హైదరాబాద్‌లో మళ్లీ వర్షం

ABN , First Publish Date - 2020-10-21T08:16:59+05:30 IST

రాజధాని హైదరాబాద్‌ను వాన వదలడం లేదు.

హైదరాబాద్‌లో  మళ్లీ వర్షం

ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌జాం 

ముంపులోనికాలనీల పరిస్థితి దుర్భరం

మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

7.6 కి.మీ ఎత్తున ఉపరితల ఆవర్తనం

ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణం

నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు


హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌ను వాన వదలడం లేదు. కొద్దిగా తెరిపినిచ్చి.. ఎండకాసిందన్న సంతోషం కాస్తయినా మిగలకుండా మాయదారి వాన మళ్లీ విరుచుకుపడింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రందాకా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వర్షం పడింది. ఎప్పటిలాగే ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వరద నుంచి కాస్త తేరుకుంటున్న కాలనీల్లోకి మళ్లీ నీళ్లొచ్చాయి. ఇప్పటికే వరదలో ఉన్న కాలనీలు మరింత మునిగాయి. చాలాచోట్ల ఇళ్లలో మోకాలిలోతులో నీళ్లు నిలిచాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, ఉప్పల్‌, రామంతాపూర్‌, చార్మినార్‌, మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, చందానగర్‌, అల్వాల్‌, ఫీర్జాదిగూడ, మల్కాజిగిరి, నేరెడ్‌మెట్‌, జవహర్‌నగర్‌, సఫిల్‌గూడ, కంచన్‌బాగ్‌, శంషాబాద్‌, తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్‌, మాసబ్‌ట్యాంక్‌,  ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో కురిసిన వర్షంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనాలు ముందుకు కదలకపోవడంతో వాహనదారులు గంటలకొద్దీ ఇబ్బందిపడ్డారు.


ఈనెల 13, 17న కురిసిన భారీ వర్షాలతో వరద ముంపులో చిక్కుకుపోయిన ప్రాంతాల పరిస్థితి దారుణంగా తయారైంది. సరూర్‌నగర్‌ మండలంలోని కోదండరాంనగర్‌, సీసల బస్తీ, శారదనగర్‌, కమలానగర్‌, ఉప్పల్‌, ఫీర్జాదిగూడ, మేడిపల్లి, టోలీచౌకీలోని నదీంకాలనీ, పాతబస్తీలోని అరుంధతికాలనీ, శివాజీనగర్‌, క్రాంతినగర్‌, సాయిబాబానగర్‌, రాజీవ్‌గాంధీనగర్‌, ఛత్రినాక, లిమ్రాకాలనీ, సాదత్‌కాలనీ, ఆల్‌ జుబైల్‌కాలనీ, హశమాబాద్‌, అలీనగర్‌లో మళ్లీ వరదనీరు చేరింది. మంగళవారం వనపర్తి జిల్లా ఘణపూర్‌లో అత్యధికంగా 6.38 సెంటీమీటర్ల వర్షపాం నమోదైంది. ఆ తర్వాత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా సర్వాయిపేటలో 6.33 సెం.మీ, రంగారెడ్డి జిల్లా మంచాల్‌లో 5.6, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో 5.5, మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా కీసరలో 5.05 సెం.మీ వర్షపాతం నమోదైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అత్యధికంగా దమ్మాయిగూడలో 5.05 సెం.మీ, మేడిపల్లిలో 2.80, హయత్‌నగర్‌లో 2.50, ముషీరాబాద్‌లో 2.43, సరూర్‌నగర్‌లో 2.38 సెం.మీ వర్షపాతం నమోదైంది.


గండిపేట.. 10 ఏళ్ల తర్వాత మళ్లీ 

హిమాయత్‌సాగర్‌ జలాశయం నుంచి 2 గేట్లు ద్వారా వరదనీరు మూసీకి చేరుతుండగా గండిపేట జలాశయం కూడా నిండు కుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1790 కాగా, ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 1786 అడుగులుగా ఉంది. మరో రెండు అడుగుల మేర నీటిమట్టం పెరిగితే గేట్లు ఎత్తి వేసి.. నీటిని దిగువకు వదులుతారు. ఈ మేరకు జలమండలి, రెవెన్యూ, పోలీస్‌, ఇరిగేషన్‌శాఖ అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధమైయ్యారు. గండిపేట దిగువ ప్రాంతంలోని తహశీల్దార్‌, మునిసిపల్‌ అధికారులకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు రెవెన్యూ అధికారులు సమాచారం అందించారు.


గండిపేట పరీవాహక ప్రాంతంలో వర్షం పడుతున్నందున ఈ రాత్రి 12 గంటలకు లెవెల్‌ ఒక్కసారి సరిచూసుకొని అవసరమైతే రాత్రి లేదా బుధవారం నాడు గేట్లు ఎత్తుతామని జలమండలి అధికారులు తెలియజేశారు. గండిపేట జలాశయానికి మొత్తం 15 గేట్లు ఉన్నాయి. గేట్లు తెరిస్తే గండిపేట మండలంలోని ఒక్క మంచిరేవుల గ్రామానికి రాకపోకలు నిలిచిపోనున్నాయి. మంచిరేవుల గ్రామస్తులు నార్సింగ్‌ తదితర గండిపేట ప్రాంతాలకు రావాలంటే చుట్టూ తిరిగి బండ్లగూడా నుంచి రావాల్సి ఉంటుంది. లేదా ఔటర్‌ రింగ్‌రోడ్డును అప్పాదగ్గరికి రావాల్సి ఉంటుం ది. మంచిరేవుల గ్రామం పరిధిలోని పాతగ్రామంతో పాటు నాలుగు కాలనీలకు రాకపోకలు నిలిచిపోవడం ఖాయం. వీరంతా అప్పా నుంచి రాకపోకలు సాగించాల్సిందే. కాగా గండిపేట జలాశయానికి చివరికిసారిగా 2010లో గేట్లు ఎత్తివేశారు. అంతకుముందు 1999, 98లో కూడా నీటిని దిగువకు వదిలారు.

Updated Date - 2020-10-21T08:16:59+05:30 IST