ఉద్యోగాలివ్వండి సారూ!

ABN , First Publish Date - 2020-07-04T10:39:05+05:30 IST

పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా మారిన ముత్తుకూరు మండలంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన కలగానే మారిపోతోంది.

ఉద్యోగాలివ్వండి సారూ!

పరిశ్రమల చుట్టూ యువత ప్రదక్షిణ

అమలుకు నోచుకోని ప్రభుత్వ హామీ

ఐటీఐ ఏర్పాటు కలేనా!?


పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రధానంగా జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మించిన దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం యాజమాన్యం స్థానికుల ఉద్యోగాల కల్పనలో నిర్లక్ష్యం చూపుతోంది. 2013లో జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో 301 ఉద్యోగాలు కల్పిస్తూ జీవో జారీ చేసింది. ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ స్థానికులకు కొలువులివ్వలేదు. దీనిపై స్థానికులు పలుమార్లు నిరసనలు, ఆందోళనలు చేపట్టినా ప్రయోజనం లేదు.


ముత్తుకూరు, జూలై 3 : పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా మారిన ముత్తుకూరు మండలంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన కలగానే మారిపోతోంది. పరిశ్రమలు ఏర్పాటు చేసే సమయంలో భవిష్యత్తులో మీ పిల్లలకు కావాల్సినన్ని ఉద్యోగాలు.. నైపుణ్య శిక్షణ కోసం ఐటీఐ సంస్థ ఏర్పాటు, అనంతరం స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ యాజమాన్యాలతోపాటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలు కురిపించారు. పరిశ్రమల అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇష్టారీతిన హామీలు గుప్పించిన యాజమాన్యాలు, వంత పాడిన అధికారులు తమ పబ్బం గడుపుకుని స్థానికులను మాత్రం త్రిశంకుస్వర్గంలో ఉంచేశారు. 


ఎన్నో పరిశ్రమలు ఉన్నా..

మండలంలో కృష్ణపట్నం పోర్టు, జెన్‌కో, గాయత్రి, ఎన్‌సీసీ థర్మల్‌ కేంద్రాలు, ఎనిమిది పామాయిల్‌ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటిలో కృష్ణపట్నం పోర్టు మాత్రమే తమ వంతుగా కేఎస్‌ఎస్‌పీఎల్‌ అకాడమీ ద్వారా సెక్యూరిటీ, వెల్డింగ్‌, డ్రైవింగ్‌, ఇతర రంగాల్లో యువకులకు, కుట్టులో మహిళలకు శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పించే దిశగా కృషి  చేస్తోంది. మిగిలిన పరిశ్రమలేవీ ఉద్యోగ, ఉపాధి కల్పనలో తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. 


ప్రత్యేక ఐటీఐ ఏర్పాటు కలే..

ఇప్పటికి పలుమార్లు ఎందరో అధికారులు, ప్రజాప్రతినిధులు  పదేపదే ప్రస్తావించే విషయం నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేక ఐటీఐ సంస్థ ఏర్పాటు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఎక్కడ స్థానికులు ఆందోళన చేపట్టినలు వ్యక్తం చేసినా సర్దుబాటు చేసేందుకు వెంటనే ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ఆ తర్వాత మర్చిపోవడం రివాజుగా మారింది.  నేడో, రేపో నైపుణ్య శిక్షణ సంస్థ వచ్చేస్తుందన్న ప్రచారంతోపాటు, మండల అధికారుల వెంటబడి మరీ మండలంలోని నిరుద్యోగుల జాబితా తయారు చేయించారు.


చక్కదిద్దాక జాబితాను బుట్టదాఖలు చేశారు. భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి విషయంలో మొండిచేయి చూపించారు. ఇప్పటివరకు ప్రత్యేక ఐటీఐ సంస్థ ఏర్పాటు ప్రస్తావనే లేదు. పరిశ్రమల రాకతో జీవితాలు మారిపోతాయి... ఉద్యోగాలు వెల్లువెత్తుతాయన్న హామీలతో నేటికీ మండలంలో ఎందరో నిరుద్యోగులు తమ బయోడేటా చేతపట్టుకుని తిరుగుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పరిశ్రమల యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తే తప్ప ఉద్యోగ, ఉపాధి కల్పనలో స్థానికులకు న్యాయం జరగదు.  

Updated Date - 2020-07-04T10:39:05+05:30 IST