మనం అనే గమనం ఉంటే ప్రతిరోజూ పండగే

ABN , First Publish Date - 2021-04-13T06:32:24+05:30 IST

ప్రకృతి, ధర్మాలను ప్రేమిస్తేనే అవి మనల్ని రక్షిస్తాయి. దీనికి విపరీతంగా ప్రవర్తిస్తే మరణమృదంగమేనని శార్వరీనామ సంవత్సరం గుణపాఠం నేర్పింది. కారం, చేదు, ఉప్పు, తీపి, పులుపు, వగరు షడ్‌రుచులను పరిచయం చేసింది.

మనం అనే గమనం ఉంటే ప్రతిరోజూ పండగే

 ప్రకృతిని ప్రేమిస్తేనే ప్లవనామలో విప్లవం

 శార్వరీనామ.. ఓ గుణపాఠం

నేడు ఉగాది

నల్లగొండ, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రకృతి, ధర్మాలను ప్రేమిస్తేనే అవి మనల్ని రక్షిస్తాయి. దీనికి విపరీతంగా ప్రవర్తిస్తే మరణమృదంగమేనని శార్వరీనామ సంవత్సరం గుణపాఠం నేర్పింది. కారం, చేదు, ఉప్పు, తీపి, పులుపు, వగరు షడ్‌రుచులను పరిచయం చేసింది. శార్వరీనామ సంవత్సరంలో ఆరు నెలల పాటు కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేసింది. ఒక్కోటి చొప్పున అన్ని వ్యవస్థలు కళ్లముందే కుంచించుకుపోయాయి. జనజీవన స్తంభించింది. డబ్బు ఖర్చు పెట్టినా తిండి దొరకని కడుపు మంట కారాన్ని రుచిచూపించింది. ఉన్నఫలం గా ఊడిన ఉద్యోగాలు, కరువైన బతుకుదెరువుతో పొట్ట చేతబట్టుకొని కన్నీళ్లు మింగుకుంటూ కన్న ఊరుబాట ఉప్పదనాన్ని చవిచూపించింది. ఆ తరువాత గాడిన పడిన నాలుగు నెలలు క్రమంగా జీవితంపై ఆశలు చిగురిం చి తీపి దనాన్ని పరిచయం చేసింది. గత పీడకలల ను మరవకముందే రెక్కలు విచ్చుకున్న పక్షిలా ఎల్లలు దాటి ఎగురుతూ వచ్చిన కరోనా సెకండ్‌ వేవ్‌ చేదును చేరువచేసింది. ఇలా షడ్‌రుచుల అనుభవా లు మిగిలాయి. ప్రకృతిని పరిరక్షించుకుంటే అది మనల్ని కాపాడుతుందని మొదటి వేవ్‌లో అనుభపూర్వకంగా నిరూపణ కాగా, మనం బాధ్యత మరచిన కొద్ది రోజులకే సెకండ్‌ వేవ్‌ తన వికృత రూపాన్ని చూపింది. కరోనా మహమ్మారి వీడిపోకముందే మాస్కులు తీసేయడం, భౌతిక దూరం నిబంధనను బ్రేక్‌ చేయడంతో సెకండ్‌ వేవ్‌ పాపానికి మనమే కారకులం అయ్యాం. తొలి పాఠం మరిచిపోయే సరికి రెండో వేవ్‌ గుణపాఠమై గుండెల్లో గునపంలా మారింది. మొదటి దశకంటే వేగంగా మరణాలు నమోదవుతున్నాయి. అధికార ప్రకటనలు లేకపోవడంతో అంతా లైట్‌గా తీసుకుంటుండగా, వచ్చే రోజుల్లో ఆయాస ప్రయాసలు, ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరకని పరిస్థితి అనివార్యమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సింగిల్‌ డిజిట్‌ నుంచి కరోనా కేసులు డబుల్‌ డిజిట్‌కు పెరుగుతూ పూర్వపు రోజులు పొంచే ఉన్నాయని డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. అందుబాటులో ఉన్న టీకాను వినియోగించుకోవాలని అధికార యంత్రాంగం దండం పెట్టి చెప్పినా, ఎవరూ ముందుకు రాకపోగా సెకండ్‌ వేవ్‌ ఊపేస్తుండటంతో టీకా కొరత మొదలైంది. ఈ ప్రమాదానికి మన ప్రవర్తనే కారణం అనేది సుస్పష్టం. మాస్క్‌ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా తప్ప దంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తున్న నేప థ్యంలో మన ముగింట్లో ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉందో అవగతం చేసుకోవాలి. మన ఆలోచనను పెంచుకొని, పదిమందితో పంచుకోవాలి. మేమింతే అనుకుంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం. ఎప్పుడు నేను, నా కుటుంబం అనే స్వభావాన్ని పక్క న పెట్టి మనం, మన సమాజం అనే ఆలోచనను ప్లవ నామ సంవత్సరంలో పెంచుకుంటేనే విప్లవం సాధ్యం. కలిసి ఉంటే కలదు సుఖం అనే నానుడిని ఆచరణలో చూపితే ప్రతిరోజూ పండుగే.


ప్రజలు సుభిక్షంగా ఉండాలి : మంత్రి జగదీష్‌ రెడ్డి

ప్లవ నామ సంవత్సరంలో ప్రజలు మరింత సుభిక్షంగా ఉండాలి. గత ఏడాది ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్న ప్రజలకు సుఖశాంతులు కలగాలి. విపత్కర పరిస్థితులు ఎదురైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యమిచ్చి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. ఈ ఏడాది అందుకు కొన సాగింపుగా బడ్జెట్‌ కేటాయింపులు చేశారు. రైతు కుటుంబాల్లో వెలుగులు నింపి వారి కళ్లలో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష. ప్లవనామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను.

Updated Date - 2021-04-13T06:32:24+05:30 IST