సీఎం చెప్పినందుకే.. నాపై కేసు, అరెస్టు: రఘురామ

ABN , First Publish Date - 2021-05-15T09:24:56+05:30 IST

సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణం రాజు శుక్రవారం రాత్రి అత్యవసర ంగా హైకోర్టులో పిటిషన్‌ (హౌస్‌మోషన్‌) దాఖలు చేశారు. ‘‘ఏపీ ముఖ్యమంత్రి బెయిల్‌ రద్దు చేయాలని హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులు పిటిషన్‌ దాఖలు చేశాను.

సీఎం చెప్పినందుకే.. నాపై కేసు, అరెస్టు: రఘురామ

  • ఈ అరెస్టు అక్రమం... 
  • సుప్రీం ఆదేశాల ఉల్లంఘన
  • హైకోర్టులో హౌస్‌ మోషన్‌ 
  • జడ్జి ముందు హాజరుపరచొద్దు
  • ఆహారం, మందులు ఇవ్వండి
  • సీఐడీకి హైకోర్టు ఆదేశం
  • రీజినల్‌ ఆఫీసులో రఘురామ


అమరావతి/గుంటూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణం రాజు శుక్రవారం రాత్రి అత్యవసర ంగా హైకోర్టులో పిటిషన్‌ (హౌస్‌మోషన్‌) దాఖలు చేశారు. ‘‘ఏపీ ముఖ్యమంత్రి బెయిల్‌ రద్దు చేయాలని హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులు పిటిషన్‌ దాఖలు చేశాను. ఈ నెల 17న ఇది విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో... ముఖ్యమంత్రి సూచనలతోనే నాపై కేసు పెట్టి అరెస్టు చేశారు’’ అని  రఘురామ రాజు తన బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల పై సద్విమర్శలు చేస్తుంటానని... ఇప్పటికే తనపై నమోదైన కేసులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశానని గుర్తు చేశారు.


‘‘నాపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. మరోవైపు... కరోనా నేపథ్యంలో ఏడేళ్లలోపు శిక్షకు అవకాశమున్న కేసుల్లో ఎవరినీ అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా అరెస్టు చేశారు. అభ్యంతరాలు లేవనెత్తినా పట్టించుకోలేదు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేయండి’’ అని అందులో కోరారు. సీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌, మంగళగిరి సీఐడీ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోను ప్రతివాదులుగా చేర్చారు.



హౌస్‌ మోషన్‌పై నేడు విచారణ

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టుపై శనివారం మధ్యాహ్నం 1 గంటకు హైకోర్టు విచారణ జరపనుంది. ఈలోపు ఆయనను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచరాదని సీఐడీని ఆదేశించింది. అరెస్టును సవాలు చేస్తూ రఘురామ కృష్ణంరాజు శుక్రవారం అప్పటికప్పుడు హైకోర్టులో హౌస్‌ మోషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణ, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ సుధాకర్‌ రెడ్డి ఆడియో కాన్ఫరెన్స్‌లో వాదనలు వినిపించారు. వీటిని ఆలకించిన న్యాయమూర్తి జస్టిస్‌ సురేశ్‌ రెడ్డి తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. శనివారం హౌస్‌మోషన్‌పై విచారణ జరిపేదాకా రఘురామను మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచరాదని సీఐడీని ఆదేశించారు. అలాగే... ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా... మందులు తెచ్చుకునేందుకు, బయటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతించాలని స్పష్టం చేశారు.


హైడ్రామా...: హైదరాబాద్‌లో అరెస్టు చేసిన రఘురామ కృష్ణంరాజును అనేక నాటకీయ పరిణామాల మధ్య గుంటూరుకు తరలించారు. సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ నేతృత్వంలో మొత్తం ఐదు ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌కు వెళ్లారు. రఘురామను అరెస్టు చేసి శుక్రవారం రాత్రి 9.50 గంటలకు గుంటూరులోని సీఐడీ రీజనల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత మరో వాహనం కూడా సీఐడీ కార్యాలయంలోకి వచ్చింది. అందులో రఘురామ కుటుంబ సభ్యులున్నట్లు తెలుస్తోంది. సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ కూడా అక్కడికి వచ్చారు. సీఐడీ ఉన్నతాధికారులు రఘురామకృష్ణంరాజును ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  పోలీసులు సీఐడీ కార్యాలయం పరిసర ప్రాంతాలను పూర్తి అదుపులోకి తీసుకున్నారు. మీడియా సైతం ఆ పరిసరాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. 

Updated Date - 2021-05-15T09:24:56+05:30 IST