50 వేల మందికి పట్టాలిస్తా

ABN , First Publish Date - 2022-10-07T08:30:15+05:30 IST

తాను ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడితే 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి వాగ్దానం చేశారు.

50 వేల మందికి పట్టాలిస్తా

  • నేను గెలిచి, కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడితే చేస్తా
  • కేసీఆర్‌ ఇచ్చే పెన్షన్‌ 5 ఏళ్లకు 1.80 లక్షలు
  • నేను ఇప్పించే ప్లాట్‌ విలువ రూ.10 లక్షలు 
  • సంగారెడ్డి ప్రజలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి హామీ

సంగారెడ్డి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తాను ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడితే 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి వాగ్దానం చేశారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చే పెన్షన్‌ ఐదేళ్లకు రూ.లక్షా 80 వేలే వస్తుందని.. తాను ఇవ్వనున్న 100 చదరపు గజాల స్థలం విలువ రూ.10 లక్షలు ఉంటుందన్నారు. అంటే తాను 20 ఏళ్ల పెన్షన్‌ ఒకేసారి ఇచ్చినట్టవుతుందని చెప్పారు. ఇంట్లో పెన్షన్‌ వచ్చే ముసలి వారు ఇద్దరు ఉంటే ఇద్దరికీ ప్లాట్‌ ఇస్తానని చెప్పారు. గత ఎన్నికల్లో తాను ఇదే హామీ ఇచ్చానని అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాకపోవడంతో ఆ హామీ అమలు కాలేదన్నారు. తమ ప్రభుత్వం ఉంటే తాను చెప్పింది చేస్తానన్న సంగతి ప్రజలకు తెలుసన్నారు. 50 వేల ఇళ్ల స్థలాల కోసం తనకు నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. సంగారెడ్డిలోని అంబేడ్కర్‌ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన దసరా వేడుకల్లో జగ్గారెడ్డి మాట్లాడారు. అంతకు ముందు ఆయన జమ్మి చెట్టుకు పూజలు చేసి, పాలపిట్టను ఎగరవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 


సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐఐటీ, ఇంటింటికీ మంజీరా నీళ్లు, రోడ్ల నిర్మాణం, ఆస్పత్రి అభివృద్ధి వంటి ఎన్నో పనులు చేయించానని పేర్కొన్నారు. ఓడిపోయాక కూడా మెడికల్‌ కాలేజీ కోసం మూడేళ్లు కొట్లాడానని చెప్పారు. 2018 ఎన్నికల్లో ప్రజలు గెలిపించిన తర్వాత అసెంబ్లీలో తన కోరిక మేరకు సీఎం కేసీఆర్‌ సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ మంజూరు చేశారని తెలిపారు. 2014 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పుడు కొందరు తనకు ఓటేవేయలేదని చెప్పారు. ఎందుకు వేయలేదని అడిగితే.. కేసీఆర్‌ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పాడని, అందుకే తనకు వేయలేదని చెప్పారని అన్నారు. ఉద్యోగాల పేరుతో ముఖ్యమంత్రి యువతను మోసం చేశారని జగ్గారెడ్డి విమర్శించారు.

Updated Date - 2022-10-07T08:30:15+05:30 IST