ప్రభుత్వాన్ని నమ్ముకుంటే పనికాదని..!

ABN , First Publish Date - 2022-05-28T06:32:40+05:30 IST

ప్రభుత్వాన్ని నమ్ముకంటే పనికాదనుకున్నారు. ఏనుగులు, కోతుల నుంచి తోటల రక్షణకు తానే నడుం బిగించారు. తన పొలానికి సొంతంగా సోలారు విద్యుత్తు కంచె ఏర్పాటు చేసుకున్నారు చంద్రశేఖర్‌ నాయుడు.

ప్రభుత్వాన్ని నమ్ముకుంటే పనికాదని..!
రైతు ఏర్పాటు చేసుకున్న సోలార్‌ ప్యానల్‌, బ్యాటరీలు, రైతు చంద్రశేఖర్‌నాయడు

ఏనుగులు, కోతుల దాడుల నివారణకు సొంతంగా సోలారు విద్యుత్తు కంచె 

ముసలిమడుగులో రైతు ఏర్పాటు చేసుకున్న రైతు 


ప్రభుత్వాన్ని నమ్ముకంటే పనికాదనుకున్నారు. ఏనుగులు, కోతుల నుంచి తోటల రక్షణకు తానే నడుం బిగించారు. తన పొలానికి సొంతంగా సోలారు విద్యుత్తు కంచె ఏర్పాటు చేసుకున్నారు చంద్రశేఖర్‌ నాయుడు. ఈయనది పలమనేరు మండలం ముసలిమడుగు గ్రామం. గ్రామ సమీపంలో ఈయనకు దాదాపు రెండు ఎకరాల మామిడి తోట ఉంది. టెంకాయ చెట్లూ ఉన్నాయి. కొన్నేళ్లుగా టెంకాయ చెట్లలోని కాయలను కోతులు తినేస్తున్నాయి. ఈ గ్రామం  అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. చీకటి పడగానే అడవి నుంచి ఏనుగులు గ్రామ పొలిమేరల్లోని పొలాలపై పడి పంటలను, మామిడి, అరటి తోటలను నాశనం చేస్తున్నాయి. ఏనుగుల దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఇక, పంట నష్టాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారమూ నామమాత్రమే కావడంతో రైతుల బాధలు వర్ణనాతీతం. ఈ నేపథ్యలో ప్రభుత్వాన్ని నమ్ముకొంటే పంటలు దక్కవని రైతు చంద్రశేఖర్‌ భావించారు. ఏళ్ల తరబడి పెంచిన మామిడి తోటల్లోని పంట చేతికి రాకపోవడంతోపాటు చెట్లనూ ఏనుగులు విరిచేస్తున్నాయి. వీటి నుంచి రక్షణగా తోటను, టెంకాయ చెట్లను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. దాదాపు రూ.15 వేలతో సోలార్‌ ప్యానల్‌, పరికరాలు, రెండు బ్యాటరీలను కొన్నారు. మామిడి తోట చుట్టూ కర్రలు నాటి వాటికి విద్యుత్తు తీగలు ఏర్పాటు చేసుకొన్నారు. తన మామిడి తోటలోని టెంకాయ చెట్లకూ 15 అడుగుల ఎత్తు మేర సోలార్‌ విద్యుత్తు తీగలను అమర్చి కనెక్షన్‌ ఇచ్చారు. దీంతో నెల రోజులుగా మామిడి తోటలోకి కోతులు, ఏనుగులు రావడంలేదని ఆయన చెప్పారు. 


90 శాతం రాయితీతో సోలారు పరికరాలివ్వాలి 


ఏనుగుల దాడులను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జిల్లా రైతు సంఘం నేత ఉమాపతినాయుడు పేర్కొన్నారు. ఇక రైతులే తమ పంటలను సోలారు విద్యుత్‌ కంచెల ద్వారా రక్షించుకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం సోలారు విద్యుత్‌ కంచె కోసం 90 శాతం రాయితీ అందించాలని కోరారు. దీంతో ప్రభుత్వానికి పంట నష్టపరిహారం చెల్లించే అవసరం ఉండదన్నారు. అలాగే, ఎలిఫెంట్‌ ట్రాకర్ల జీతాలు, ఏనుగులను అటవీ ప్రాంతాల్లోకి తరిమేందుకు బాణసంచా ఖర్చులు ఉండవన్నారు.  సోలారు విద్యుత్‌ కంచె ఏర్పాటుకు ప్రభుత్వమే శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

- పలమనేరు

Updated Date - 2022-05-28T06:32:40+05:30 IST