అఫ్ఘాన్ ఐటీ మినిస్టర్.. ఇప్పుడు జర్మనీలో డెలివరీ బాయ్‌గా.. మంత్రికే ఇలాంటి పరిస్థితి వస్తే..

ABN , First Publish Date - 2021-08-25T19:05:33+05:30 IST

ఆయన ఒకప్పుడు దేశంలో నెట్‌వర్కింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కృషి చేశాడు. ఇప్పుడు ఇంటింటికీ తిరిగి పిజ్జాలు డెలివరీ చేస్తున్నాడు.

అఫ్ఘాన్ ఐటీ మినిస్టర్.. ఇప్పుడు జర్మనీలో డెలివరీ బాయ్‌గా.. మంత్రికే ఇలాంటి పరిస్థితి వస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆయన ఒకప్పుడు దేశంలో నెట్‌వర్కింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కృషి చేశాడు. ఇప్పుడు ఇంటింటికీ తిరిగి పిజ్జాలు డెలివరీ చేస్తున్నాడు. ఆయనెవరో కాదు అఫ్ఘానిస్తాన్ మాజీ ఐటీ మంత్రి సయ్యద్ అహ్మద్ షా సాఅదత్. ప్రస్తుతం జర్మనీలో ఉన్న ఆయన.. లీప్‌జిగ్ సిటీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. సైకిల్‌పై వెళ్లి పిజ్జా డెలివరీలు ఇస్తున్న ఆయన్ను మీడియా కదిలిస్తే.. తాను ఈ స్థాయికి ఎలా వచ్చిందీ వివరించారు. గతేడాది అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి, తనకు మధ్య మనస్పర్థలు వచ్చినట్లు అహ్మద్ షా వెల్లడించారు. ఈ క్రమంలోనే తాను పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు.


పదవికి రాజీనామా చేసి జర్మనీ వచ్చాక కొంతకాల వరకూ సాఫీగానే జీవనం సాగించానని, అయితే ఆ తర్వాత తన వద్ద ఉన్న డబ్బు ఖర్చయిపోయిందని షా వివరించారు. దీంతో బతుకుతెరువు కోసం ఏదో ఒక పని చేయాల్సిన స్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే డెలివరీ బాయ్ ఉద్యోగం చేయాల్సి వచ్చిందని షా తెలిపారు. తాను మంత్రి పదవిలో ఉండగా.. అఫ్ఘానిస్తాన్‌లో సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కృషి చేసినట్లు ఆయన వెల్లడించారు.


ఒకప్పుడు దేశ భవిష్యత్తును నిర్ణయించే పదవిలో ఉన్న వ్యక్తి.. ఇప్పుడిలా పిజ్జా డెలివరీ చేయాల్సి వచ్చిందని కొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అయితే తనకు సానుభూతి అవసరం లేదంటున్న అహ్మద్ షా.. పని ఎలాంటిదైనా సరే దాన్ని చేయడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదని ధీమాగా చెప్తున్నారు.  ఐటీ మంత్రికే ఇలాంటి పరిస్థితి వస్తే.. తాలిబన్ల కారణంగా దేశం విడిచి పారిపోతున్న సామాన్యుల పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2021-08-25T19:05:33+05:30 IST