15 నుంచి ఐటీఐ మూడో విడత కౌన్సిలింగ్‌

ABN , First Publish Date - 2020-12-06T04:59:12+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐ ప్రిన్సిపాల్‌ వై.ఉమాశంకర్‌ తెలిపారు.

15 నుంచి ఐటీఐ మూడో విడత కౌన్సిలింగ్‌

ఖాళీ సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం

ఈనెల 12వ తేదీ వరకు గడువు

కంచరపాలెం, డిసెంబరు 5: జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐ ప్రిన్సిపాల్‌ వై.ఉమాశంకర్‌ తెలిపారు. అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని తెలిపారు. విద్యార్థులు ఐటీఐ వెబ్‌సైట్‌ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఐటీఐ.నిక్‌.ఇన్‌ వెబ్‌ సైట్‌లో లాగిన్‌ అయి అర్హత వివరాలను నింపాల్సి ఉంటుందన్నారు. అందిన దరఖాస్తుల్లో మెరిట్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ విధానంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.


దరఖాస్తులను ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు ఏ ఐటీఐలో సీటు పొందాలనుకుంటే సదరు ఐటీఐకి మాత్రమే దరఖాస్తు చేయాలన్నారు. ఈనెల 15,16వ తేదీల్లో ప్రభుత్వ ఐటీఐల్లో మిగులు సీట్లుకు, 17, 18తేదీల్లో ప్రయివేటు ఐటీఐల్లో సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఆయా తేదీల్లో దరఖాస్తు చేసిన ఐటీఐలకు అన్నీ ధ్రువపత్రాలతో నేరుగా హాజరుకావాలని, ఇందుకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉండదని ఉమాశంకర్‌ తెలిపారు.

బాలికల ఐటీఐల్లో కూడా...

కంచరపాలెం పరిధి ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌ వద్ద గల ప్రభుత్వ బాలికల ఐటీఐలో రెండో విడత కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్లకు అర్హులైన బాలికల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఎల్‌.గౌరీమణి తెలిపారు. డ్రస్‌మేకింగ్‌, కోపా తదితర ట్రేడుల్లో మిగిలిన సీట్లను మూడో విడత కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తామన్నారు. బాలికలు ఆన్‌లైన్‌లో ఐటీఐ లింక్‌ ద్వారా ఈనెల 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, 15, 16 తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపారు. 


Updated Date - 2020-12-06T04:59:12+05:30 IST