టెస్టు కెప్టెన్సీ నన్నే వరిస్తే..: కేఎల్ రాహుల్

ABN , First Publish Date - 2022-01-18T22:25:42+05:30 IST

టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్న తర్వాత తదుపరి కెప్టెన్ ఎవరన్న దానిపై ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి..

టెస్టు కెప్టెన్సీ నన్నే వరిస్తే..: కేఎల్ రాహుల్

న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్న తర్వాత తదుపరి కెప్టెన్ ఎవరన్న దానిపై ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, స్టాండన్ ఇన్ స్కిప్పర్ కేఎల్ రాహుల్ ఈ రేసులో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ప్రస్తుతం భారత జట్టు మాత్రం రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కాబోయే వన్డే సిరీస్ పైనే దృష్టి పెట్టింది.


టెస్టుల్లో కోహ్లీ డిప్యూటీగా వ్యవహరించిన రాహుల్ దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టుకు సారథ్యం కూడా వహించాడు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి కెప్టెన్సీపై స్పందించిన రాహుల్.. తనకు కనుక టెస్టు కెప్టెన్సీ దక్కితే దానినో గొప్ప గౌరవంగా భావిస్తానని చెప్పుకొచ్చాడు. 


తన గురించిన వార్తలు చక్కర్లు కొడుతున్నంత వరకు టెస్టు కెప్టెన్సీ గురించి తాను ఆలోచించలేదని రాహుల్ పేర్కొన్నాడు. జొహన్నెస్‌బర్గ్ టెస్టులో జట్టును నడిపించే అవకాశం తనకు వచ్చిందన్నాడు. ఫలితం ఏమైనప్పటికీ తన వరకు అదో గొప్ప అనుభవమని, అందుకు తాను గర్వపడతానని వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.


దేశానికి సారథ్యం వహించడడమంటే ఎవరికైనా ప్రత్యేకమేనన్నాడు. ఇందుకు తానేమీ భిన్నం కాదన్నాడు. తనకు కనుక టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే అదే పెద్ద బాధ్యత అవుతుందన్నాడు. అయితే, ప్రస్తుతానికి మాత్రం తన దృష్టంతా ఆటపైనే ఉందని రాహుల్ స్పష్టం చేశాడు.

Updated Date - 2022-01-18T22:25:42+05:30 IST