రోబోలతో వార్తలు చెప్పిస్తే సరి!

ABN , First Publish Date - 2021-09-19T05:45:19+05:30 IST

ప్రొ.పులికొండ సుబ్బాచారి ‘భాషానిష్ఠ లేని తెలుగు ఛానళ్లు’ శీర్షికన సెప్టెంబర్‌ 12వ తేదీ ‘ఆంధ్రజ్యోతి’లో రాసిన వ్యాసం చదివాక కొన్ని విషయాలు పంచుకోవాలనిపించింది. ఏ జాతి అస్తిత్వమైనా ఆ జాతి భాషతోనే ముడిపడి ఉంటుందనడం నిర్వివాదం....

రోబోలతో వార్తలు చెప్పిస్తే సరి!

ప్రొ.పులికొండ సుబ్బాచారి ‘భాషానిష్ఠ లేని తెలుగు ఛానళ్లు’ శీర్షికన సెప్టెంబర్‌ 12వ తేదీ ‘ఆంధ్రజ్యోతి’లో రాసిన వ్యాసం చదివాక కొన్ని విషయాలు పంచుకోవాలనిపించింది. ఏ జాతి అస్తిత్వమైనా ఆ జాతి భాషతోనే ముడిపడి ఉంటుందనడం నిర్వివాదం. మనమంతా ఒక జాతిగా మనుగడ సాగిస్తున్నామంటే మనల్ని కలిపి ఉంచిన బంధం తెలుగే. అయితే ఏ భాషా ఏకరీతిలో ఉండదు. ప్రాంతాలను బట్టి, అవసరాలను బట్టి, చారిత్రక కారణాలను బట్టి ఆ భాషలో కొత్త పదాలు చేరి ప్రత్యేక మాండలికాలు మొగ్గతొడుగుతాయి. ముస్లిం నవాబుల ఏలుబడిలో తెలంగాణ చాలాకాలం ఉన్నందునే ఆ ప్రాంత తెలుగు భాషలో ఉర్దూ పదాలు ప్రవేశించాయి. తద్వారా తెలంగాణ తెలుగు ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. 


కోస్తా ఆంధ్ర ప్రాంతంలో మొదటి నుంచి సాగునీటి వసతులు ఉండడం, సమృద్ధిగా అన్నిరకాల పంటలు పండడంతో వ్యవసాయం ద్వారా సమకూరిన మిగులు ఆదాయాన్ని సినిమాలు, పరిశ్రమల్లోకి మళ్లించారు. తొలితరం నిర్మాతలు, రచయితలు, దర్శకులు, కోస్తా ప్రాంతం వారే కావడంతో అక్కడి భాషనే తమ సినిమాల్లో వాడారు. సినిమాలకు ఉన్న ప్రాచుర్యం, ప్రభావాలతో కోస్తా భాషే ప్రామాణిక భాషగా చలామణీలోకి వచ్చింది. సినిమా మాధ్యమం ద్వారా తొలి తాంబూలం అందుకోబట్టే కోస్తా పలుకుబళ్లూ విస్తృతంగా వాడకంలోకి వచ్చాయి. నిజానికి తెలంగాణ మాండలికం మాదిరి, కోస్తా ఆంధ్ర భాష కూడా ఆ ప్రాంత ప్రజలకు పరిమితమైన మాండలిక భాషే. సినిమాల్లో విలన్లకూ, రౌడీలకూ పరిమితం చేసి తెలంగాణ పలుకుబడికి తీరని అపచారం చేశారన్న నిరసనలూ ఒక దశలో వ్యక్తమయ్యాయి. ఇదంతా గతం. ఇప్పుడు వెండితెరపై తెలంగాణం సరికొత్త హోయలు పోతున్నది. 


ప్రజల భాషారీతులను తీర్చిదిద్దడంలో సినిమాలు, రేడియో, టీవీలు, పత్రికలు వంటి జన మాధ్యమాలు విశేష ప్రభావం చూపుతాయి. వీటి మధ్య ఉన్న మౌలిక తేడాలు, పరిమితులను భాషాభిమానులు గుర్తుంచుకోవాలి. పత్రికలు అక్షరాస్యులకు మాత్రమే ఉద్దేశించినవి. వాటిని నింపాదిగా చదువుకోవచ్చు. పత్రికల భుజాలు పెద్దవి. రాజకీయాలు సహా పలు రకాల వార్తలను, ఆర్థికం, ఆహార్యం, క్రీడలు, సాహిత్యం వంటి అనేకానేక విషయాలపై వ్యాసాలను, విశ్లేషణలను వివరంగా, లోతుగా అందించే అవకాశం పత్రికల్లో ఉంటుంది. ఒక రాజకీయ పరిణామంపై విభిన్న కోణాల్లో చర్చిస్తూ వార్తను నాలుగు కాలాల్లో విపులంగా అందించే వీలుంది. 


రేడియో, టీవీలు, ఈ మధ్యనే విస్తృతి పెంచుకుంటున్న యూట్యూబ్‌ చానళ్లు, వెబ్‌సైట్లు, బ్లాగులు వేటికవే ప్రత్యేకతలు, పరిమితులు కలిగి ఉన్నాయి. ఆయా మాధ్యమాల లక్ష్య బృందాలు వేరు. శాటిలైట్‌ టెక్నాలజీ పుణ్యమా అని టీవీ ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో వీక్షించ వీలు ఏర్పడింది. అనకాపల్లి నుంచి అమెరికాలోని అట్లాంటా వరకు తెలుగు టీవీ వార్తలను ఏకకాలంలో చూస్తున్నారు. రేడియో మాధ్యమం ప్రధానంగా చెవి కోసం ఉద్దేశించినది. విన్పించడంతో పాటు దృశ్యాలను చూపగల సౌలభ్యం టీవీ మాధ్యమంలో ఉంది. 


రేడియో పూర్తిగా చెవికి మాత్రమే పరిమితమైనందున, మొదటిసారి వినగానే అర్థమయ్యే రీతిలో శ్రోత ఊహలకు రెక్కలు తొడిగేట్లు చెప్పగలగాలి. రేడియోలో ‘వార్తలు చదువుతున్నది’ అని చెప్పడమే పెద్ద పొరపాటు. వార్తలను లిఖిత రూపులోకి మలుచుకుని చెప్పడమంటే, పత్రికా వార్తలను చదివి విన్పించడమే అవుతుంది. ఇది రేడియో మాధ్యమ మౌలిక లక్షణానికి తూట్లు పొడవడమే. లిఖిత రూప వార్తలను చదివి విన్పించకుండా కేవలం చెవి కోసమే వార్తలను, విషయాలను అందించే ప్రయత్నాలు చేస్తే నిరక్షరాస్య గ్రామీణులకు వారి పలుకుబళ్లలోనే సమాచారాన్ని చేర్చ వీలవుతుంది. ఎఫ్‌.ఎం రేడియో రాకతో ప్రాంతీయ అవసరాలకు ఆయా ప్రాంత భాషలను వినియోగించగల అపురూప అవకాశాలు అందివచ్చాయి. ఎఫ్‌.ఎం రేడియో ద్వారా ట్రాఫిక్‌ సమాచారాన్ని, వాతావరణ సమాచారాన్ని ఎక్కడికక్కడ అందించగలుగుతున్నారు.


టీవీ వార్తల్లో తెలుగు తగ్గిపోయి, ఇంగ్లీషు పెరిగిపోయిందని భాషాభిమానులు బాధపడుతున్నారు. టీవీ మాధ్యమంలో కూడా వాడుక భాషే రాజ్యం ఏలుతోంది. జనసామాన్యం నిత్య వ్యవహారంలో వాడే భాషే టీవీల్లోకి దిగుబడి అవుతోంది. ప్రజలు తమ అవసరాల కోసం తెలుగు, ఇంగ్లీషు, హిందీ పదాలు వాడుతూ సంభాషిస్తారు. దీన్నెవరూ తప్పుపట్టలేరు. విషయం అవతలి వారికి భావఛాయ మారకుండా చేరడమే ప్రధానం, ప్రమాణం కూడా. ఇతర భాషా పదాలు లేకుండా తెలుగును మాట్లాడండి అని ఏ భాషోద్యమకారుడూ ప్రజలను శాసించలేడు. స్మార్ట్‌ఫోన్ బాగా అందుబాటులోకి వచ్చాక సిమ్‌కార్డు, చార్జింగ్‌, డిలీట్‌, ఫార్వర్డ్‌, షేరింగ్‌, బ్లాక్‌ వంటి పదాలన్నీ తెలుగేనన్నంతగా వాడకంలోకి వచ్చాయి. కరోనా పాడుకాలంలో క్వారంటైన్, వ్యాక్సినేషన్, డెల్టా వేరియంట్‌, బూస్టర్‌ డోస్‌ వంటి పదాలు వచ్చి చేరాయి. కొత్తగా పుట్టుకొస్తున్న ఈ పదాలకు పత్రికల వారు తెలుగులో పదాలను సృష్టించి వాడుతున్నారు. ఇంటర్నెట్‌కు వలగూడు, అంతర్జాలం పదాలను తెచ్చినా, ప్రజలు తమ దైనందిన అవసరాల్లో వాటిని వినియోగించడం లేదు. నిజానికి, తరచి చూస్తే తెలుగులో తెలుగెంత? మూడుపాళ్లు సంస్కృత పదాలతోనే మన అవసరాలు తీర్చుకుంటున్నాం. అన్యభాషా పదాలను అరువు తెచ్చుకుని వాడుకుంటున్నాం. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు తగ్గట్టుగా ఎదగడమే ప్రతి భాషలోని గొప్ప జీవలక్షణం.


టీవీ వార్తలను ప్రపంచవ్యాప్తంగా చూస్తారు కనుక అందరికీ కమ్యూనికేట్‌ కాగల స్పోకెన్ భాషను వాడక తప్పదు. దీనికి తోడు ఆ వార్తలను ప్రధానంగా పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి వారు చూస్తుంటారు. టీవీ వార్తలను ప్రెజెంట్‌ చేస్తారు. అందుకే వార్తలు చెప్పే వారిని ‘న్యూస్‌ ప్రెజంటర్‌ ’ అంటున్నారు. సహజంగానే ఒక వ్యక్తి తెర ముందుకు వచ్చినప్పుడు కట్టుబొట్టు నుంచి వార్తలు చెప్పే తీరు, ప్రకటించే భావోద్వేగాల సరళి వంటి అంశాల పాత్ర కూడా అనివార్యంగా ఉంటుంది. బిబిసిలో వార్తలను సాదాసీదాగా చెప్తారు కనుక మనమూ అలాగే చెప్పాలనడంలో హేతుబద్ధత లేదు. ఒలింపిక్స్‌లో భారత్‌ గోల్డ్‌మెడల్‌ సాధించిన వార్తను ఏ భావం లేకుండా, మొక్కుబడిగా చెప్పడాన్ని ఏ భారతీయుడూ హర్షించడు. ఆ వార్త చెప్పేటప్పుడు జోష్‌ ఉండాల్సిందే. తామే ఆ పతకం సాధించామన్న ఆనందంలో ప్రతి ఒక్కరూ ఉంటారు కనుక న్యూస్‌ ప్రెజంటర్‌ అందుకు తగిన మూడ్‌ వ్యక్తం చేయాల్సిందే. వరద బీభత్సాలు, అత్యాచార ఘటనల గురించి చెప్పేటప్పుడు వాటికి తగ్గట్లు భావోద్వేగాలు పలికించాల్సిందే. ఇవేవీ వద్దనుకుంటే రోబోలను ముస్తాబు చేసి టీవీ స్టూడియోల్లో కూచోబెట్టి వాటి చేత వార్తలను చెప్పిస్తే సరిపోతుంది. అప్పుడు తెలిసొస్తుంది, ఆ వార్తలెంత పేలవంగా ఉంటాయో? విషాదవార్తలు, ఉల్లాసభరిత వార్తలను వేర్వేరు స్వరాలతో వేర్వేరు ముఖకవళికలతో చదివేలా ప్రోగ్రామ్‌ను సెట్‌ చేయండనే డిమాండ్లూ రాకుండా ఉంటాయా? తప్పక వస్తాయి. ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా దొర్లకుండా వార్తలను ప్రెజంట్‌ చేయాలంటే, యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వను తెరముందుకు తేవలసిందే. గంగవ్వ సైతం ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా మాట్లాడకుండా వార్తలు చెప్పలేదు. కరోనా థర్డ్‌వేవ్‌, డెల్టా వేరియంట్‌, బూస్టర్‌ డోస్‌లు, జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలు–డీజిల్‌ తేవడం సహా నిర్మలమ్మ చెప్పే సవాలక్ష ఆర్థిక విషయాలు గంగవ్వ నోట వార్తలుగా ఎలా పలుకుతాయో చూడాలని ముచ్చటగా ఉంది. గంగవ్వా! ఎక్కడున్నా జరూరుగా టీవీ తెర ముందుకు రావాలె. 


టీవీ చానళ్ల ఆఫీసుల ముందు ఆందోళనలు చేస్తామని అల్టిమేటమ్‌లు జారీచేసే బదులు, భాషా వినియోగానికి సంబంధించిన అన్ని విషయాలను సాకల్యంగా పరిశీలించాలి. భాషోద్యమకారులు పల్లెపట్టులకెళ్లి అక్కడి ప్రజల మాటలను సేకరించి, గ్రంథస్థం చేసి ప్రచారంలో పెట్టాలి. తమిళనాడులోని తెలుగు మూలాలున్న కుటుంబాల భాషను స.వెం.రమేశ్ ఎంతో ప్రయాసకోర్చి సేకరిస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అటువంటి కృషి జరగాలి. ఒక జాతి సంస్కారాలను, భాషను పెంచి పోషించేది ఆ భాషలో వెలువడే సాహిత్యమే. తెలుగులో వివిధ ప్రక్రియల్లో మంచి రచనలు వస్తున్నాయి. మాండలికంలో రాసేవారికీ కొదవలేదు. కాకుంటే చదివేవారే లేరు. పఠనాభిలాషను పెంపొందింప చేయడానికి భాషోద్యమకారులు, పాలకులు ఏం చేస్తున్నారు? గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వస్తున్నాయని వగచి ఏమి ప్రయోజనం? ఒక్క టీవీల వారినే పాపాల భైరవులను చేయడం ఎంతవరకు న్యాయం?

గోవిందరాజు చక్రధర్‌

Updated Date - 2021-09-19T05:45:19+05:30 IST