వైద్యులపై కేసులు పెట్టడం తగదు

ABN , First Publish Date - 2021-09-29T05:47:13+05:30 IST

నిజనిజాలు తెలుసుకోకుండా వైద్యులపై తొందరపడి కేసులు పెట్టడం తగదని ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యులు, ప్రైవేటు నర్సింగ్‌హోమ్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు డాక్టర్‌ ఏవీ సుబ్బారెడ్డి అన్నారు.

వైద్యులపై కేసులు పెట్టడం తగదు
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ ఏవీ సుబ్బారెడ్డి

ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు సుబ్బారెడ్డి


మదనపల్లె క్రైం, సెప్టెంబరు 28: నిజనిజాలు తెలుసుకోకుండా వైద్యులపై తొందరపడి కేసులు పెట్టడం తగదని ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యులు, ప్రైవేటు నర్సింగ్‌హోమ్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు డాక్టర్‌ ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. కాగా బాలింత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పట్టణానికి చెందిన ప్రసాద్‌ ఈఎన్‌టీ, మెటర్నిటీ ఆస్పత్రి వైద్యురాలు శిల్పకళపై టూటౌన్‌ పోలీసులు కేసునమోదు చేసిన విషయం విదితమే. ఈ విషయమై ఆయన ప్రసాద్‌ ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బి.కొత్తకోటకు చెందిన భువనేశ్వరీకి ఆపరేషన్‌ చేసిన ఐదురోజుల తరువాత కుట్లు తొలగించగా కొంత రక్తం వచ్చిందన్నారు. ఆ తరువాత డాక్టర్లు జాగ్రత్తలు చెప్పి, మందులు ఇచ్చి డిశ్చార్జి చేశారన్నారు. మనిషి శరీర లక్షణాలను బట్టి రక్తం కారడం, చీము పట్టడం సాధారణమేనన్నారు. అయితే మందులు సక్రమంగా వాడి, సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో గాయం మానడం కొంత ఆలస్యమైందన్నారు. దీనికే వైద్యురాలిని తిట్టడం, కేసులు పెట్టడం సరికాదన్నారు. శస్త్రచికిత్స చేసినప్పుడు ఏదైనా సమస్య వచ్చిఉంటే దానికి డాక్టర్‌దే బాధ్యతన్నారు. డిశ్చార్జి అనంతరం ఇంటికెళ్లిన 15 రోజుల తరువాత సమస్య వస్తే దానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. వైద్యుల సేవలు వెలకట్టలేనివని వారిపై అనవసరంగా  కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ వరప్రసాద్‌, పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-29T05:47:13+05:30 IST