చినుకు పడితే చీకటే

ABN , First Publish Date - 2021-05-09T03:53:33+05:30 IST

చినుకు పడితే చీకట్లో మూడు గిరిజన గ్రామాల ప్రజలు అంధకారంలో మగ్గాల్సిన పరిస్థితి దాపురించింది.

చినుకు పడితే చీకటే
స్తంభం విరిగి పడటంతో 11 కేవీ వైరును చెట్లపైకి కడుతున్న గ్రామస్థులు

గాలి వానకు విరుగుతున్న స్తంభాలు.. తెగుతున్న వైర్లు 

25 కిలో మీటర్ల మేర 200 అతుకులు

నెలలో పది రోజులు అంధకారమే

వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు గ్రామాల దుస్థితి ఇది

చెట్ల కొమ్మలు తొలగించేందుకు అనుమతి ఇవ్వని అటవీశాఖ


దోమలపెంట, మే 8: చినుకు పడితే చీకట్లో మూడు గిరిజన గ్రామాల ప్రజలు అంధకారంలో మగ్గాల్సిన పరిస్థితి దాపురించింది. అమ్రాబాద్‌ మండలం వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు గ్రామాల పరిస్థితి ఇది. శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న వటువర్లపల్లికి 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో అచ్చంపేట ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు సహకారంతో రూ.1.70 కోట్ల నిధులతో సింగిల్‌ ఫేస్‌ కరెంటు లైన్‌ ఏర్పాటు చేశారు. 25 కిలోమీటర్ల మేర మన్ననూర్‌ నుంచి సుమారు 850 స్తంభాలు వేశారు. కానీ కరెంట్‌ ఏనాడూ సక్రమంగా సరఫరా అయిన దాఖలాలు లేవు. చాలా వరకు స్తంభాలు విరిగి పోవడంతో నాలుగేళ్ల కిందట మరో రూ.40 లక్షలు ఖర్చు చేసి, మరమ్మతులు చేశారు. 25 కిలో మీటర్ల పొడవున కరెంట్‌ కేబుల్‌ తెగిన చోట 200లకుపైగా అతుకులు వేశారు. ఇప్పటికీ చాలా చోట్ల చెట్ల కొమ్మలపై వైర్లు వేలాడుతున్నాయి. దీని మూలంగా చిన్నపాటి వర్షానికే వైర్లు తెగుతున్నాయి. ఆ తర్వాత కరెంటు సరఫరా చేసేందుకు కనీసం రెండు రోజులైనా సమయం పడుతుండటంతో గ్రామాలు చీకట్లో మగ్గడమే కాకుండా తాగునీటికీ తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది.


ప్రజా ప్రతినిధులకు విన్నవించినా..

సమస్య పరిష్కారం కోసం ప్రస్తుతం ఉన్న 11 కేవీ కరెంట్‌ వైరును తొలగించి కొత్త వైరును ఏర్పాటు చేయించాలని గ్రామస్థులు పలుమార్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజును కలిసి విన్నవించారు. వటువర్లపల్లి సర్పంచ్‌ చత్రునాయక్‌ గత ఏడాది సీఎం ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్‌, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఏడాది దాటినా ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉందని సర్పంచ్‌ చెబుతున్నారు. ఎంపీ రాములు, ఎమ్మెల్యే బాలరాజు ఇప్పటికైనా స్పందించి కొత్త వైరు ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు. ప్రస్తుతానికి కరెంటు వైరుకు తగులుతున్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు అటవీశాఖ నుంచి అనుమతి ఇప్పించాలని అంటున్నారు.


కొత్త వైరు కోసం నివేదిక పంపించాం

వటువర్లపల్లికి కరెంట్‌ సరఫరా చేసేందుకు కొత్త లైన్‌ ఏర్పాటు చేసేందుకు దోమలపెంట, మన్ననూర్‌ ఇరువైపులా నుంచి అందించేందుకు ఇటీవల అధికారు లకు నివేదిక పంపించాం. చెట్ల కొమ్మలు తొలగించేందుకు అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వడం లేదు.

- వెంకటేష్‌, ట్రాన్స్‌కో ఏఈ, అమ్రాబాద్‌ 

Updated Date - 2021-05-09T03:53:33+05:30 IST