ఆశలపై నీళ్లు..!

ABN , First Publish Date - 2020-06-07T11:23:18+05:30 IST

తెలుగుగంగ ప్రధాన కాల్వ శిథిలావస్థకు చేరడం.. ఎగువ జిల్లాలో విచ్చలవడిగా నీటి వాడకం వెరసి జిల్లాకు రావాల్సిన వాటా

ఆశలపై నీళ్లు..!

కదలిక లేని కుందూ-టీజీపీ లిఫ్ట్‌ ఫైలు

సీఎం జగన్‌ శంకుస్థాపన చేసి ఆరు నెలలు

ఇప్పటికీ టెండర్లు నోచుకోని వైనం

ఈ ఏడాది లేనట్లేనా..?


కడప, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలుగుగంగ ప్రధాన కాల్వ శిథిలావస్థకు చేరడం.. ఎగువ జిల్లాలో విచ్చలవడిగా నీటి వాడకం వెరసి జిల్లాకు రావాల్సిన వాటా నీరు రావడం లేదు. ఫలితంగా 1.77 లక్షల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కుందూ నుంచి 8 టీఎంసీలు ఎత్తిపోసేలా రూ.589 కోట్లతో కుందూ - టీజీపీ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. డిసెంబర్‌ 23న సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఐదు నెలలుగా కదిలిక లేదు. తెలుగుగంగ ప్రధాన కాలువ సీసీ లైనింగ్‌ చేపట్టడంతో సరిహద్దులో నీటివాటా పెరుగుతుందుని.. ఈ లిఫ్ట్‌ అవసరం లేదని రాష్ట్రస్థాయి అధికారులు కొర్రీ పెట్టారని సమాచారం. 


తెలుగుగంగ కాలువ పరిధిలోని మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో 12 మండలాల్లో 1.77లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ప్రధాన కాల్వలో 5 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటేనే ఆయకట్టుకు సాగునీరు ఇవ్వవచ్చు. అయితే.. ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటి దాకా పూర్తిస్థాయి నీటి ప్రవాహం రాలేదని ఇంజనీర్లు అంటున్నారు. ప్రధాన కాల్వ మొదలయ్యే దగ్గరనుంచి 42.56 కి.మీల వరకు కర్నూలు జిల్లాలో శిథిలావస్థకు చేరడం, సీసీ లైనింగ్‌ లేకపోవడం, ఎగువన అక్రమ ఆయకట్టు రోజురోజుకూ పెరగడంతో జిల్లా సరిహద్దు 98.60 కి.మీల దగ్గర 1,200 -1,500 క్యూసెక్కులు కూడా రావడం లేదు.


వాటా నీరు అందక ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆయకట్టుకు పూర్తిగా సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా కుందూ నది నుంచి 8 టీఎంసీలు ఎత్తిపోసి బ్రహ్మంసాగర్‌లో నిల్వ చేసేలా కుందూ-టీజీపీ లిఫ్ట్‌కు శ్రీకారం చుట్టారు. గత ఏడాది డిసెంబర్‌ 23న సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఐదు నెలలు దాటినా ఫైలుకు కదిలిక లేదు. ప్రభుత్వానికి సమగ్ర నివేదిక వెళ్లింది.. పరిపాలన అనుమతులు ఉన్నాయి.. జుడిషియల్‌ కమిటీ అప్రూవల్‌ తీసుకొని టెండర్లు పిలిచేందుకు అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలు శూన్యం.


ఓ మాజీ అధికారి అడ్డుపుల్ల

మెయిన్‌ కెనాల్‌ సీసీ లైనింగ్‌ చేస్తే టీజీపీ మెయిన్‌ కెనాల్‌ జిల్లా సరిహద్దు 98.60 కి.మీల వద్ద 3,500 క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం ఉంటుందని, ప్రస్తుతం వస్తున్న 1,200 క్యూసెక్కులతో పోలిస్తే.. అదనంగా 1,500 నుంచి 2,300 క్యూసెక్కుల ప్రవాహం పెరుగుతుందని సమాచారం. దీంతో 1,400 క్యూసెక్కులతో చేపట్టిన కుందూ-టీజీపీ లిఫ్ట్‌ అవసరమా..? అంటూ గతంలో కర్నూలు సీఈగా పని చేసిన వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆ ప్రాజెక్టుపై ఆశలు వదులుకోవాల్సిందేనా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే.. సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు, టెండర్లు పిలుస్తారని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. 


తగ్గిన ప్రతిపాదన వ్యయం

2019 నవంబర్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం స్టీల్‌ రేట్‌ టన్ను రూ.44 వేలు ఉండేది. ఆ రేట్లతో కుందూ - టీజీపీ ఎత్తిపోతల పథకానికి రూ.589 కోట్లకు డీపీఆర్‌ తయారు చేశారు. సీఎం జగన్‌ శంకుస్థాన చేశాక.. 2020 ఫిబ్రవరి ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం మళ్లీ ప్రతిపాదనలు తయారు చేశారు. ఆ నెల ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం స్టీల్‌ టన్ను రూ.39 వేలే. దీంతో రూ.560 కోట్లకు తగ్గించారు. రూ.29 కోట్లు మిగులుబాటు అవుతుందని ఇంజనీర్లు అంటున్నారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడుతుందా..? పెండింగ్‌లో ఉంచుతుందా..? అన్నది ప్రశ్నార్థకమే.

 

ప్రభుత్వం వద్ద నివేదిక ఉంది :  శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సీఈ, ఇరిగేషన్‌ (ప్రాజెక్ట్స్‌),

కడపకుందూ-టీజీపీ లిఫ్ట్‌ స్కీం నివేదిక ప్రభుత్వం వద్ద ఉంది. సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రెండు ప్రాజెక్టులు కలిపి టెండర్లు పిలవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లు తగ్గడంతో నిర్మాణం వ్యయం అంచనా రూ.589 కోట్లు నుంచి రూ.560 కోట్లకు తగ్గింది.



టీజీపీ రిజర్వాయర్ల నిల్వలు (టీఎంసీలు)

--------------------------------------

రిజర్వాయరు సామర్ధ్యం

---------------------------------------

ఎస్‌ఆర్‌ 1 2.133

ఎస్‌ఆర్‌ 2 2.444

బ్రహ్మంసాగర్‌ 17.735

---------------------------------------

మొత్తం 22.312

----------------------------------------

లిఫ్ట్‌ స్కీం స్వరూపం

------------------------

స్కీం పేరు  : కుందూ- టీజీపీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం

లక్ష్యం : కుందూ నుంచి 8 టీఎంసీలు లిఫ్ట్‌ 

ఆశయం : తెలుగుగంగ 1.77లక్షల ఎకరాలకు సాగునీరు

ప్రతిపాదన వ్యయం : రూ.560 కోట్లు

లిఫ్టింగ్‌ సామర్థ్యం : రోజుకు 1400 క్యూసెక్కులు

పంపులు : 350 క్యూసెక్కుల సామర ్థ్యంతో నాలుగు

---------------------


Updated Date - 2020-06-07T11:23:18+05:30 IST