Sep 23 2021 @ 01:16AM

అటువంటి సమాజం రావాలంటే వందేళ్లు పడుతుందేమో!

‘‘నిత్యం సమాజంలో ఎంతోమంది మహిళలు ఎన్నో రకాలుగా వివక్షకు గురవుతున్నారు. నాకు వివక్ష ఎదురవకపోయినా... చాలామంది జీవితాల్లో చూశా. అయితే, చాలామంది వివక్షను తేలికగా తీసుకుంటారు. ఇప్పుడిప్పుడే కొంతమంది ధైర్యంగా తమకు ఎదురైన సమస్యలను చెబుతున్నారు. ఎటువంటి వివక్ష, అసమానతలు లేని సమాజం రావాలంటే వందేళ్లు పడుతుందేమో!?’’ అని సాయిపల్లవి అన్నారు. నాగచైతన్యకు జంటగా ఆమె నటించిన ‘లవ్‌ స్టోరి’ శుక్రవారం విడుదలవుతోంది. నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మించిన ఈ సినిమా, ఇతర అంశాల గురించి సాయి పల్లవి చెప్పిన విశేషాలివీ...


జార్జియాలో చదివేటప్పుడు లింగ వివక్షకు సంబంధించిన కథనాలు చదివి నిస్సహాయత వ్యక్తం చేసేదాన్ని. వ్యక్తిగతంగా నేనేమైనా చేయగలనా? అని ఆలోచించేదాన్ని. ఇప్పుడు సమస్యల్ని ప్రస్తావిస్తూ తెరకెక్కే చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నటిగా సమాజంలో మార్పు, మంచి కోసం ప్రయత్నించే కథల్లో నటించడం నా బాధ్యతగా భావిస్తా. ‘లవ్‌ స్టోరి’లో శేఖర్‌ కమ్ముల ప్రస్తావించిన అంశం గురించి విడుదలయ్యాక ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. ఆలోచిస్తారు. ఇందులో డ్యాన్స్‌ ఓ భాగమంతే!


‘లవ్‌ స్టోరి’లో మౌనిగా నటించా. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలమనే స్ఫూర్తినిస్తుందీ పాత్ర. శేఖర్‌ కమ్ముల కథ పంపించి ‘నచ్చిందా?’ అని అడిగారు. నాకో హిట్‌ (ఫిదా) ఇచ్చారు కాబట్టి ఈ సినిమా చేయాలని కోరుకోరు. చిన్న, పెద్దా తేడాలు చూడకుండా... నటీనటుల సమ్మతం ఆయనకెంతో ముఖ్యం! ప్రతి ఒక్కరి పట్ల మర్యాదగా ఉండాలని, సమస్యలపై ధైర్యంగా పోరాడాలని ఆయన్నుంచి నేర్చుకున్నా. సెట్‌లో అందరికీ ఆయన గౌరవమిస్తారు.


నాగచైతన్యతో తొలిసారి నటించా. మా వ్యక్తిత్వాల మధ్య సారుప్యతలున్నాయి. నైట్‌ పర్సన్స్‌ కాదు. అయితే... రాత్రివేళ నా పాత్ర చిత్రీకరణ ఉంటే త్వరగా పూర్తిచేసి నన్ను పంపమని చైతన్య చెప్పేవారు. నేను డ్యాన్స్‌ విషయంలో సహాయం చేశానని చెప్పడం తన మంచితనం. చైతన్యలో గ్రేస్‌ ఉంది. ఈ సినిమాతో బయటకొచ్చింది. ఒకవేళ నన్ను ఫైట్స్‌ చేయమంటే తప్పకుండా చైతన్య సహాయం తీసుకునేదాన్ని. 


‘లవ్‌ స్టోరి’ ప్రీ-రిలీజ్‌ వేడుకలో చిరంజీవిగారు అలా చెప్పడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. నాకు రీమేక్స్‌ అంటే భయం... మాతృకలో నటించిన తారల స్థాయికి మించి చేయాలి, అభినయం పరంగా కొత్తదనం చూపించాలనే ఒత్తిడి ఉంటుంది. అందుకని, రీమేక్స్‌కు దూరంగా ఉంటున్నా.


‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రీకరణ పూర్తయింది. డబ్బింగ్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉంది. ‘విరాట పర్వం’ చిత్రీకరణ ఒక్క రోజు చేయాల్సి ఉంటుందేమో! తెలుగు, తమిళ భాషల్లో కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. మలయాళంలో ఓ సినిమా అంగీకరించా. హిందీ నుంచి అవకాశాలొస్తున్నాయి. మంచి కథ వస్తే నటించడానికి నేను సిద్ధమే. ఇటీవల ఓ వెబ్‌ సిరీస్‌ ఐడియా విన్నాను. బావుంది. చర్చలు జరుగు తున్నాయి. కథ సిద్ధమయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.