త్యాగాల కొలిమిలో మొలిచిన ఉక్కు అది!

ABN , First Publish Date - 2021-02-18T06:20:17+05:30 IST

వాళ్లందరూ ఢిల్లీకి వెళ్లి అట్లా అడుగుతుంటే, ఆశ్చర్యం కాదు కానీ భయం కలుగుతోంది. రేపు దేశాన్ని అమ్మేసినా వీళ్లిట్లే ఉంటారేమో?...

త్యాగాల కొలిమిలో మొలిచిన ఉక్కు అది!

వాళ్లందరూ ఢిల్లీకి వెళ్లి అట్లా అడుగుతుంటే, ఆశ్చర్యం కాదు కానీ భయం కలుగుతోంది. రేపు దేశాన్ని అమ్మేసినా వీళ్లిట్లే ఉంటారేమో? విశాఖ ఉక్కును మొత్తంగా అమ్మేయకండి, కావాలంటే కొంచెం కొంచెం కొరుక్కుతినండి, లేదంటే, దాన్ని ఇంకో దాంట్లో కలిపేయండి, అని మహాప్రభువులకు వారు విన్నవించుకుంటున్నారు. అమ్మేయడమయితే తప్పదు అని వారు మానసికంగా ముందే సిద్ధపడిపోయారన్నమాట అమ్మగూడదనే గట్టి ఆకాంక్ష కూడా వారికి ఉన్నట్టు లేదు. బహుశా ధైర్యం కూడా తక్కువే కావచ్చు. కానీ, జనం అడుగుతున్నారు, ఏదో చేయాలి, అడగాలి, అందుకని మధ్యేమార్గంగా ఇట్లా విన్నపాలు చేస్తున్నారు. రక్తం రాకుండా ప్రాణం తీయమని అడుగుతున్నట్టు ఉంది. వీళ్లు పరిష్కారంగా చెబుతున్నవి గతంలోనే చర్చకు వచ్చాయి. కొంచెం కొంచెంగా చంపే ప్రయత్నం పదేళ్ల కిందటే జరిగింది. అభివృద్ధి కావాలని, ఒక పరిశ్రమ కావాలని ప్రాణత్యాగం చేసి పోరాడిన ఉదంతం ఎక్కడా వినలేదని విశాఖ ఉక్కును అదే పనిగా ప్రశంసించిన మన్మోహన్ సింగ్ హయాంలోనే, పెట్టుబడుల ఉపసంహరణ పేరిట వాయిదాలవారీ హత్యకు కేంద్రం ఉత్సాహపడింది. కానీ, తెలుగు సమాజం, ఉక్కు కార్మికులు గట్టిగా ప్రతిఘటించాయి. చేతలు ఎట్లా ఉన్నా, చెవులను ఓరగా అయినా తెరచిపెట్టుకుని ఉన్న ప్రభుత్వం కాబట్టి, ప్రజాకాంక్షను కాస్త గౌరవించింది. అప్పటికింకా టూల్ కిట్ కుట్రకేసులు అలవాటు లేదు. అట్లా నాటి గండం గడిచింది. ఢిల్లీతో మాట్లాడేటప్పుడు తెలుగు వెన్నెముకలు ఎందుకు ఇంతగా వంగిపోతున్నాయి? 


విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన ఒక అద్భుత గాథ. ఫ్యాక్టరీని నిరాకరించడంలో, ఆడిన మాట తప్పడంలో, ఆందోళనల హెచ్చుతగ్గులలో పాలక రాజకీయ కుట్రలూ, ముఠాకలహాలు పనిచేయలేదని కాదు. పైకి కనిపించే కారణాలేవైనా, అసలు కారణం మాత్రం అసంతృప్తే. స్వాతంత్ర్యానంతరం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనంతరం కూడా అభివృద్ధి పథంలో మందకొడిగా మిగిలిపోవడం మీద యువతరంలో ఏర్పడిన నిస్పృహ, కావలసినది పోరాడి సాధించుకోవాలన్న 60వ దశకపు ఉద్యమాల ఉష్ణోగ్రత ఉక్కు ఉద్యమాన్ని నడిపించాయి, నిలబెట్టాయి, తీవ్రం చేశాయి. ఉద్యమం జరిగి చల్లారాక పాతికేళ్లకు కానీ అది చేతికి రాలేదు. మధ్యకాలంలోనూ నిరీక్షణ, నిరాశలు తప్పలేదు. తాబేటి నడకతో ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్నప్పుడే, సమాంతరంగా విశాఖపట్నం తన రూపును సవరించుకోసాగింది. వేల ఎకరాల భూమి, వేల మంది కార్మికులు, ముడిపడిన అనేక వ్యవస్థలు.. నౌకాశ్రయంతో నౌకాదళంతో సంపన్నమై ఉండిన నగరం జనంతో, నూతన ఉపాధులతో, కొత్త ఆదాయాలతో మరింతగా వర్థిల్లింది. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చిన మార్పును వేరు చేసి చూపలేము. కోరి, పోరి సాధించుకున్నామన్న గర్వం విశాఖ జీవులకే కాదు, తెలుగు వారందరికీ ఉంటుంది. ఉక్కు ఉద్యమంలో ప్రాణత్యాగాలు వరంగల్‌లోను, ఆదిలాబాద్‌లో కూడా జరిగాయి. 


ఇప్పటి యువకులకు ఈ చరిత్ర తెలియదని కొందరు అంటుంటారు. ప్రజాస్వామిక కార్యక్షేత్రంలో పనిచేసే యువకులలో ఈ విషయాలు తెలిసినవారు తగినంత మంది ఉన్నారు. తెలియనిది ఇప్పటి పాలక తరానికి. వీరికి దేన్నీ పోరాడి గెలుచుకున్న అనుభవం లేదు. పరుల పోరాటాన్ని హస్తగతం చేసుకోవడం, ఇతరుల ప్రాణత్యాగాల ఫలితాన్ని అనుభవించడం తెలుసు కానీ, ప్రజాజీవితంలో ఉండితీరవలసిన ఉద్వేగాలు ఆవేశాలు వారికి పెద్దగా పరిచయం లేదు. ముఠా కక్షలలోను, ప్రత్యర్థి పార్టీలతో ఘర్షణలలోను ఆవేశకావేశాలు లేవని కాదు, పోలీసులు గురిపెట్టి సిద్ధంగా ఉన్నా, అంగుళం కూడా కదలకుండా అక్కడే నిలబడి ఉండడమేంటో వీరికి తెలియదు. 1966 నవంబర్ ఒకటో తేదీన విశాఖలో పోలీసు కాల్పులకు జి కృష్ణారెడ్డి, తిరుపతయ్య, కొలిశెట్టి బాలకృష్ణ, జి. సాంబశివరావు, ఎమ్. పున్నయ్య, షేక్ అహ్మద్, కె. ఏసు చచ్చిపోయారు. వారితో పాటు, తొమ్మిదేళ్ల బాలుడు బాబూరావు కూడా చచ్చిపోయాడు. వీరితో మొదలై, నాటి ఉమ్మడి రాష్ట్రమంతా కలిపి మొత్తం 32 మంది చనిపోయారు. వీరందరి నెత్తురే కదా ఉక్కు ఫ్యాక్టరీ, నిరంతరం మండుతూ ఉండే ఫ్యాక్టరీ కొలిమిలో వారి జ్ఞాపకం సజీవంగా ఉన్నది కదా? ఎట్లా అమ్ముతారు? అమ్ముతామనే మాట అనడానికి నోరెట్లా వస్తుంది? ఆ మాట అంటున్నవారిని నిలదీయడానికి ఎందుకు గొంతులు పెగలడం లేదు? తెలుగువారి ఆత్మగౌరవం ఏమయిపోయింది, కాంగ్రెస్‌కు సామంతం చేయము, రాజన్న రాజ్యం తెస్తామన్నవారి స్వాభిమానం ఏమయింది? ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం ఎందుకు భగ్గుమని మండకుండా, ఇంకా ఇంకా గోరువెచ్చగానే స్పందిస్తున్నది? యావత్ ఆంధ్రదేశమో, లేక కనీసం విశాఖ నగరమో ఒక బంద్ జరగడమైనా ఇటువంటి సందర్భాలలో చూస్తామే, మరి కేవలం గాజువాక బంద్ మాత్రమే సాధ్యపడింది? రాష్ట్ర విభజన జరగడానికి ముందు, ఆ తరువాత దిగ్ర్భాంతితోను, నిస్పృహతోను ప్రజాస్వామిక చైతన్యం కొంతవరకు అణగారిపోయి ఉండవచ్చు. ఈ స్థితి దీర్ఘకాలం కొనసాగరాదని గుర్తించినవారున్నారు. ఆంధ్రప్రదేశ్ తన సొంత ప్రజాస్వామిక, సాంస్కృతిక క్రియాశీల సమాజాన్ని శీఘ్రంగా నిర్మించుకుంటున్నది. అందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం గొప్ప ప్రజాస్వామిక అవకాశం కూడా. అవకాశవాద రాజకీయపార్టీల మీద ఆధారపడకుండా, సొంతంగా ఉద్యమాన్ని నిర్మించగలిగితే, పార్టీలు అవే వస్తాయి. ఢిల్లీ రైతుల ఉద్యమాన్ని చూసి, కార్మికులు ఉద్యోగులు కూడా కొన్ని అంశాలు నేర్చుకోవాలి. ఒకటి– దీర్ఘకాలపు సన్నద్ధత, రెండు– ఐకమత్యం, మూడు– వెలుపలి నుంచి మాత్రమే రాజకీయ పార్టీల మద్దతును తీసుకోవడం. 


కార్యనిర్వాహక రాజధాని చేయడం ద్వారా విశాఖకు కొత్త వైభవం తెస్తానని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం, ఆ నగరాన్ని ఇంత సంపన్నం చేసిన ఒక వ్యవస్థ పరాధీనం అవుతుంటే చూపవలసినంత వ్యతిరేకత చూపకపోవడం విచిత్రం. విశాఖపట్నాన్ని, అక్కడి సమాజాన్ని ఎంతగా పట్టించుకుంటామనే దానికి ఉక్కు పరిరక్షణ వైఖరి ఒక కొలమానం. రాజధాని ఎప్పుడు వచ్చేనో, వచ్చేనో లేదో, వచ్చినా కొత్తగా వచ్చే అభివృద్ధి ఏమో తెలియదు కానీ, పోస్కో చేతికి ఫ్యాక్టరీ వెడితే మాత్రం, జరిగిన అభివృద్ధికే ప్రమాదం ఏర్పడుతుంది. కొనుక్కున్నవాడికి ఫ్యాక్టరీ నడిపి తీరవలసిన అవసరం లేదు. భూములను ప్లాట్లు చేసి అమ్మినా ఆశ్చర్యం లేదు. నామమాత్రపు పరిహారంతో భూములిచ్చినవారు, ఆరువేల ఎకరాలు ఇచ్చిన కురుపాం రాజా, అందరి త్యాగమూ అపహాస్యమే కదా? 


తక్కిన ప్రభుత్వరంగ సంస్థలను అంగట్లో అమ్మవచ్చు, ఒక్క విశాఖ ఉక్కు మాత్రమే పవిత్రమైనది, అని చెప్పడం కాదిది. ప్రజారంగానికి చెందిన దేనినైనా ప్రైవేటు పరం చేయడం అన్యాయం. మన ప్రయత్నాలు, ఆవేశాలు, తపనలు ముడిపడి ఉన్న అంశాల గురించి ఇక్కడ ప్రస్తావన. జీవిత బీమా సంస్థను మాత్రం అమ్మవలసిన పనేమిటి? ఉక్కు ఫ్యాక్టరీకి, ప్రభుత్వం దయవల్లనే కావచ్చును, రెండు మూడేళ్లు నష్టం వచ్చింది. ఎల్ఐసికి అది కూడా లేదే? మీరు పెట్టుబడుల ఉపసంహరణ చేసి ఎంత డబ్బు గడిద్దామనుకుంటున్నారో, అంత డబ్బు మా నిల్వ నిధుల నుంచి ఇవ్వగలము అని బీమా ఉద్యోగులు అంటున్నారు. జీవితబీమాను ప్రయివేటీకరించడం అంటే, ఎల్‌ఐసిలో బీమాకు కొనసాగుతున్న ప్రభుత్వ పూచీని ఉపసంహరించడం కూడా. రెండు చేతులు అడ్డుపెట్టి జీవిత దీపాన్ని ఆరిపోకుండా కాపాడే ఒక చిన్న భరోసా జీవిత బీమా. ముఖ్యంగా మధ్యతరగతి వేతన జీవులకు, గత అరవయ్యేళ్లుగా దానితో అనుబంధం ఉన్నది. పైగా, ప్రభుత్వానికి ఎప్పుడు ఏ ఆర్థిక అత్యవసరం వచ్చినా ఎల్ఐసి కాపాడుతుంది. మార్కెట్ కల్లోలాన్ని తన నిధులు గుప్పించి ఉపశమింపజేస్తుంది. తమకు చెందినవని, తమకోసమే పనిచేస్తున్నవని భావించిన అనేక వ్యవస్థలు విక్రయానికి గురి అవుతున్నప్పుడు, మనసు మెలిపెట్టే బాధ కలుగుతుంది. పరాయిప్రపంచంలో మెలగుతున్నట్టు అనిపిస్తుంది. 


అన్నిటినీ అమ్మేయడంలోనే అభివృద్ధిని చూసే సిద్ధాంతులు ఉంటారు. మార్కెట్ శక్తుల పోటీలో నిలబడగలిగేవే మనుగడ సాగించాలని వాదిస్తారు. నష్టంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఎవరూ కొనరు వాటిని మూసేయాలి, లాభాల్లో ఉన్నవాటిని అమ్మేయాలంటారు. లాభాల్లో ఉన్నవాటి లాభదాయకతను, వాటి స్థిరచరాస్తులను అతి తక్కువ విలువను మదింపు చేసి అస్మదీయులకు బదలాయింపు చేయడం ఆర్థిక సంస్కరణల కాలంలో ఒక రివాజు. ప్రభుత్వాలు ఫ్యాక్టరీలు నడపాలా, హోటళ్లు నడపాలా, బీమా కంపెనీలు నడపాలా, ప్రభుత్వాలు నిర్వహించడానికి వేరే ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి కదా అంటారు. మరి మద్యం వ్యాపారం మాత్రం ప్రభుత్వమే నడపాలా? పోలీసుల చేత, ఉద్యోగుల చేత అమ్మించాలా?


కె. శ్రీనివాస్

Updated Date - 2021-02-18T06:20:17+05:30 IST