‘ఈటల’, బీజేపీ దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2021-10-20T04:36:32+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ ద్వారా దళితబంధు పథకాన్ని నిలుపుదల చేయించిందంటూ ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, బీజేపీ పార్టీ దిష్టిబొమ్మలను అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు జోగిపేట చౌరస్తాలో దహనం చేశాయి.

‘ఈటల’, బీజేపీ దిష్టిబొమ్మ దహనం
బీజేపీ, ఈటలను విమర్శిస్తూ నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌

జాతీయ రహదారిపై బైఠాయింపు, రాస్తారోకో

బీజేపీ దళిత వ్యతిరేకి అంటూ విమర్శలు

ఓడిపోతున్నారన్న భయంతోనే దళితబంధును ఆపేశారు : అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌

జోగిపేట, అక్టోబరు 19 : హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ ద్వారా దళితబంధు పథకాన్ని నిలుపుదల చేయించిందంటూ ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, బీజేపీ పార్టీ దిష్టిబొమ్మలను అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు జోగిపేట చౌరస్తాలో దహనం చేశాయి. ఈ సందర్భంగా బీజేపీకి, ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ 161వ జాతీయ రహదారిపై బైఠాయించడంతో పార్టీ శ్రేణులంతా అక్కడే కూర్చుండిపోయారు. రోడ్డుకిరువైపులా అరగంట పాటు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ బీజేపీ, ఈటలపై నిప్పులు చెరిగారు. హుజూరాబాద్‌లో ఓడిపోతామన్న భయంతోనే దళితబంధును కావాలని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నిలుపుదల చేయించిందని ఆరోపించారు. దళితబంధును కేసీఆర్‌ ఎన్నికలకు రెండునెలల ముందే ప్రారంభించారని, దానికి ఎన్నికలతో సంబంధం లేదన్నారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అన్నది నిజమని దళితబంధు నిలుపుదలతో స్పష్టమైందన్నారు. ఇక టీఆర్‌ఎ్‌సలో కేసీఆర్‌ తర్వాత అంతటి పేరు, ప్రఖ్యాతలను సంపాదించుకున్న ఈటల రాజేందర్‌.. కేసీఆర్‌ పేరు బద్నాం చేసి కోట్లాది రూపాయల నిధులు, వందల కొద్దీ ఎకరాల భూమిని సంపాదించుకున్నారని ఆరోపించారు. ఎన్ని కుయుక్తులు పన్నినా హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమని క్రాంతికిరణ్‌ ధీమా వ్యక్తం చేశారు. రాస్తారోకోలో మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ శేరి జగన్మోహన్‌రెడ్డి, హెచ్‌సీఏ సభ్యుడు మఠం భిక్షపతిస్వామి, జోగిపేట ఏఎంసీ చైర్మన్‌ ఎం.మల్లికార్జున్‌గుప్తా, మున్సిపల్‌ చైర్మన్‌ జి.మల్లయ్య, వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ కె.రమేశ్‌, మాజీ ఎంపీపీ హెచ్‌.రామాగౌడ్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ డిబి.నాగభూషణం, టీఆర్‌ఎస్‌ అందోలు, పుల్కల్‌ మండలాల అధ్యక్షులు లక్ష్మీకాంతరెడ్డి, విజయ్‌గుప్తా, పట్టణ అధ్యక్షుడు చాపల వెంకటేశం, నాయకులు లింగాగౌడ్‌, రవికుమార్‌ జైన్‌, పత్తి వీరేశంగుప్తా, పి.సత్యం, చందర్‌నాయక్‌, గాజుల నవీన్‌, గాజుల అనిల్‌, అనిల్‌రాజ్‌, మహేశ్‌యాదవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T04:36:32+05:30 IST