‘వసతి’కి వేళాయే!

ABN , First Publish Date - 2021-10-18T04:38:10+05:30 IST

జిల్లాలో నేటి నుంచి పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు తెరుచుకోనున్నాయి. కొవిడ్‌ కారణంగా ఏడాదిన్నరగా వసతి గృహాలు మూసి వేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంత వరకు వసతి గృహాలు తెరుచుకోలేదు.

‘వసతి’కి వేళాయే!

  • నేటి నుంచి పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు తెరిచేందుకు అనుమతి
  • ఏర్పాట్లు పూర్తి చేసిన సంక్షేమ శాఖల అధికారులు
  • తీరనున్న విద్యార్థుల ఇక్కట్లు


జిల్లాలో నేటి నుంచి పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు తెరుచుకోనున్నాయి. కొవిడ్‌ కారణంగా ఏడాదిన్నరగా వసతి గృహాలు మూసి వేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంత వరకు వసతి గృహాలు తెరుచుకోలేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిపోవడంతో పోస్ట్‌ మెట్రిక్‌ విద్యార్థుల కోసం వసతి గృహాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ వసతి గృహాలను తెరిచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి) 

కొవిడ్‌ మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో నేటి నుంచి పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు తెరుచుకోనున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంత వరకు ఈ వసతి గృహాలు తెరుచుకోలేదు. పోస్ట్‌ మెట్రిక్‌ విద్యార్థుల కోసం వసతి గృహాలను సిదఽ్ధం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ వసతి గృహాలను తిరిగి ప్రారంభించే ఏర్పాట్లలో ఽసంక్షేమాధికారులు నిమగ్నమయ్యారు. కరోనా కారణంగా ఏడాదిన్నర కాలంగా వసతి గృహాలు పూర్తిగా మూసి వేసిన విషయం తెలిసిందే. డిగ్రీ, పీజీ, ఇతర కోర్సుల విద్యార్థులకు పరీక్షల సమయంలో వసతి కల్పించారు. ఈ విద్యా సంవత్సరంలో ఆగస్టు నెలలోనే వసతి గృహాలు ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. ఈ మేరకు వసతి గృహాలను సిద్ధం కూడా చేశారు. అయితే వసతి గృహాలు తెరవడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఉత్పన్నమయ్యే నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో వసతి గృహాల ప్రారంభం తాత్కాలికంగా వాయిదా పడింది. కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలను పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దసరా సెలవుల అనంతరం వసతి గృహాలను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలంటూ సంబంధిత శాఖల కమిషనరేట్‌ల నుంచి ఆదేశాలు వచ్చాయి. సోమవారం నుంచి వసతి గృహాలు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వసతి గృహాలు తెరవకపోవడంతో ఇంత కాలం విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యారు. విద్యా సంస్థలు ప్రారంభించినా వసతి గృహాలను తెరవకపోవడంతో విద్యార్థులకు వసతి చాలా ఇబ్బందికరంగా మారింది. ప్రైవేట్‌ గదులు అద్దెకు తీసుకునే ఆర్థికస్తోమత లేక చాలా వరకు విద్యార్థులు తమ గ్రామాల నుంచి కళాశాలలకు రాకపోకలు కొనసాగించగా, మరికొందరు విద్యార్థులు తరగతులకు దూరమై ఇంటి వద్దనే ఉన్నారు. వసతి గృహాలు తెరవక విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విద్యార్థి సంఘాలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లిన విషయం తెలిసిందే. వసతి గృహాలు తెరవక విద్యార్థులు నష్టపోతారని, వెంటనే వసతి గృహాలు తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారు. కరోనా ఉధృతి చాలా వరకు తగ్గిపోవడం, విద్యా సంస్థల్లో విద్యార్థుల హాజరు శాతం క్రమేపీ పెరగడంతో వసతి గృహాలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వసతి గృహాలు నేటి నుంచి మళ్లీ ప్రారంభించనుండడంతో విద్యార్థుల ఇబ్బందులు తీరనున్నాయి. గత ఏడాది మార్చి రెండో వారంలో వసతి గృహాలు మూతపడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కొన్ని రోజుల పాటు వసతి గృహా లను తాత్కాలికంగా తెరవగా, ఆతరువాత కొవిడ్‌ ఉధృతి పెరగడంతో తిరిగి మూసివేశారు. పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు తెరవాలన్న ప్రభుత్వం నిర్ణ యంతో విద్యార్థులు చాలా రోజుల తరువాత తిరిగి వసతి గృహాలకు చేరుకోనున్నారు. 

జిల్లాలో 15 పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు 

జిల్లాలో 15 పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు ఉన్నాయి. ఎస్సీ 3, ఎస్టీ 3, బీసీ 9 వసతి గృహాలు ఉన్నాయి. సాధారణంగా వేసవి, దసరా, సంక్రాంతి సెలవులు మినహా ఇతర సమయాల్లో విద్యార్థులతో కళకళలాడుతూ ఉండే ఈ వసతి గృహాలు కొవిడ్‌ ఉధృతి కారణంగా వెలవెలబోయిన విషయం తెలిసిందే. రెండో విడత కొవిడ్‌ తీవ్రత తరువాత పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు నేటి నుంచి పూర్తిస్థాయిలో తెరుచుకోనున్నాయి. కళాశాలలు ప్రారంభమైన తరువాత వసతి లేక ఇంత కాలం ఇబ్బందులు పడిన విద్యార్థులకు వసతి గృహాలు తెరవడం వల్ల ఇక్కట్లు దూరం కానున్నాయి. 

Updated Date - 2021-10-18T04:38:10+05:30 IST