Abn logo
Feb 22 2020 @ 02:07AM

పరిస్థితులను జయిస్తేనే కాంగ్రెస్‌కు భవిష్యత్తు

‘అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఇంకా నాలుగైదేళ్ల వ్యవధి ఉంది. మేం పోటీ చేసే నాటికి చూసుకోవచ్చు. ఇప్పటి నుంచే క్రియాశీలమైతే అనవసరపు వ్యయప్రయాసల తలనొప్పి తప్ప ప్రయోజనం ఏమీ లేదు’ అనే ఉద్దేశంతో నిర్లిప్తంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ నాయకులు చేసిన అతి పెద్ద పొరపాటు ఇది ! భవిష్యత్తులో తమ కోసమే పనిచేయాల్సిన స్థానిక కేడర్‌కు అవసరమైనప్పుడు అండగా నిలవకపోతే ఎలా ? వారు రాజకీయంగా ఎదిగే అవకాశం ఉన్న సందర్భంలో చేతులెత్తేయటం దేనికి సంకేతం ? మునిసిపల్‌ స్థానాలన్నింటినీ కైవసం చేసుకోవటానికి టీఆర్‌ఎస్‌.. సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించింది. ఈ రకమైన ఒత్తిడి తట్టుకొని కాంగ్రెస్‌ పార్టీ కోసం నిలబడిన వారు ఎందరు ? టీఆర్‌ఎస్‌ ఎత్తుగడలకు కేడర్‌ హడలిపోతున్నప్పుడు, వెన్నుదన్నుగా నిలవకుండా, వెన్ను చూపిన నాయకత్వం ఉంటే ఎంత? లేకుంటే ఎంత?


వందేళ్ల పైబడి చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ ఆరేళ్లుగా తెలంగాణలో ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించలేకపోతోంది. ప్రత్యేక రాష్ట్ర కల సాకారం కావటానికి జాతీయ స్థాయిలో పట్టుదలను ప్రదర్శించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఈ పరిస్థితిని ఊహించి ఉండరు. తెలంగాణ ఇస్తే విభజిత ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతింటామని అనుకున్నారేమో కానీ, తెలంగాణలో ఉనికి కోసం పోరాడాల్సి వస్తుందనేది అంచనాకు అందని పరిణామమే. ఈ దీనస్థితికి కారణం ఎవరు? లోపం తమదే అని ఒప్పుకునే నిజాయితీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో ఉందా? మా చూపుడు వేళ్లకు బదులేది? అని ప్రశ్నించే పార్టీ కార్యకర్తలకు అయోమయం తప్ప స్పష్టత లేకుండా పోయింది. 


అధికారంలో ఉన్నా, లేకున్నా ‘ప్రతిపక్షం’ అక్కర లేని పార్టీ కాంగ్రెస్‌. ఆత్మ విమర్శ కంటే, పరస్పరం విమర్శలు చేసుకునే ఆసక్తి పార్టీ నాయకుల్లో అధికంగా కనిపిస్తుంది. ఈ బాపతు నేతలకు తెలంగాణలో కొదవలేదు. కొందరు సమయం, సందర్భం మరిచి, పార్టీకి నష్టమా? లాభమా? అనే వివేచన లేకుండా నోరు పారేసుకోవటానికి ఎదురుచూస్తున్నట్టే ఉంటారు. అవసరాలకు అనుగుణంగా లేదా తెర వెనుక మతలబులతో ఎప్పుడు.. ఎవరి మధ్య.. బంధం బలపడుతుందో? సన్నగిల్లుతుందో? తెలుసుకోవటం నిఘా దూతలకూ సవాలే. నాయకత్వానికి దిగువ శ్రేణిపై నియంత్రణ అనేది ఓ ఎండమావి. ఈ విషయంలో ఏఐసీసీ అధిష్ఠానం తప్పు కూడా ఉందనే నిఖార్సయిన కాంగ్రెస్‌ కార్యకర్తల ఆవేదనలో అర్థం ఉంది. ‘రాష్ట్రం ఏదైనా ఏఐసీసీ పెద్దలు బహు నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు. ఏక వ్యక్తి లీడర్‌షిప్‌ను ఆమోదించటం వల్ల పార్టీ రాష్ట్ర శాఖ తమ చెప్పుచేతుల్లో ఉండదని, ధిక్కరించే ప్రమాదం ఉంటుందనేది వారి భయం కావచ్చు. గత అనుభవాలరీత్యా ఈ రకమైన వైఖరి కొనసాగిస్తుండవచ్చు’ అనే కొందరు సీనియర్‌ నేతల వ్యాఖ్యలు నిజమైనా ఆశ్చర్యంలేదు. కానీ అదే ఇప్పుడు శాపమైన తెలంగాణ కాంగ్రెస్‌కు విముక్తి ప్రసాదించేది ఎవరు ?


కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థి అధికార టీఆర్‌ఎస్‌. ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాల్లో గండరగండడు. కాంగ్రెస్‌కి తీరని ఆశాభంగం కలిగిస్తూ టీఆర్‌ఎస్‌ను 2014, 2018లో వరుసగా రెండుసార్లు ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకొచ్చారు. ఆమధ్య కాలంలో కేసీఆర్‌ దెబ్బకు కాంగ్రెస్‌ కకావికలమైంది. ఆయన చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదానూ కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుచుకొని కొంత ఊపిరిపీల్చుకున్నప్పటికీ, మునిసిపల్‌ ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ చతికిలపడింది. ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వ లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే తప్పు ఎలా అవుతుంది ? 


టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అంతర్గతంగానో, బాహాటంగానో వ్యక్తమయ్యే వ్యతిరేకతను ఒడిసిపట్టటం, దానిని తమకు అనుకూలంగా మలుచుకోవటంలో కాంగ్రెస్‌ నేతల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో పెద్దఎత్తున కేడర్‌ను కోల్పోవటం కూడా దానికి ప్రధాన కారణమవుతోంది. మిగిలి ఉన్న నేతలకైనా కాంగ్రెస్‌ను బతికించుకోవాలనే ఆలోచన ఉంటే, మునిసిపల్‌ ఎన్నికల్లో ఇంత అధ్వాన్నమైన ఫలితాలు వచ్చి ఉండేవి కాదనే వాదననూ తోసిపుచ్చలేం.


ఉమ్మడి ఏపీ కేబినెట్‌లో 2004-–14 వరకు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో చాలా మంది ఈసారి మునిసిపల్‌ ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు. పార్టీకి చెందిన సిట్టింగ్‌ ప్రజాప్రతినిధుల్లోనే కొంత వరకు తండ్లాట కనిపించింది. అనేక చోట్ల నియోజకవర్గ స్థాయి నేతలు మునిసిపల్‌ ఎన్నికల ముందు సన్నాహక సమావేశాలు కూడా పెట్టలేదు. ఒకవేళ నియోజకవర్గాలకు వెళ్లి సమావేశాలు నిర్వహిస్తే, పార్టీ తరఫున మునిసిపల్‌ ఎన్నికల ఆర్థిక భారం ఎక్కడ తమపై పడుతుందోనని అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ‘అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఇంకా నాలుగైదేళ్ల వ్యవధి ఉంది. మేం పోటీ చేసే నాటికి చూసుకోవచ్చు. ఇప్పటి నుంచే క్రియాశీలమైతే అనవసరపు వ్యయప్రయాసల తలనొప్పి తప్ప ప్రయోజనం ఏమీ లేదు’ అనే ఉద్దేశంతో నిర్లిప్తంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ నాయకులు చేసిన అతి పెద్ద పొరపాటు ఇది! భవిష్యత్తులో తమ కోసమే పనిచేయాల్సిన స్థానిక కేడర్‌కు అవసరమైనప్పుడు అండగా నిలవకపోతే ఎలా? వారు రాజకీయంగా ఎదిగే అవకాశం ఉన్న సందర్భంలో చేతులెత్తేయటం దేనికి సంకేతం? 


మునిసిపల్‌ స్థానాలన్నింటినీ కైవసం చేసుకోవటానికి టీఆర్‌ఎస్‌.. సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించింది. ఈ రకమైన ఒత్తిడి తట్టుకొని కాంగ్రెస్‌ పార్టీ కోసం నిలబడిన వారు ఎందరు టీఆర్‌ఎస్‌ ఎత్తుగడలకు కేడర్‌ హడలిపోతున్నప్పుడు, వెన్నుదన్నుగా నిలవకుండా, వెన్ను చూపిన నాయకత్వం ఉంటే ఎంత? లేకుంటే ఎంత? 


రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో కేసీఆర్‌ రాజకీయ మనోవేగానికి సరితూగే వారు ఉన్నారా? అంటే, కాగడా పెట్టి వెతకాల్సిందే! ఉన్న నేతలంతా ఐక్యంగా ఉంటారా? అంటే, అదీ లేదు. పార్టీలో ఒకరు ఎదుగుతుంటే, మరొకరు ఓర్వలేకపోతుంటారు. సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. ఈ సంస్కృతి మాసి పోయేదెప్పుడు? కేసీఆర్‌కు సమాంతరంగా ఎదిగేది ఎప్పుడు? టీఆర్‌ఎస్‌ను ప్రజలు వద్దనుకొని కాంగ్రెస్‌ వైపు చూడాలే తప్ప, వాళ్లంతట వాళ్లు ‘హస్తం’ దిక్కు చూసేలా చేసే కార్యాచరణ ఏదీ? ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వానికి మంచితనం, జడత్వం, ముక్కుసూటితత్వం వంటివి సరిపోయేట్టు లేవు! తిమ్మిని బమ్మి.. బమ్మిని తిమ్మి చేయగలిగి, ప్రజలను మెప్పించే నేర్పు ఉండాలేమో! పాలలో నీళ్లలా పార్టీ నాయకులందరితోనూ కలిసిపోయే నాయకుడు అవసరమయ్యేలా ఉంది! 


నియంతృత్వమే కాదు..మితిమీరిన ప్రజాస్వామ్యం కూడా ఒక్కోసారి సత్ఫలితాలను ఇవ్వదు. నేతల్లో ఎవరు క్రమశిక్షణ కట్టు తప్పినా పార్టీకి అనర్థమే! పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్‌కు ప్లస్‌ పాయింట్‌గా చెప్పుకునే నాయకత్వంపైనే, అదే మైనస్‌ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందనే వాస్తవాన్ని గుర్తించాలి! వర్తమానాన్ని జయించకపోతే భవిష్యత్తు ఉండదని కూడా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు గుర్తెరిగితే మంచిది!! లేకపోతే సీఎం కేసీఆర్‌కు ముచ్చటగా మూడవసారి అధికారాన్ని పల్లెంలో పెట్టి ఇచ్చినట్టే అవుతుందంటే కాదనేవారెవరు ?

మెండు శ్రీనివాస్‌

Advertisement
Advertisement
Advertisement