ఇది వీరభూమి, పుణ్యభూమి

ABN , First Publish Date - 2022-07-05T09:25:29+05:30 IST

ఆంగ్లేయులపై పోరాడే క్రమంలో అల్లూరి సీతారామరాజు చూపించిన తెగువ 130 కోట్ల భారతీయులకు స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై అల్లూరి మాదిరిగానే పోరాడాలని పిలుపునిచ్చారు.

ఇది వీరభూమి, పుణ్యభూమి

  • దేశభక్తులను కన్నగడ్డ ఆంధ్రప్రదేశ్‌.. 
  • అల్లూరి ఆదర్శం అజరామరం
  • అణగారినవారి నేతృత్వం ఈనాడు అవసరం
  • భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన

(భీమవరం నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆంగ్లేయులపై పోరాడే క్రమంలో అల్లూరి సీతారామరాజు చూపించిన తెగువ 130 కోట్ల భారతీయులకు స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై అల్లూరి మాదిరిగానే పోరాడాలని పిలుపునిచ్చారు. మన్యం వీరుడి స్ఫూర్తి తో దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ముందుకెళితే భారతదేశ ప్రగతిని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ దేశ భక్తులకు పురిటిగడ్డ అంటూ పలువురు స్వతంత్ర సమరయోధుల పేర్లను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలను ప్రజలకు వివరిస్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని నమోదీ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, యావత్‌ భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన తెలుగుజాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన 125 జయంతి సందర్భంగా ఆ మహనీయుడు నడయాడిన గడ్డపై ఆయన కుటుంబసభ్యులతో వేదిక పంచుకోవడం, కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.


 ఆంధ్రప్రదేశ్‌ దేశభక్తులను కన్న పుణ్యభూమి, వీరభూమి అని, ఇటువంటి ప్రాంతానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇటువంటి మహనీయుల త్యాగాలను నేటితరానికి తెలియజెప్పాలని, వారి పోరాటపటిమ నేటితరానికి స్ఫూర్తి కావాలనే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం వేడుకలను నిర్వహిస్తున్నట్టు వివరించారు. అల్లూరి సీతారామరాజు దేశంకోసం బ్రిటీషర్లపై తిరగబడినప్పుడు ఆయన వయసు కేవలం 24 ఏళ్లని, ఆదివాసీల్లో శౌర్యం, ధైర్యం నింపి ఆయన చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ‘మనదే రాజ్యం’ నినాదంతో ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన ఘనత విప్లవ వీరుడు అల్లూరికే దక్కుతుందని తెలిపారు. ఆయనతోపాటూ ఎందరో యువకులు దేశ స్వాతంత్య్రం కోసం ఆనాడు పోరాటం చేశారని, వారి ప్రేరణతో నేడు దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ ఏడాది మొత్తం మన్నెం వీరుడి 125వ జయంత్యుత్సవాలు కూడా జరుపుతామన్నారు. అల్లూరి రంప ఉద్యమం ప్రారంభించి సరిగా 100 ఏళ్లు అవుతోందని గుర్తు చేశారు. 


అన్నివర్గాల అభివృద్ధికి చర్యలు..

దేశంలో ఆదివాసీలతోపాటు యువకులు, మహిళలు, వెనుకబడిన అన్నివర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని అన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో గిరిజనులకు అటవీ సంపదపై హక్కులు కల్పించామన్నారు. మహనీయుల కలలను సాకారం చేసేందుకు ‘ఖేల్‌ ఇండియా’ కింద యువతకు నైపుణ్య కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రైతులను అన్నివిధాలా అదుకుంటున్నామన్న ఆయన, అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించామని ప్రధాని చెప్పారు.  వెనుక బడిన జిల్లాల అభివృద్ధిలో భాగంగా మన్యం జిల్లా లంబసింగిలో అల్లూరి మెమోరియల్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని తెలిపారు. మోగల్లులో ధ్యాన మందిరం, అల్లూరి దాడి చేసిన చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ అభివృద్ధి, స్వాతంత్య్ర పోరాటంలో ఆదివాసీల త్యాగాలను స్ఫూరిస్తూ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 


తెలుగువీర లేవరా..

విప్లవ వీరుడి విగ్రహావిష్కరణ సందర్భంగా తన ప్రసంగాన్ని ప్రధాని మోదీ తెలుగులో మొదలుపెట్టి సభికులను ఆకట్టుకున్నారు. ‘‘తెలుగు వీర లేవరా -దీక్ష బూని సాగరా’ అంటూ తెలుగులో ప్రసంగించారు. ప్రసంగం మొదలుపెట్టగానే ‘భారత్‌ మాతాకు జై’ అని తానూ అంటూ..సభికులతో అనిపించి ప్రధాని తన ప్రసంగం తెలుగులో ప్రారంభించి.. ఆ తర్వాత హిందీలో కొనసాగించారు. ‘‘దేశం అభివృద్ధి జరగాలంటే అణచివేతకు గురైన కులాలు నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది. యువకులు, ఆదివాసీలు, మహిళలు, దళితులు... ఇలా వెనుక బడిన కులాలన్నింటికీ సమాన ఫలాలు అందాల్సి ఉంది. అణచివేత నుంచి వచ్చిన వారి నాయకత్వంలో జరిగే దేశ అభివృద్ధి కృషిని ఏ శక్తీ నిలువరించలేదు. అల్లూరి స్ఫూర్తిగా...‘దమ్ముంటే నా దేశ ప్రగతిని ఆడ్డుకోండి’ అంటూ సవాల్‌ విసిరి ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు.  


ప్రధానికి నల్ల బెలూన్లతో నిరసన!

అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రధాని  మోదీకి నిరసన సెగ తగిలింది.   పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మోదీ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం  గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. తర్వాత హెలికాప్టర్‌లో ప్రధాని మోదీ, సీఎం జగన్‌, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ భీమవరం బయల్దేరారు. హెలికాప్టర్‌ ఎగిరిన కొద్దిసేపటికి ఒక్కసారిగా నల్లబెలూన్లు గాల్లోకి ఎగురుతూ విమానాశ్రయ ప్రాంగణంలోకి వచ్చాయి.


యోధుల వారసులకు ప్రధాని సత్కారం

అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులను ప్రధాని మోదీ ఘనంగా సన్మానించారు. అల్లూరి, ఆయన అనుచరుల వారసులను ప్రత్యేకంగా పరామర్శించి, సత్కరించారు. తొలుత అల్లూరి సోదరుడు సత్యనారాయణరాజు పెద్ద కుమారుడు శ్రీరామరాజు (83)ను మోదీ సన్మానించారు. నడవలేని స్థితిలో ఉన్న అల్లూరి అనుచరుడు గంటందొర మనవడు గాం బోడిదొర (90)ను చక్రాల కుర్చీలో తీసుకువచ్చారు. ఆయనను ప్రధాని మోదీ శాలువాతో సత్కరించి, నమస్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల వారసులను కొద్దిమందిని ప్రధాని విడిగా కలిశారు. వారిలో తాడేపల్లిగూడెంకు చెందిన ప్రసిద్ధ స్వాతంత్య్ర సమర యోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మీ దంపతుల కుమార్తె కృష్ణభారతి కూడా ఉన్నారు. నడవడానికి ఇబ్బంది పడుతున్న ఆమె చక్రాల కుర్చీలో వచ్చారు. ఆమెను ప్రధాని శాలువాతో సత్కరించారు.  కాళ్లకు నమస్కారం చేశారు. 

Updated Date - 2022-07-05T09:25:29+05:30 IST