ఎమ్మెల్యేకు రెండేళ్ల శిక్షపై స్పందించిన ‘ఆప్’

ABN , First Publish Date - 2021-01-24T03:14:53+05:30 IST

2016 నాటి కేసులో ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)

ఎమ్మెల్యేకు రెండేళ్ల శిక్షపై స్పందించిన ‘ఆప్’

న్యూఢిల్లీ: 2016 నాటి కేసులో ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పందించింది. ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి కేసులో ఎమ్మెల్యేను నేడు దోషిగా తేల్చిన కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. న్యాయస్థానం తీర్పుపై ఆప్ స్పందించింది. తీర్పుపై సోమనాథ్ భారతి అప్పీలు చేశారని, అప్పిలేట్ స్థాయిలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందని పేర్కొంది.  


న్యాయవ్యవస్థను తాము గౌరవిస్తామని, దానిపై పూర్తి విశ్వాసం ఉందని ఆప్ తెలిపింది. అయితే, సోమనాథ్ కేసు విషయంలో మాత్రం అన్యాయం జరిగిందని వాపోయింది. ఆయన చాలా గొప్ప నేత అని, నియోజకవర్గంలో ఆయనను అందరూ గౌరవిస్తారని పేర్కొంది. ప్రజల కోసం ఆయన 24 గంటలూ పనిచేస్తారని తెలిపింది. సోమనాథ్‌కు శిక్ష పడిన విషయం తెలిసి నియోజకవర్గ ప్రజలు విచారంలో మునిగిపోయారని ఆప్ ఆవేదన వ్యక్తం చేసింది. 


 9 సెప్టెంబరు 2016లో సోమనాథ్ భారతి, మరో 300 మంది కలిసి జేసీబీ ఆపరేటర్ సాయంతో ఎయిమ్స్ ప్రహరీకి ఉన్న ఫెన్సింగును తొలగించారు. ఈ క్రమంలో అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేసినట్టు  ఎయిమ్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆర్ఎస్ రావత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కేసును విచారించిన కోర్టు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు గాను సోమనాథ్ భారతిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉండగా, అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే, ఇదే కేసులో సహ నిందితులైన జగత్ సైనీ, దిలీప్ ఝా, సందీప్ సోను, రాకేశ్ పాండేలపై తగిన సాక్ష్యాధారాలు లేనందున నిర్దోషులుగా ప్రకటించారు.


Updated Date - 2021-01-24T03:14:53+05:30 IST