విశాఖలో ఐటీ నైపుణ్య కేంద్రం!

ABN , First Publish Date - 2020-02-18T10:13:29+05:30 IST

ఐటీ రంగంలో అత్యున్నత నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఒక సంస్థను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్దేశించారు.

విశాఖలో  ఐటీ నైపుణ్య కేంద్రం!

మధ్య ఆంధ్ర, సీమల్లో ఇంకో 2 శాఖలు

రాష్ట్రవ్యాప్తంగా 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి

ట్రిపుల్‌ ఐటీలకు అనుబంధంగా మరో 4

ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తిచేయాలి

సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి నిర్దేశం

స్టీఫెన్‌ రవీంద్రను మాకివ్వండి

కేంద్రానికి మరోసారి రాష్ట్రం విజ్ఞప్తి

అమరావతి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఐటీ రంగంలో అత్యున్నత నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఒక సంస్థను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్దేశించారు. ఇంజనీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించి.. వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. విశాఖలో ఏర్పాటుచేసే ఈ సంస్థకు అనుబంధంగా మధ్య ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో   రెండు శాఖలను ఏర్పాటుచేసే దిశగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 25, నాలుగు ట్రిపుల్‌ ఐటీలకు అనుబంధంగా నాలుగు, పులివెందుల ఆర్‌జేయూకేటీకు అనుబంధంగా మరో కేంద్రం.. మొత్తం 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటుచేయాలన్నారు. వీటికి సంబంధించిన నిధులు, డిజైన్లు, ప్రణాళికలు 45 రోజుల్లోగా పూర్తిచేయాలని.. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.


ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా మధుసూధన్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, ఐటీ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌ పాల్గొన్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలాంటి నగరాలతో పోటీపడాలంటే వాటికి దీటుగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే మార్గమని సీఎం పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలన్నీ ఒకే నమూనాలో ఉండాలని.. పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా వీటిని తీర్చిదిద్దాలన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలన్నీ ఈ శాఖ ద్వారానే చేయాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి విభాగాలు కలిసి పనిచేయాలని నిర్దేశించారు. 


నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై కమిటీ

రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై  మంత్రి గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. ఉన్నత విద్యామండలి, ఐటీ విభాగాలకు చెందిన వారిని ఇందులో సభ్యులుగా నియమించాలన్నారు. ప్రతి శిక్షణ కార్యక్రమాన్ని, కోర్సులను, నాణ్యతను ఈ కమిటీ ద్వారా పరిశీలించాలని.. అది ఇచ్చే నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. నైపుణ్యాభివృద్ధి కోసం ఏర్పాటుచేస్తున్న కళాశాలల్లో కోర్సులు, ఇతర ప్రణాళికలను పొందుపరచాలన్నారు.


కోస్తా పరిశ్రమలకు డీశాలినేషన్‌ నీరే..

కోస్తా ప్రాంతంలోని పరిశ్రమలకు వీలైనంత వరకు డీశాలినేషన్‌ నీటినే వినియోగించేలా ప్రణాళిక తయారుచేయాలని సీఎం సూచించారు. సంబంధిత కంపెనీలతో మాట్లాడి డీశాలినేషన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇజ్రాయెల్‌లో లీటరు నీటిని నాలుగు పైసలకు అమ్ముతున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలను రూ.4,500 కోట్లకు పైగా పెండింగ్‌లో పెట్టారని ఈ సందర్భంగా సీఎం విమర్శించారు. మనల్ని నమ్మి ఇక్కడ పరిశ్రమలు పెడితే.. రాయితీలను కూడా ఇవ్వని పరిస్థితి చూశామన్నారు. ఐటీఐ కళాశాలల్లో నాడు-నేడు కార్యక్రమం కింద అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, ఖాళీల భర్తీకీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - 2020-02-18T10:13:29+05:30 IST