ఐటీహబ్‌ జాబ్‌మేళాకు భారీ స్పందన

ABN , First Publish Date - 2020-11-29T04:59:59+05:30 IST

ఖమ్మంలో 2వ తేదీన ప్రారంభమయ్యే ఐటీహబ్‌ ద్వారా మొదటిదశలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించేందుకు శనివారం ఎస్‌బీఐటీలో టాస్క్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు భారీ స్పందన లభించింది.

ఐటీహబ్‌ జాబ్‌మేళాకు భారీ స్పందన
రిజిస్త్రేషన్‌ కోసం క్యూలో నిలుచున్న అభ్యర్థులు

సుమారు ఐదువేల మంది అభ్యర్థుల హజరు 

రాత్రివరకు కొనసాగిన ఇంటర్వ్యూలు

ఐటీ కంపెనీలకు పూర్తిసహకారం: ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌ 


ఖమ్మం కార్పొరేషన్‌, నవంబర్‌ 27: ఖమ్మంలో 2వ తేదీన ప్రారంభమయ్యే ఐటీహబ్‌ ద్వారా మొదటిదశలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించేందుకు శనివారం ఎస్‌బీఐటీలో టాస్క్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు భారీ స్పందన లభించింది. మొదటి, రెండో దశల్లో 300 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయవలసి ఉండగా, ఒకేసారి సుమారు 5వేల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. దీంతో ఎస్‌బీఐటీ కళాశాల ప్రాంగణం కిటకిటలాడింది. తమ పేర్లు రిజిస్త్రేషన్‌ చేయించుకునేందుకు అభ్యర్థులు బారులు తీరారు. దాంతో రహదారి వరకు క్యూ పెరిగింది. ఉదయి 9గంటలకే అభ్యర్థులు రాగా శనివారం రాత్రి వరకు ఇంటర్వ్యూలు కొనసాగాయి. 


ఐటీ కంపెనీలకు పూర్తిసహకారం: కలెక్టర్‌ కర్ణన్‌


ఖమ్మం ఐటీహబ్‌లో ఉద్యోగ నియామకా ద్వారా జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన ఐటీ కంపెనీలకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ పేర్కొన్నారు. టాస్క్‌ ఆఽధ్వర్యలో నిర్వహించిన జాబ్‌మేళాను కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. అనంతరం మెగాజాబ్‌ మేళాకు హాజరైన వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధల పరిచయ సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌, కరీంనగర్‌ తరువాత ఖమ్మంలో అన్ని వసతులు, సదుపాయాలతో ఐటీహబ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవతో ఖమ్మం నడిబొడ్డున, అనుకూలమైన ప్రదేశంలో ఐటీహబ్‌ నిర్మాణం చేపట్టినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. జాబ్‌మేళాకు భారీ సంఖ్యలో అభ్యర్థులు రావటం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. యువతలో నైపుణ్యం, భాషా పరిజ్ఙానం, అనుభవం ఆధారంగా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్‌ కర్ణన్‌ ఐటీ కంపెనీల ప్రతినిధులను కోరారు. మొదటి దశలో ప్రస్తుతం ఎంపికలు జరుగుతుండగా, రెండో దశలో కూడా మళ్లీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. అనంతరం కలెక్టర్‌ ప్రిమిలినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులతో మాట్లాడారు. ప్రస్తుతం తమకు లభించిన అవకాశాల ద్వారా ఉన్నతస్థానాలకు ఎదగాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. వివిధ ప్రాంతాలనుంచి 14 కంపెనీలు నగరానికి వచ్చాయని, భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు ఖమ్మానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎస్‌ఐబీటీ కళాశాల చైర్మన్‌ గుండాల కృష్ణ మాట్లాడుతూ మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ సహకారంతో జిల్లాలోని నిరుద్యోగులకు ఐటీహబ్‌ ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లాలోని ఇంజనీరింగ్‌ కళాశాలలు హైదరాబాద్‌కు తరలివెళుతున్న నేపధ్యంలో ఖమ్మంలో ఐటీహబ్‌ ఏర్పాటు చేయటం శుభపరిణామమన్నారు. ఐటీ కంపెనీల ప్రతినిధులలో ఖమ్మం నగరానికి చెందినవారు కూడా ఉన్నారని కృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో టాస్క్‌ అధికారులు శ్రీనివాస్‌, సుధీర్‌, దినేష్‌, శిక్షణ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్‌, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T04:59:59+05:30 IST