ఐటీ సిటీ.. ఎప్పటికీ..?

ABN , First Publish Date - 2022-05-14T06:04:54+05:30 IST

ఐటీ సిటీ.. ఎప్పటికీ..?

ఐటీ సిటీ.. ఎప్పటికీ..?
ఐటీ టవర్‌ ఊహాజనిత చిత్రం

ఏస్‌ అర్బన్‌-ఏపీఐఐసీ హైటెక్‌ సిటీ నిర్మాణంపై సందిగ్ధం

రెండో టవర్‌ పనులు పూర్తయ్యేదెప్పుడో?

మొదటి టవర్‌లో ఐటీ కంపెనీలు ఖాళీ అవటమే కారణం 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)  : మొదటి చిత్రం.. కేసరపల్లిలోని ఏస్‌ అర్బన్‌-ఏపీఐఐసీ హైటెక్‌ సిటీ ఊహాజనిత చిత్రం. రెండో చిత్రం.. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాకుండా నిర్మాణంలో ఉండిపోయిన భవనం. ఈ భవన నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందా, ఎప్పుడు అంతర్జాతీయ సంస్థలు మన జిల్లాలోకి అడుగు పెడతాయా అని కలలు కనడమే కానీ, నిజమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఈ హైటెక్‌ సిటీలో నిర్మించాల్సిన రెండో ఐటీ టవర్‌ నిర్మాణం విషయంలో ఇంకా ప్రతిష్టంభన నెలకొంది. ఇటీవల ఏపీఐఐసీ అధికారులు ఏస్‌ అర్బన్‌ సంస్థతో సంప్రదింపులు జరిపారు. త్వరలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంకా ఆ దిశగా అడుగులు పడలేదు. స్ట్రక్చర్‌ నిర్మాణం పూర్తయినా గోడలు, ఫినిషింగ్‌ పనులు చేయాల్సి ఉంది. 

రెండో టవర్‌పై నిర్లక్ష్యమెందుకు?

మొదటి టవర్‌ మేథ కంటే రెండోది అతిపెద్దది. ఐటీ అనుబంధ కంపెనీలకు ఇక్కడ ఎక్కువ స్పేస్‌ ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఐటీ ప్రోత్సాహకాల కారణంగా ఖాళీగా ఉన్న మేథ టవర్‌ ఐటీ అనుబంధ కంపెనీలతో నిండిపోయింది. స్పేస్‌ లేకపోవటంతో పటమటలంక, గురునానక్‌ నగర్‌ రోడ్డు, ఆటోనగర్‌లో ఐటీ కాంప్లెక్సులు ఏర్పాటు చేశారు. వైసీపీ వచ్చాక ఐటీ ప్రోత్సాహకాలను ఎత్తివేయటంతో చాలా కంపెనీలు తమ కార్యకలాపాలను మూసివేశాయి. మేథలో కూడా చాలా కంపెనీలు వెళ్లిపోయాయి. చాలాకాలంగా మేథలో స్పేస్‌ ఖాళీగా ఉంటోంది. దీనిని చూశాక ఏస్‌ అర్బన్‌కు భయం పట్టుకుంది. కరోనా రెండోదశ తర్వాత వెన్నాడుతున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టడం కూడా నష్టదాయకంగా భావించటంతో పనులు కొనసాగించట్లేదు. ఇటీవల మేథ టవర్‌లోకి టెక్‌ మహీంద్ర రావటానికి ఏర్పాట్లు చేసుకుంటుండటం కొంతవరకు సాంత్వన కలిగించే అంశం. ఈ దశలో అయినా రెండో ఐటీ టవర్‌ నిర్మాణ పనులు ఊపందుకుంటాయని భావించినా సఫలం కాలేదు. టవర్‌ నిర్మించినా కంపెనీలు లేకుండా ఖాళీగా ఉంచి మెయింటినెన్స్‌ చేస్తూ నష్టాలు చవిచూడటం ఎందుకులే అని ఏస్‌ అర్బన్‌ సంస్థ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీఐఐసీ బోర్డు మీటింగ్‌లో సానుకూలంగా స్పందించినా క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధ పరిస్థితులు ఉండటంతో ఐటీ టవర్‌ పనుల పురోగతిపై సందిగ్ధమే నెలకొంది. 




Read more