తెలంగాణలోనూ ఆదివాసీలకు అన్యాయమే

ABN , First Publish Date - 2020-10-31T06:04:29+05:30 IST

జల్‌–జంగిల్–జమీన్... ఇదీ ఆదివాసీ బతుకుచిత్రం. కానీ, నేడు తెలంగాణ రాష్ట్రంలో అదే కరువైంది. తెలంగాణ వస్తే ఆదివాసీలకు స్వయం పాలన...

తెలంగాణలోనూ ఆదివాసీలకు అన్యాయమే

జల్‌–జంగిల్–జమీన్... ఇదీ ఆదివాసీ బతుకుచిత్రం. కానీ, నేడు తెలంగాణ రాష్ట్రంలో అదే కరువైంది. తెలంగాణ వస్తే ఆదివాసీలకు స్వయం పాలన వస్తుందని కలలుకన్నాము. కానీ మనుగడే దెబ్బతింటుందని ఊహించలేదు. నూతన జిల్లాల ఏర్పాటు ఆదివాసి ప్రాంతాలను ముక్కలుగా చేసింది. ఆదివాసి ప్రాంతాలలో ఐటీడీఏలను పంచాయతీ రాజ్ చట్టం- 1996 4(ఓ) క్లాజు అనుసరించి ప్రత్యేక ఆదివాసి జిల్లాలుగా చేయాలని ఉద్యమించినా ఆదివాసి జిల్లాలు దక్కలేదు. కానీ, నేడు గోండు ప్రాంతాన్ని నిర్మల్, ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలుగా విభజించినారు. కోయ ప్రాంతాన్ని భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంగా చేశారు. చెంచు ప్రాంతాన్ని మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్‌గా విభజించారు. ఇంకా సరిపోదు అన్నట్టు మండలాలుగా కూడా విభజన చేశారు. శ్రీకృష్ణ కమిటీ కూడా ఆదివాసీలకు స్వయం పాలన అవసరమని తెలిపింది. మరి ఆదివాసీ ప్రాంతాలను ఎందుకు ఆదివాసి జిల్లాలుగా చేయలేదు? ఇదేనా కొమరం భీమ్ కలలుగన్న ఆదివాసీ స్వయం పరిపాలన? 

గోదావరి పరివాహక ప్రాంతంలో ఓపెన్ కాస్ట్‌లు మొదలు అయినవి. గ్రామ సభల నిర్వహణ లేదు, ‘పెసా’ చట్టం అమలు లేదు, ప్రజాభిప్రాయ సేకరణ లేదు, భూ నిర్వాసితులకు పరిహారం లేదు, అడవిని ఆదివాసి జీవనాన్ని పెద్దపెద్ద అధునాతన వాహనాలు ధ్వంసం చేస్తున్నవి. తుపాకులగూడెం బ్యారేజ్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల 20 వేల ఎకరాలకు నీరు అందుతుంది, మూడు పంటలు పండుతాయి. కానీ తుపాకుల గూడెం గ్రామానికి బిందెడు నీరు త్రాగటానికి ఇవ్వరు. ఒక ఎకరానికీ సాగు నీరు ఇవ్వరు. గోదావరి ఒడ్డున ఉన్న బీడు బారిన ఆదివాసి భూములకు చుక్క సాగు నీరు ఉండదు. దేవాదుల ప్రాజెక్టు నుండి తెలంగాణ మైదాన ప్రాంతాలకు గోదావరి నీరు నాలుగు లక్షల ఎకరాలకు పారుతుంది కానీ ఒడ్డున ఉన్న తుపాకుల గంగారాం కోయ గూడేనికి బిందెడు నీరు అందే పరిస్థితి లేదు. గోదావరిలో చెలిమ నీరే గతి. తెలంగాణ వస్తే మా నీళ్లు మాకు అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆదివాసీల నీళ్ళు తెలంగాణకు అందుతున్నవి, ఆదివాసీల గొంతెండుతోంది. 

తెలంగాణ వస్తే మా భూములకు పట్టాలు వస్తాయని అనుకున్నాం కానీ ఉన్న భూములలోకి ఫారెస్ట్ వారు వచ్చారు. నాడు కొమురంభీం పోరాటంలో పోడు భూముల పైకి నిజాం జంగ్లాత్ సైన్యాలు ఎలా ఎగబడ్డాయో, నేడు అటవీశాఖ అంతే దారుణంగా వ్యవహరిస్తుంది. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పార్లమెంటరీ విధానంలో వచ్చిన పట్టా భూములను కూడా లెక్క చేయకుండా ఆదివాసీలపై దాడులు చేస్తోంది. హరితహారం పేరిట ఆదివాసి గూడెలపై జరిగే దాడులలో అమాయక ఆది

వాసీలు బలైపోయారు. కానీ అటవీ ప్రాంతంలోకి వలస వచ్చి పాకాల, ఏటూరు నాగారం అభయారణ్యాలు సహా వేలాది ఎకరాల అడవిని పొడిచేసి, జంతువుల్ని వేటాడి, వాటి మాంసంతో, పులి గోర్లతో వ్యాపారం చేస్తున్న బడా గిరిజనేతరులపై మాత్రం దాడులు జరగవు. జీవవైవిధ్యాన్ని దైవంగా కొలిచే అడవిబిడ్డలపై మాత్రం అటవీశాఖ నిరంతరం దాడులు చేస్తూనే ఉంటుంది. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరులు స్థిరాస్తులు కలిగి ఉండటం నిషిద్ధం. నేడు దానికి భిన్నంగా ఎల్‌ఆర్‌ఎస్‌ లాంటి విధానాలతో గిరిజనేతరులకు ఇంటిస్థలాల రిజిస్ట్రేషన్ కూడా రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోంది. హైమన్‌డార్ఫ్‌ కమిషన్‌ నుంచి కోనేరు రంగారావు కమిటీ వరకూ ఆదివాసీల రక్షణకు ఎన్ని సూచనలు చేసినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏకంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులకు భూమి పట్టాలు, రైతుబంధు, లోన్లు, భూమిపై హక్కులు దక్కుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఇంటి రిజిస్ట్రేషన్లే జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు వన్ బై సెవెంటీ చట్టాన్ని తీసివేయాలని బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఆదివాసి ప్రాంతాన్ని ఒక ప్రత్యేక ప్రాంతంగా కాక, జనరల్ ప్రాంతంగా పరిపాలన చేయడం మూలంగా ఆదివాసీ ప్రాంతాలు భద్రతను కోల్పోతున్నాయి. వలసలు పెరిగి ఆదివాసి జీవనం ధ్వంసమవుతోంది. ఇక, అక్రమంగా ఎస్టీ జాబితాలో చేరిన లంబాడీలకే ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. అక్రమ ఏజెన్సీ సర్టిఫికెట్లను పొంది ఉద్యోగాలను దోచుకుంటున్నారు. రెండు దఫాల్లోనూ గిరిజన మంత్రిత్వ శాఖను లంబాడి సామాజికవర్గానికి ఇచ్చారు తప్ప ఆదివాసీలకు దక్కలేదు. నల్లమల అటవీ ప్రాంతంలో చెంచుల జీవనం దుర్భరంగా మారింది. నిజాం ప్రభుత్వం కూడా చెంచుల సంక్షేమం కోసం ప్రత్యేక కలెక్టర్‌ను నియమించి కృషి చేసింది కానీ, నేటి తెలంగాణలో అటువంటి వైఖరి కనబడటం లేదు. చెంచులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నందున వారిని రక్షించుకోవలసిన బాధ్యత మనపైనే ఉంది. ఆ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా ప్రకటించి, వలసలను నిరోధించి, చెంచుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉన్నది. నల్లమలలో కూడా ఉద్యోగాలలో 99% లంబాడీలే పొందే పరిస్థితులు ఉన్నవి కాబట్టి చెంచుల కోసం ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు జరగాలి. 

జోడేఘాట్‌లో కొమురం భీమ్ స్మారక చిహ్నం ఏర్పాటు చేసినంత మాత్రాన ఆయన ఆశయం నెరవేరినట్టు కాదు. భీమ్ ఆశయమైన ‘జల్ జంగల్ జమీన్’ నినాదం పై ప్రభుత్వం ఆలోచన చేయాలి. అటవీ ప్రాంతంలో నిజంగా అడవిని ధ్వంసం చేస్తున్నది ఎవరనేది పరిశీలించడానికి ఒక కమిషన్ నియమించి దాని ఆధారంగా కీలకమైన నిర్ణయాలు చేయాలి. ఆదివాసీల భూములకు పట్టాలు ఇవ్వాలి, అడవినీ, ఆదివాసీలను రక్షించాలి. ఆదివాసీ ప్రాంతాలను ప్రత్యేక ఆదివాసి జిల్లాలుగా ఏర్పాటు చేయాలి. ఓపెన్ కాస్ట్‌లను నిలిపివేయాలి. ఆదివాసీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆదివాసి ప్రాంతంలోకి అక్రమ వలసలను నిరోధించాలి. ఐదో షెడ్యూల్ ప్రాంతానికి ఇన్నర్ లైన్ పర్మిషన్ రూల్ అమలు చేయాలి. తెలంగాణ పునర్విభజన బిల్లులో ప్రకటించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని జోడేఘాట్ కొండపైన ఏర్పాటు చేయాలి. ఆదివాసి ప్రాంతంలో అన్ని కళాశాలలు 

రెసిడెన్షియల్ పద్ధతిలో ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క 

ఐఏఎస్ కూడా ఆదిమ తెగల నుంచి లేకపోవటం సిగ్గుచేటు కాబట్టి ఆదివాసి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి. 

ఐదువందల నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించి అండగా నిలవాలి. ఏజెన్సీ సర్టిఫికెట్ కేవలం ఆదివాసులకు వర్తించే విధంగా జీవో తెచ్చి ఆదివాసీ నిరుద్యోగులను రక్షించాలి. గ్రామ సభల నిర్వహణ ద్వారా ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి విధానం ప్రకటించాలి. ఆదివాసీ వ్యవసాయ విధానంతో రైతాంగాన్ని ఆదుకోవాలి. ప్రతి ఐటీడీఏ కేంద్రంలో వంద పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి. ఐటిడిఎ ప్రాంతాలు కేంద్రంగా ప్రత్యేక ఆదివాసి జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో ఆదివాసీలకు రక్షణలు కల్పించకపోతే సామాజిక న్యాయం జరగదు. 

నిజాం సైన్యంతో పోరాటంలో ఓటమి తప్పదని తెలిసినా 

భీమ్‌ వెనుకడుగువేయలేదు. ప్రత్యేక ఆదివాసీ రాష్ట్ర డిమాండ్‌తో మరొక వేర్పాటు ఉద్యమం జరగకముందే ఆదివాసీల హక్కుల, చట్టాల, ప్రాంతాల పరిరక్షణ బలంగా జరగాలి. ఆదివాసీ 

ప్రజలను కడుపులో పెట్టుకొని సాదుకోవలసిన బాధ్యత 

తెలంగాణ ప్రభుత్వానికీ, సమాజానికి ఉందని కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా గ్రహించాలి. 

మైపతి అరుణ్ కుమార్

వర్కింగ్ ప్రెసిడెంట్, ఆదివాసి హక్కుల పోరాట సమితి 

(నేడు కొమురం భీం వర్ధంతి)

Updated Date - 2020-10-31T06:04:29+05:30 IST