సంతకం పెట్టకుంటే మర్యాద దక్కదు

ABN , First Publish Date - 2022-06-07T09:47:47+05:30 IST

‘‘నా మీద వచ్చిన ఫిర్యాదు ఏమిటో చూపించలేదు.

సంతకం పెట్టకుంటే మర్యాద దక్కదు

  • పోస్టులు పెట్టినట్లు ఒప్పుకో.. 
  • సీఐడీ అధికారులు బెదిరించిన తీరు ఇది
  • ఎఫ్‌ఐఆర్‌ ఇవ్వలేదు... ఫిర్యాదేమిటో చెప్పలేదు
  • ఉదయం నుంచి సాయంత్రం వరకూ కూర్చోబెట్టారు
  • నీళ్లు, భోజనం.. ఏమీ ఇవ్వలేదు.. నా లాయర్‌తో మాట్లాడనివ్వలేదు
  • మహిళతో వ్యవహరించే తీరు ఇదేనా?.. సీఐడీ తీరుపై గౌతు శిరీష ఫైర్‌


అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ‘‘నా మీద వచ్చిన ఫిర్యాదు ఏమిటో చూపించలేదు. ఎఫ్‌ఐఆర్‌ కాపీ నాకు ఇవ్వలేదు. వాళ్లు చెబుతున్న నేరం, నేను చేసినట్లుగా అంగీకరించి కాగితాలపై సంతకాలు పెట్టాలని సీఐడీ అధికారులు నన్ను ఒత్తిడి చేశారు’’ అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆరోపించారు. సోమవారం ఇక్కడ డీజీపీ కార్యాలయం ఆవరణలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరై తిరిగి వచ్చిన అనంతరం ఆమె అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టాలని నేను పార్టీ కార్యకర్తలకు ఫోన్లో ఆదేశాలు ఇచ్చినట్లుగా ఒప్పుకొంటూ సంతకాలు చేయాలని నాపై ఒత్తిడి తెచ్చారు. చేయని నేరాన్ని ఎందుకు ఒప్పుకోవాలి. మా ఊరు పలాస. ఇక్కడికి 800 కిలోమీటర్లు. రాత్రి గం.10.30కి ఇంటికి వచ్చి సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఒక నోటీసు నా మొహాన పడవేసి వెళ్లిపోయారు. అందులో ఏ నేరానికి సంబంధించి నన్ను పిలుస్తోందీ వివరాలు లేవు.


 సీఐడీ అధికారులపై గౌరవంతో వెంటనే బయలుదేరి వచ్చాను. నా లాయర్‌తో కలిసి ఉదయం 11 గంటలకు వెళ్లాను. సాయంత్రం ఆరు గంటలదాకా నన్ను కూర్చోబెట్టారు. కనీసం మంచినీళ్లు ఇవ్వలేదు. జైల్లో ఖైదీలకైనా భోజనం పెడతారు. నాకు అదీ లేదు. నా లాయర్‌ను నా వద్ద ఉండనీయకుండా వేరే ఎక్కడో కూర్చోబెట్టారు. కొన్ని పోస్టులను నేను ఇతరులకు ఫోన్లు చేసి పెట్టించానని ఆరోపించారు. అది ఒప్పుకొంటున్నట్లుగా రాసి తీసుకువచ్చి సంతకం పెట్టాలని నాపై ఒత్తిడి తెచ్చారు. ఇప్పటిదాకా మర్యాద ఇచ్చామని... సంతకం పెట్టకపోతే ఆ మర్యాద కూడా ఉండదని బెదిరించారు. ఏం చేసుకొన్నా ఫర్వాలేదని... సంతకం పెట్టేది  లేదని నేను గట్టిగా చెప్పాను. అదంతా అబద్ధమని, నేను ఏ తప్పు చేయలేదని రాసి దాని కిందే సంతకం పెట్టాను. ఇద్దరు సీనియర్‌  అధికారులు వచ్చి వాళ్లు కూడా నన్ను బెదిరించాలని చూశారు. నాపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. ఇదేమైనా దేశ రక్షణకు సంబంధించిన కేసా? మహిళలతో వ్యవహరించే పద్ధతి ఇదేనా? ఇంత గట్టిగా అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసిన వారితో పోలీసులు వ్యవహరిస్తే చాలా నేరాలు ఆగుతాయి. ఈ నెల 9న మళ్లీ రావాలని చెప్పారు. దీనిపై ఏం చేయాలో పార్టీ పెద్దలతో మాట్లాడి నిర్ణయించుకొంటా’’ అని శిరీష తెలిపారు. కాగా, సాయంత్రం అయినా ఆమెను సీఐడీ కార్యాలయం నుంచి బయటకు పంపకపోవడతో టీడీపీ కార్యకర్తలు కొద్దిసేపు డీజీపీ కార్యాలయానికి వెళ్లే రహదారిపై ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత ఆమెను బయటకు పంపారు. ఈ విచారణ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి వెళ్లే రహదారిని పోలీసులు మూసివేశారు. డీజీపీ కార్యాలయం రహదారి రెండువైపులా బారికేడ్లతో నియంత్రించి భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. 


సోషల్‌ మీడియా పోస్టింగులపైనే విచారణ

సామాజిక మాధ్యమాల్లో పెట్టిన నకిలీ పోస్టుల విషయంలో గౌతు శిరీషను విచారించినట్లు సీఐడీ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ద్వేష భావం ఏర్పడేలా, ప్రభుత్వ పఽథకాలను వక్రీకరిస్తూ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టులపై తాము విచారణ జరుపుతున్నామని, అందులో భాగంగా ఆమెను కూడా పిలిపించి విచారణ జరిపామని ఈ ప్రకటనలో వివరించింది.

Updated Date - 2022-06-07T09:47:47+05:30 IST