమ్మిది గంటలకే పని ప్రారంభించాలని చెప్పారు. వ్యాక్సిన్‌ వేసుకున్న వ్యక్తిని 30 నిమిషాల పాటు వైద్యులు పరిశీలనలో ఉంచుకోవాలన్నారు. కాగా.. నియోజకవర్గానికి రెండు కేంద్రాల చొప్పున 28 కేంద్రాలు, చిత్తూరులో అదనంగా ఒకటి ఏర్పాటు చేయడంతో ఈ సంఖ్య 29కు చేరింది. చిత్తూరులో మూడు కేంద్రాలుండగా.. వాటిలో రెండు (అపోలో మెడికల్‌ కాలేజీ, ఆర్వీఎస్‌ ఆస్పత్రి) ప్రైవేటువి. అలాగే తిరుపతిలో స్విమ్స్‌, రుయా ఆస్పత్రులకు సంబంధించి మెడికల్‌ కాలేజీ ఆడిటోరియంలో ఒకే వేదికను ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్‌వో పెంచలయ్య తెలిపారు. శనివారం ఉదయం స్విమ్స్‌ కేంద్రంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మధ్యాహ్నం మెటర్నిటీ కేంద్రంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మిగిలినచోట్ల ఆయా ఎమ్మెల్యేలు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.


వ్యాక్సినేషన్‌ కేంద్రాలివే..


నియోజకవర్గం కేంద్రం పేరు


తిరుపతి స్విమ్స్‌, ప్రభుత్వ మెటర్నిటీ (రుయా) ఆస్పత్రి

పీలేరు కలకడ, గుర్రంకొండ పీహెచ్‌సీలు

మదనపల్లె         మదనపల్లె పీపీ యూనిట్‌, నిమ్మనపల్లె పీహెచ్‌సీ

తంబళ్లపల్లె         పీటీఎం, కురబలకోట పీహెచ్‌సీలు

పుంగనూరు         చౌడేపల్లె, సోమల పీహెచ్‌సీలు

పలమనేరు         గంగవరం, పెద్దపంజాణి పీహెచ్‌సీలు

కుప్పం శాంతిపురం, గుడుపల్లె పీహెచ్‌సీలు

పూతలపట్టు         తుంబకుప్పం, ఐరాల పీహెచ్‌సీలు

జీడీనెల్లూరు         కార్వేటినగరం, జీడీనెల్లూరు పీహెచ్‌సీలు

చంద్రగిరి మంగళం, భాకరాపేట పీహెచ్‌సీలు

సత్యవేడు నారాయణవనం, సత్యవేడు పీహెచ్‌సీలు

పుత్తూరు పుత్తూరు, నగరి మున్సిపాలిటీ ఆస్పత్రులు

శ్రీకాళహస్తి         శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి, రేణిగుంట పీహెచ్‌సీ

చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, 

        అపోలో మెడికల్‌ కాలేజీ, ఆర్వీఎస్‌ ఆస్పత్రి


Updated Date - 2021-01-16T06:31:20+05:30 IST