ఇక తగ్గేదెలే..!

ABN , First Publish Date - 2022-05-21T05:13:12+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.

ఇక తగ్గేదెలే..!

  1.  బాబు రాకతో  తమ్ముళ్లలో నూత నోత్తేజం
  2.   పర్యటన విజయవంతం
  3.  క్యాడర్‌లో జోష్‌
  4.   కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన అధినేత ప్రసంగం
  5.   2024 ఎన్నికలే లక్ష్యంగా నాయకులకు దిశానిర్దేశం
  6.  రాష్ట్రంలోనే తొలి టీడీపీ అభ్యర్థి ప్రకటన
  7.   డోన ధర్మవరం సుబ్బారెడ్డిదే అంటూ స్పష్టత
  8.   కష్టపడే వారికే సముచిత స్థానమని ఉద్ఘాటన

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.  చాగలమర్రి  నుంచి జలదుర్గం వరకు సాగిన పర్యటనలో... ఆయన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగిన విధానం క్యాడర్‌లో మరింత జోష్‌ పెంచింది. బాబు రాక కోసం అర్ధరాత్రి వరకూ జనం వేచి  ఉండి... ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలికారంటే... పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోనే తొలి టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని.. ఉత్సాహాన్ని నింపారు. జగన ప్రభుత్వ అకృత్యాలు.. వైఫల్యాలు ఎండగడుతూ ముందుకు సాగారు. ఓ వైపు జగన ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ.. మరో వైపు రాబోయే ఎన్నికల సంగ్రామానికి కార్యకర్తలను సన్నద్ధం చేస్తూ సాగిన ప్రసంగాలు  కార్యకర్తల్లో ఉల్లాసాన్ని నింపాయి.


(కర్నూలు- ఆంధ్రజ్యోతి): 

అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు మిగిలిన సమ యం రెండేళ్లే. ప్రభుత్వ పెద్దలు కొందరు చెబుతున్నట్టు జరిగితే ఏడాది, ఏడాదిన్నరలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలా ఉన్న ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల్లో రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో నిస్తేజంగా ఉన్న కార్యక ర్తల్లో ఉత్తేజం నింపి ఎన్నికల సంగ్రామనికి సన్నద్ధం చేయడం.. అదే క్రమంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వైఫల్యాలు, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్ర ఆర్థిక దీనస్థితి.. పెరుగుతున్న ధరలు, చార్జీలపై ప్రజల్లో చైతన్యం కలిగించే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు కదులుతున్నారు. ఈ క్రమంలో రాయలసీమ పర్యటనలో భాగం గా బుధవారం రాత్రి కర్నూలుకు చేరుకున్నారు. గురువారం ఉదయం 9.30 గంటల నుంచి అర్ధరాత్రి 1.30 వరకు అలుపెరగకుండా జిల్లాలో పర్యటించారు.

నేతలకు  దిశానిర్దేశం

మౌర్యఇన హోటల్‌ ప్రాంగణంలో చంద్రబాబు రాత్రి బస చేశారు. గురువారం ఉదయం 9.30 గంటలకే పార్టీ కీలక నాయకులతో సమావేశమయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిలతో విడివిడిగా మాట్లాడిన చంద్రబాబు ఆ తరువాత నంద్యాల, కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్‌, బీటీ నాయుడు, నియోజకవర్గ ఇనచార్జిలు బీసీ జనార్దనరెడ్డి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, కోట్ల సుజాతమ్మ, గౌరు చరితమ్మ, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, కేఈ శ్యాంబాబు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఆకేపాటి ప్రభాకర్‌ తదితరులతో బస్సులోనే సమావేశమయ్యారు. ‘ప్రజా క్షేత్రంలో ఉండండి.. జగన ప్రభుత్వం తీరును ఎండగట్టండి.. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పోరాడాల’ని నాయకులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులు ఎవరో స్పష్టత ఇవ్వాలని కొందరు నాయకులు కోరితే ప్రజాక్షేత్రంలో ఉండేవారే టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారని.. వారికే టికెట్‌ అని... మహానాడు తరువాత కీలక నిర్ణయం తీసుకుందామని సూచించినట్లు తెలిసింది. అదే క్రమంలో వర్గ విభేదాలతో పార్టీని, ప్రజలను తప్పుదోవ పట్టించే నాయకులకు భవిష్యత్తు ఉండదని, విభేదాలు, భేషాజాలు వీడి కలసికట్టుగా పని చేయాలని సూచించారని తెలుస్తోంది. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలు దెబ్బతీసే వాళ్లపై చర్యలు తప్పవ ని సుతిమెత్తగా హెచ్చరించినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పైగా నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని.. కలిసికట్టుగా పని చే యాలని దిశానిర్దేశం చేసినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

  ఫలించిన కృషి.. 

 కర్నూలులో జరిగిన ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశం కోసం కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డిలు వేదిక సహా బాబు పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. డోన రోడ్‌షో, జలదుర్గంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమం ఏర్పాట్లు డోన ఇనచార్జి ధర్మవరం సుబ్డారెడ్డి దగ్గరుండి చేశారు. కర్నూలు ఇనచార్జి టీజీ భరత దుబాయిలో ఉన్నా అనుచరులను రంగంలో దింపి వేదిక ప్రాంగణం ఏర్పాట్లు చూశారు. నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరించడంలో ఇనచార్జిలు కీలకంగా పని చేశారు. మొత్తంగా జిల్లా నాయకుల సమష్టి కృషి ఫలితంగా అధినేత పర్యటన సక్సెస్‌ కావడంతో నాయకుల్లో ఉత్సాహం ఉరకలేస్తుండగా....అధికార పార్టీ నాయకులకు ఇది మింగుడు పడడం లేదు.

  కార్యకర్తల ఆర్థిక, ఆర్యోగ భద్రతకు భరోసా

టీడీపీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల ఆర్థిక, ఆరోగ్య భద్రత తనదిగా బాబు భరోసా ఇచ్చారు. జనంలోకి వెళ్లి జగన దుర్మార్గపు పాలనపై దైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రాగానే కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసే ప్లాన చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నెట్‌వర్క్‌ ప్రైవేటు ఆస్పత్రులతో ఓ ఒప్పందం చేసుకొని టీడీపీ సభ్యత్వం కార్డు చూపిస్తే వైద్యంలో రాయితీ, నిరుపేదలైతే ఉచిత వైద్యం అందించే ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. అమెరికా లాంటి దేశాల్లో చదువు, ఉద్యోగాలకు వెళితే.. అక్కడ ఎనఆర్‌ఐ టీడీపీ అండగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నా ుని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రజలకు వివరించి చైతన్యం కల్పించాలని సూచించారు.

 రాష్ట్రంలో తొలి టీడీపీ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి 

రాష్ట్రంలో ఏ జిల్లా పర్యటనలోనూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించలేదు.  స్పష్టత కూడా ఇవ్వలేదు. డోన రోడ్‌షో, జలదుర్గంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో జన స్పందన చూసిన అధినేత చంద్రబాబు ‘ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై పోరాడేందుకు మొనగాడైన ధర్మవరం సుబ్బారెడ్డిని బరిలో దింపుతున్నా.. టీడీపీ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డే’ అని స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలోనే అధినేత ప్రకటించిన తొలి అభ్యర్థి సుబ్బారెడ్డే. ఇది డోన టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

కార్యకర్తల కేరింతలు

యువతరానికి స్ఫూర్తినిస్తూ యుగపురుషుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం 40 ఏళ్ల యుక్త వయస్సులో ఉందని.. వచ్చే ఏడాది ఎన్టీఆర్‌ శతజయంతి జరుకోబోతున్నామంటూ ఓ వైపు కార్యకర్తలను సన్నద్ధం చేస్తూ.. మరో వైపు జనంపై జగన బాదుడే బాదుడు అంటూ నిప్పులు చెరుగుతూ సాగిన చంద్రబాబు 55 నిమిషాల ప్రసంగం తెలుగు తమ్ముళ్లలో నూతనోత్తేజం నింపింది. చంద్రన్న మాటలు విన్న కార్యకర్తలు ఇక తగ్గేదెలే.. అంటూ కేరింతలు కొట్టారు. అదే క్రమంలో ఉమ్మడి జిల్లా మంత్రుల అవినీతిని ఎండగట్టారు. డోన ఎమ్మెల్యే, ఆర్థిక మంత్రి బుగ్గన అవినీతిని కడిగి పారేస్తానని అన్నారు. 


మంత్రి దోచుకున్నదంతా కక్కిస్తాం 

  1.  బుగ్గనను ఓడించేందుకు ధర్మవరంను వదిలిపెట్టా
  2.  రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిన పాపం ఊరకనేపోదు
  3.  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 


డోన, మే 20: ‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అవినీతికి పాల్పడుతు న్నారు. మైనింగ్‌లో ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రానికి తెచ్చిన అప్పుల్లోనూ ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాడు.. మంత్రి బుగ్గన దోచుకున్నదంతా కక్కిస్తా’మని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. డోనలో గురువారం రాత్రి పర్యటించిన చంద్రబాబు నాయుడు మంత్రి బుగ్గనపె నిప్పులు చెరిగారు. డోనలో అరచాకపాలన చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గనులను తన గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారని విమర్శించారు. బుగ్గనకు మంత్రి పదవి ఇచ్చింది దోచుకోవడానికేనా అని ప్రశ్నించారు. భూకబ్జాలకు పాల్పడుతూ ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగనతో కలిసి ఆర్థిక మంత్రి రాష్ట్రానికి లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. తెచ్చిన అప్పులకు మంత్రి బుగ్గన సరైన లెక్కలు చెప్పడం లేదన్నారు. బుగ్గన అప్పులపై ఆర్థిక అవకతవక లెక్కలు తేల్చేంత వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆర్థిక మంత్రి ప్రజలపై పన్నుల భారాలు మోపుతూ ప్రజలకు ఎంతో నష్టం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇసుక ధరలను పెంచేసి ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారన్నారు.. రాష్ట్రానికి ఏమి అభివృధ్ది చేశారో మంత్రి బుగ్గన డోన పాతబస్టాండులోనే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. డోన, ప్యాపిలి, బేతంచెర్లలో వ్యాపారులపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్‌ చేసి అక్రమ కేసులతో వేధించడం చాలా దుర్మార్గమన్నారు. మంత్రి బుగ్గన బుర్రకథలు చెబుతూ అసెంబ్లీలో అవహేళనగా మాట్లాడుతూ విలువలను దిగజార్చారన్నారు. మంత్రి బుగ్గన చేసిన పాపాలు ఊరికే పోవని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. డోనలో బుగ్గనను ఓడించేందుకు ఒక మగాడిని వదిలానని ధర్మవరం సుబ్బారెడ్డిని గెలిపించడం ప్రజలు బాద్యతగా తీసుకోవాలన్నారు. యువత ఉత్సాహం చూస్తుంటే.. డోనలో బుగ్గనకు పతనం తప్పదన్నారు. ఆయనను ఇంటికి పంపించడం ఖాయమని, రాజకీయ సన్యాసం తీసుకునేలా చేస్తానని చంద్రబాబు ఉధ్ఘాటించారు. 

Updated Date - 2022-05-21T05:13:12+05:30 IST