సైనికాధికారులపై మహిళా లాయర్ హనీట్రాప్...ITBP issues warning

ABN , First Publish Date - 2021-12-04T16:06:33+05:30 IST

దేశంలోని సైనికాధికారులపై ఢిల్లీకి చెందిన ఓ మహిళా న్యాయవాది వలపు వల (హనీట్రాప్) విసిరిందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది....

సైనికాధికారులపై మహిళా లాయర్ హనీట్రాప్...ITBP issues warning

న్యూఢిల్లీ: దేశంలోని సైనికాధికారులపై ఢిల్లీకి చెందిన ఓ మహిళా న్యాయవాది వలపు వల (హనీట్రాప్) విసిరిందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) విభాగం ఢిల్లీకి చెందిన మహిళా న్యాయవాది నుంచి దూరంగా ఉండాలని భద్రతా అధికారులను హెచ్చరిస్తూ మెమోరాండం జారీ చేసింది. ఢిల్లీ మహిళా న్యాయవాది తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సైనిక రహస్య సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులతో తనకున్న సంబంధాన్ని ఉపయోగించుకుంటున్నట్లు ఐటీబీపీ నివేదించింది. భారత సైనికాధికారులతో మహిళా న్యాయవాది సంబంధాలు పెంపొందించుకోవడానికి యత్నిస్తున్నట్లు తేలింది.


సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, జేకేపీతోపాటు వివిధ ప్రభుత్వ మంత్రిత్వశాఖల రిటైర్డు, ఇన్ సర్వీసు అధికారులతో ఢిల్లీ మహిళా న్యాయవాది సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని హనీట్రాప్ చేసిందని సమాచారం.ఐటీబీపీ విభాగాల్లోకి మహిళా న్యాయవాది  రాకుండా నిషేధం విధించారు.ఢిల్లీ మహిళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఇంటెలిజెన్స్ స్కానర్ లో ఉంచి రెడ్ ఫ్లాగ్ చేశారు. సదరు ఢిల్లీ మహిళ ఇటీవల జమ్మూకశ్మీరులోని సున్నితమైన ప్రాంతాల్లో గడిపినట్లు తేలడంతో భద్రతా సంస్థలను అప్రమత్తం చేశారు.ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు ఐటిబీపీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు ఆమెను వెంట తీసుకెళ్లారని వెల్లడైంది.



గత ఏడాది కాలంలో మహిళా న్యాయవాది జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారని దర్యాప్తులో తేలింది.తీస్ హజారీ కోర్టుకు చెందిన జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా ఆ మహిళ నటిస్తోందని కూడా లిఖితపూర్వక సమాచారం పేర్కొంది.

Updated Date - 2021-12-04T16:06:33+05:30 IST