శిక్ష కాదు, పరివర్తనే ముఖ్యం

ABN , First Publish Date - 2021-08-06T05:35:24+05:30 IST

నదీ తీరాల్లోనూ, సముద్ర తీరాల్లోనూ ఇసుక నేలల్లో కంద దుంపను పోలిన కొన్ని దుంపలు ఉంటాయి. వాటిలో మంచి పోషకాలతో పాటు కొంచెం విష పదార్థం కూడా ఉంటుంది.

శిక్ష కాదు, పరివర్తనే ముఖ్యం

దీ తీరాల్లోనూ, సముద్ర తీరాల్లోనూ ఇసుక నేలల్లో కంద దుంపను పోలిన కొన్ని దుంపలు ఉంటాయి. వాటిలో మంచి పోషకాలతో పాటు కొంచెం విష పదార్థం కూడా ఉంటుంది. పచ్చి దుంపలు తింటే మనిషికి అనారోగ్యం చేస్తుంది. అవే దుంపల్ని ఉడికించుకొని తింటే... ఆహారంగా మారి కడుపు నింపుతాయి. ఆరోగ్యాన్నిస్తాయి. ఉడికించడం వల్ల ఆ దుంపలోని దోషం పోతుంది. దోషరహితం కాగానే మధురమైన పదార్థంగా మారుతుంది. దుష్టస్వభావం ఉన్న మనిషయినా అంతే! దుష్టులలో ఉన్న దుష్ట స్వభావాన్ని తొలగిస్తే... వారు సామాజిక వికాసానికీ, సమాజ అభివృద్ధికీ సహాయపడతారు. సాటి మనుషులతో కలసిపోయి మమతానురాగాలు పండిస్తారు. ఇదే బుద్ధ నీతి, బుద్ధ ధర్మం. ‘దుష్ట శిక్షణ కాదు, దుష్ట పరివర్తనే ముఖ్యం’ అంటాడు బుద్ధుడు.


శ్రావస్తి నగరంలో ఒక వృద్ధురాలు ఉంది. ఆమెకు ఒక కుమారుడు. అతను చాలా మంచివాడు. తల్లిని చక్కగా చూసుకొనేవాడు. ఆమెకు ఏ లోటూ రానిచ్చేవాడు కాదు.


ఒక రోజున తల్లి అతనితో... ‘‘నాయనా! నీవు చాలా కష్టపడుతున్నావు. పెళ్ళి చేసుకో. ఆ వచ్చిన అమ్మాయి నన్ను చూసుకుంటుంది. నీ పనులు నువ్వు చేసుకోవచ్చు’’ అంది. కొడుకు అంగీకరించలేదు. కానీ, ఆమె పట్టుపట్టి వివాహం చేసింది.


కోడలు అత్తగారిని మొదట్లో బాగానే చూసుకుంది. ఇది గమనించిన భర్త ఆమెకు అడగకుండానే అన్నీ తెచ్చిపెట్టసాగాడు. తన మీద భర్తకు ఆమె చాలా నమ్మకం కలిగించింది. కొన్నాళ్ళ తరువాత అత్తగారి మీద ఆ కోడలు పెత్తనం మొదలుపెట్టింది. ఆమె ఒకటి అడిగితే మరొకటి చేయసాగింది. భర్త వచ్చే వేళకు అలకలు నటించేది. ఏడుపులు, పెడబొబ్బలు మొదలుపెట్టింది. మెల్లగా అతనికి తల్లి మీద ద్వేషం పుట్టించింది. 


ఆ కోడలు గర్భం దాల్చింది కానీ అది నిలవలేదు, ఇలా రెండు మూడు సార్లు జరిగింది. ‘‘ఈ శని ఇంట్లో ఉంటే గర్భం నిలవదు’’ అని గగ్గోలు పెట్టింది కోడలు. చివరకు కొడుకు, కోడలు కలిసి ఆ వృద్ధురాలిని ఇంట్లోంచి గెంటేశారు. ఆమె ఊరి చివర ఉన్న పాడుబడిన ఇంట్లో ఉంటూ, బిచ్చమెత్తుకొని బతకసాగింది. 


ఆ తర్వాత కొన్నాళ్ళకు కోడలు గర్భం దాల్చింది. పండంటి బిడ్డను కన్నది. ఆ బిడ్డ పుట్టిన సందర్భంగా పెద్ద విందు ఏర్పాటు చేశారు కొడుకు, కోడలు.

ఆ వార్త విన్న వెంటనే వృద్ధురాలికి ‘ధర్మం’ మీద కోపం వచ్చింది. శ్మశానానికి వెళ్ళింది. పొయ్యి పెట్టి పిండం వండసాగింది.

అప్పుడే మారువేషంలో ఆ దేశపు రాజు ఆ దారిన పోతున్నాడు. ఒక వృద్ధురాలు ఒంటరిగా శ్మశానంలో ఏదో వండుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.గుర్రం దిగి వచ్చి-

‘‘అమ్మా! ఏం వండుతున్నావ్‌?’’ అని అడిగాడు.

‘‘పిండాకూడు నాయనా!’’ అంది.

‘‘ఎవరికి?’’ అని ప్రశ్నించాడు రాజు.


‘‘ధర్మానికి! ధర్మం చచ్చింది. దానికి దినం చేసి, పిండం పెడుతున్నాను’’ అంది.

రాజు నెమ్మదిగా విషయం అడిగాడు. ఆమె తన దైన్య స్థితిని చెప్పింది. ‘‘తల్లిని తన్ని తరిమేసిన వారు సంతోషంగా ఉంటే... ధర్మం నశించక ఏమవుతుంది?’’ అంది.


‘‘అమ్మా! నీవు దుఃఖపడకు. ధర్మాన్ని నేను కాపాడతాను. నేను ఈ దేశపు రాజును. ఆ దుష్టుల్ని ఇప్పుడే ఉరి తీయిస్తాను’’ అన్నాడు.

‘‘మహారాజా! మన్నించండి! నేను కోరున్నది అది కాదు. నేనూ, నా కొడుకు, కోడలు, మనుమలు, మనుమరాళ్ళు... అందరూ కలిసి ఒకే ఇంట్లో జీవించడం. అలా కుటుంబాన్ని కలిపి, నడిపిస్తే అది ధర్మం. దుష్టుల్ని చంపడం కాదు... ధర్మాన్ని కాపాడండి’’ అంది. 

రాజుకు ఆమె గొప్ప మనసు అర్థమయింది. ఆమె కొడుకుకూ, కోడలికీ బుద్ధి చెప్పాడు. ఆ కుటుంబాన్ని ఒకటి చేశాడు.

బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2021-08-06T05:35:24+05:30 IST