గులాబీ పాలనకు చరమగీతమే

ABN , First Publish Date - 2022-06-30T09:09:50+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గులాబీ పాలనకు చరమగీతం ఖాయమని బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ

గులాబీ పాలనకు చరమగీతమే

విజయ సంకల్ప సభతో చరిత్ర సృష్టిస్తాం..

కనీవినీ ఎరుగని రీతిలో జన సమీకరణ 

బీజేపీని ఎదుర్కోలేకనే కాంగ్రె్‌సకు కేసీఆర్‌ ప్రోత్సాహం

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌  రెండూ ఒకటే

మేం ప్రజల మనసులు గెలిచాం

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో బండి సంజయ్‌

హైదరాబాద్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గులాబీ పాలనకు చరమగీతం ఖాయమని బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత అనూహ్య సమీకరణాలు చోటుచేసుకోనున్నాయని, సమావేశాల సందర్భంగా నిర్వహించనున్న విజయ సంకల్ప సభతో రాష్ట్రంలో చరిత్ర సృష్టించబోతున్నామని ప్రకటించారు. కనీవినీ ఎరుగనిరీతిలో జనసమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా  రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో టీఆర్‌ఎ్‌సకు దిక్కుతోచడం లేదన్నారు. తాము ధర్నాలు,  దీక్షలు చేస్తే.. పోటీ ధర్నాలు, దీక్షలను కాంగ్రెస్‌ పార్టీ చేస్తోందన్నారు. తెలంగాణాలో తమవాళ్లు గెలిచినా టీఆర్‌ఎ్‌సలో వెళ్లిపోతారని కాంగ్రెస్‌ అధినాయకత్వం భావిస్తోందన్నారు. బీజేపీని ఒంటరిగా ఎదుర్కోవడం కష్టం కాబట్టి, టీఆర్‌ఎ్‌సతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో ఉందన్నారు. తాము టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయంగా ఎదిగడంతోనే ఆ పార్టీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు, మజ్లిస్‌ అంతా ఒక్కటై ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు.  శుక్రవారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’కి బండి సంజయ్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు.  

తెలంగాణలోనే  జాతీయ కార్యవర్గ భేటీ ఎందుకు?

రాష్ట్ర ప్రజలు, బీజేపీ కార్యకర్తలు మార్పు కోరుకుంటున్నరు.  బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ పార్టీ అరాచకాలు చేస్తోంది.. దాడులకు పాల్పడుతోంది.. కేంద్రం వివిధ సంక్షేమ పథకాలకు ఇస్తున్న నిధులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. రాష్ట్రాభివృద్ధికి సహకరించడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా, సీఎం కేసీఆర్‌ సహకరించడం లేదు. పైగా కేంద్రాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి, కేంద్ర నాయకత్వం అండగా ఉందన్న విశ్వాసం కల్పించడానికి ఇక్కడ సమావేశాలు నిర్వహించే అవకాశం ఇవ్వాలని పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి కోరాం. అందుకు అనుగుణంగా జాతీయ నాయకత్వం స్పందించింది.

మీరు అధికారంలోకి రావడానికి ఈ సమావేశాలు ఏ మేర దోహదపడతాయి? 

జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం ద్వారానే అధికారంలోకి రావాలని మేం అనుకోవడం లేదు. ప్రజా ఉద్యమాలే మా ఆయుధం. మార్పు కోరుకుంటున్న ప్రజలకు వారు ఆశించిన స్థాయిలో ఉద్యమాలు చేసినం వాటి ద్వారానే అధికారంలోకి రాబోతున్నం. రెండు సార్లు చేసిన ప్రజా సంగ్రామ యాత్రలతో ప్రజల కష్టాలు తెలుసుకున్నం. కేసీఆర్‌ ఎలా తమను తప్పుదోవ పట్టిస్తున్నరో తెలుసుకుని ప్రజలు ఆశ్చర్యపోతున్నరు. ప్రజల మనసులు మేం గెలిచాం.

టీఆర్‌ఎ్‌సకు మీరు ప్రత్యామ్నాయమని ఎలా చెప్పగలరు?

 రైతులు, నిరుద్యోగుల, ఉద్యోగులు, ఉపాఽధ్యాయులు, గిరిజనుల కోసం ఉద్యమాలు చేసినం.. లాఠీదెబ్బలు తింటున్నం. జైళ్లకు పోతున్నం. నేను స్వయంగా జైలుకు పోయిన. అన్ని రకాల ఉద్యమాలు చేయడం ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ధైర్యంగా ఎదిరించే పార్టీ బీజేపీ మాత్రమే అని ప్రజలు విశ్వసిస్తున్నరు.. మమ్మల్నే ప్రత్యామ్నాయంగా గుర్తిస్తున్నరు. 

రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో బీజేపీ బలహీనంగా ఉందన్న వాదన ఉంది.?

రాష్ట్రంలో బీజేపీ శక్తివంతంగా ఉంది. టీఆర్‌ఎస్‌ స్థానాలైన దుబ్బాక, హుజురాబాద్‌తో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్‌శాతం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఏ సర్వే నిర్వహించినా బీజేపీదే విజయం అని స్పష్టమవుతోంది.. కాంగ్రెస్‌ పార్టీకి అడ్రస్‌ లేదు..  

సమావేశాల తర్వాత సమీకరణాలు మారతాయా

రాష్ట్ర ప్రజలకు బీజేపీపై ఇంకా విశ్వాసం పెరుగుతోంది. కష్టాల్లో ఉన్న తమకు బీజేపీ జాతీయ నాయకత్వం అండగా ఉందన్న భరోసా రాష్ట్ర ప్రజలకు కలుగుతోంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటే అన్న అంశం విస్పష్టం కాబోతోంది. మా జాతీయ కార్యవర్గ సమావేశాల విషయంలో ఆ రెండు పార్టీలు కలిసే విమర్శిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వారు కలిసే పోటీచేయబోతున్నారన్నది కూడా స్పష్టం కాబోతోంది. 

టీఆర్‌ఎ్‌సను ఎలా ఢీ కొనబోతున్నారు? 

ఆ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నరు. ఆ పార్టీ నేతల ఆగడాలు, భూకబ్జాలు, అరాచకాలను ప్రజలు స్వయంగా చూస్తున్నరు.. ఉద్యమకారులను, దళితులను, మైనారిటీలను, రైతులను, నిరుద్యోగులను.. ఇలా అన్ని వర్గాలను కేసీఆర్‌ మోసం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. రాష్ట్రం మాఫియాలకు అడ్డాగా మారింది. పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని సంఘ విద్రోహశక్తులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెంచి పోషిస్తోంది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్థితిలో ప్రభుత్వం లేదు.. రాబోయే రోజుల్లో ఆర్థికంగా పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ స్థితిలో కఠిన నిర్ణయాలు ధైర్యంగా తీసుకునే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నరు.. ఆ దిశగా మా పోరాటం సాగుతుంది.

Updated Date - 2022-06-30T09:09:50+05:30 IST