‘టీకా’కు వేళాయె..!

ABN , First Publish Date - 2021-01-16T05:50:35+05:30 IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది. శనివారం నుంచి జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది.

‘టీకా’కు వేళాయె..!
పులివెందులలో వ్యాక్సినేషన్‌పై వైద్యులకు సూచనలు ఇస్తున్న సూపరింటెండెంట్‌

నేటి నుంచి కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌

తొలివిడతలో 24,722 మంది వైద్య సిబ్బంది గుర్తింపు

28,500 డోసులు కొవిసీల్డ్‌ వ్యాక్సిన్‌ సరఫరా

ఉదయం 9 గంటలకు 20 కేంద్రాల్లో ప్రారంభం

కడప, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసింది. శనివారం నుంచి జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం 20 వ్యాక్సినేషన్‌ కేంద్రాలను గుర్తించారు. కలెక్టర్‌ హరికిరణ్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌, కొవిడ్‌-19 స్పెషల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నాగరాజు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగనుంది.


తొలివిడతలో 24,722 మందికి టీకా

తొలివిడతలో వైద్య సిబ్బంది (హెల్త్‌కేర్‌ వర్కర్స్‌), అంగన్‌వాడీ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య ఆరోగ్య విభాగాల్లో పనిచేస్తున్న 24,722 మందిని గుర్తించారు. వీరికి టీకా వేసేందుకు ప్రతి నియోజకవర్గంలో 2 టీకా కేంద్రాలను ఎంపిక చేశారు. కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసుకున్న వైద్య సిబ్బందికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి గంటకు సగటున 10-15 మందికి టీకా వేసేలా ఏర్పాట్లు చేశారు. ఆయా నియోజకవర్గం పరిధిలో ఉన్న వైద్య సిబ్బందిని మండలాల వారీగా టీకా కేంద్రాలకు కేటాయించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటుంది.


జిల్లాకు చేరిన 28,500 డోసుల వ్యాక్సిన్‌

జిల్లాలో తొలివిడతగా వైద్య సిబ్బందికి టీకాలు వేసేందుకు ఆక్స్‌ఫర్డ్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కొవిసీల్డ్‌ వ్యాక్సిన్‌ 28,500 డోసులు జిల్లాకు వచ్చాయి. ఇప్పటికే  వీటిని అయా వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు పంపిణీ చేశారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ సూచనల మేరకు డీప్‌ఫ్రిజ్డ్‌ల్లో భద్రపరిచారు. అయా పీహెచ్‌సీ వైద్యాధికారుల పర్యవేక్షణలో టీకా కార్యక్రమం మొదలవుతుంది.


రెండో విడత నమోదుకు సిద్ధం

రెండో విడతలో పోలీసుశాఖ, మున్సిపల్‌, కార్పొరేషన్‌, రెవెన్యూ విభాగాల్లో పనిచేస్తున్న ఆయా శాఖ ఉన్నతాధికారులు మొదలుకొని, కిందిస్థాయి సిబ్బంది వరకు వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఎవరెవరికి టీకా వేయాలో, కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసేందుకు అయా శాఖల ఉన్నతాధికారులకు యాప్‌లు అందజేశారు. ఈ నెల 20 తేదీ వరకు కోవిన్‌ యాప్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడో విడతలో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌, కిడ్నీ, గుండె సంబంధిత దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే 50 ఏండ్లలోపు వారు, 50 ఏండ్లు పైబడిన వృద్ధులకు, నాలుగో విడతలో అన్ని వర్గాల ప్రజలకు టీకా వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


అన్ని ఏర్పాట్లు చేశాం

- డాక్టర్‌ నాగరాజు, కొవిడ్‌-19 స్పెషల్‌ కోఆర్డినేటర్‌

జిల్లాలో తొలివిడత కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం. నేటి ఉదయం 9 గంటలకు టీకా ప్రక్రియ మొదలవుతుంది. హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ 24,722 మందిని గుర్తించాం. జిల్లాకు 28500 డోసులు కోవిసీల్డ్‌ వ్యాక్సిన్‌ వచ్చింది. 20 కేంద్రాల్లో టీకా కార్యక్రమం జరుగుతుంది. నేటి నుంచి ఈనెల 20 వరకు ఈ ప్రక్రియ ఉంటుంది. అవసరమైతే, పొడిగించే అవకాశం లేకపోలేదు.


నియోజకవర్గాల వారీగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలు

----------------------------------------------------------- 

నియోజకవర్గం టీకా కేంద్రం-1 టీకా కేంద్రం-2

కడప రిమ్స్‌ ఎర్రముక్కపల్లి పీహెచ్‌సీ

రైల్వేకోడూరు రైల్వేకోడూరు సీఎస్‌ఈ పుల్లంపేట పీహెచ్‌సీ

రాజంపేట రాజంపేట పీహెచ్‌సీ నందలూరు పీహెచ్‌సీ

బద్వేల్‌ బద్వేల్‌ సీహెచ్‌సీ పోరుమామిళ్ల సీహెచ్‌సీ

మైదుకూరు మైదుకూరు సీహెచ్‌సీ దువ్వూరు పీహెచ్‌సీ

ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి కల్లూరు పీహెచ్‌సీ

జమ్మలమడుగు జమ్మలమడుగు సీహెచ్‌సీ ముద్దనూరు పీహెచ్‌సీ

కమలాపురం చెన్నూరు సీహెచ్‌సీ పెండ్లిమర్రి పీహెచ్‌సీ 

పులివెందుల పులివెందుల ఏరియా ఆస్పత్రి తల్లపల్లి పీహెచ్‌సీ

రాయచోటి రాయచోటి సీహెచ్‌సీ దేవపట్ల పీహెచ్‌సీ

Updated Date - 2021-01-16T05:50:35+05:30 IST