హైకోర్టును కర్నూలు తరలించండి

ABN , First Publish Date - 2020-02-16T09:47:03+05:30 IST

పాలన వికేంద్రీకరణలో భాగంగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుచేయాలని నిర్ణయించామని.. అందుచేత హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు

హైకోర్టును కర్నూలు తరలించండి

విశాఖలో బెంచ్‌ పెట్టండి.. మండలి రద్దుకు తక్షణమేచర్యలు

దిశ చట్టాన్నీ ఆమోదించండి.. కేంద్ర న్యాయ మంత్రికి జగన్‌ వినతి

అందుబాటులో లేని ఆర్థిక, జలశక్తి మంత్రులు

మధ్యాహ్నమే సీఎం తిరుగుపయనం

వచ్చే నెలలో మళ్లీ ఢిల్లీకి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): పాలన వికేంద్రీకరణలో భాగంగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుచేయాలని నిర్ణయించామని.. అందుచేత హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే శాసనమండలి రద్దును కూడా తక్షణమే ఆమోదించాలని అభ్యర్థించారు. ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రితో సీఎం సమావేశమయ్యారు. 45 నిమిషాలు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మండలి రద్దుకు కారణాలేంటని రవిశంకర్‌ ప్రసాద్‌ సీఎంను అడిగినట్లు తెలిసింది.


అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు కావాలని, రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందువల్ల అంత భరించే స్థితిలో లేదని.. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాము పరిపాలనను వికేంద్రీకరించాలన్న ఉద్దేశంతో.. అమరావతిని శాసన రాఽజదానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా నిర్ణయించినట్లు జగన్‌ తెలిపారు.


ఆ బిల్లుతో పాటు సీఆర్‌డీఏ రద్దు బిల్లును తమ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపగా.. అక్కడ ప్రతిపక్ష టీడీపీకి మెజారిటీ ఉండడంతో వాటిని సెలెక్ట్‌ కమిటీకి పంపాలని నిర్ణయించారని వివరించారు. తమ నిర్ణయానికి అడ్డగోలుగా అడ్డుతగిలి, అభివృద్ధికి గండి కొట్టే ప్రయత్నం చేయడంతో తమ ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయించిందని జగన్‌ చెప్పారని తెలిసింది. మండలి రద్దుకు న్యాయశాఖ తక్షణమే ఆమోదం తెలపాలని.. పార్లమెంటులో బిల్లు పెట్టి, ఆమోదం పొందేందుకు సహకరించాలని మంత్రిని కోరారు. ప్రస్తుతం అమరావతిలో కొనసాగుతున్న హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని.. అలాగే విశాఖపట్నంలో హైకోర్డు బెంచ్‌ ఏర్పాటు చేయాలని కోరినట్లు సమాచారం. ఈ అంశాలపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి, తగు చర్యలు తీసుకుంటామని  రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారని అంటున్నారు. దిశ చట్టానికి తక్షణమే ఆమోదం తెలపాలనీ జగన్‌ విజ్ఞప్తి చేశారు.


రెండో దశ పార్లమెంటు సమావేశాల్లో..

కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులు నిర్మలా సీతారామన్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌లను కూడా శనివారం సీఎం కలవాల్సి ఉంది. అయితే వారు అందుబాటులో లేకపోవడంతో ఆయన మధ్యాహ్నం రెండుగంటలకు రాష్ట్రానికి తిరుగుపయనమయ్యారు. వారిని కలిసేందుకు వచ్చేనెలలో మళ్లీ ఢిల్లీ వస్తారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. కాగా.. ఉదయం జగన్‌ అందుబాటులో ఉన్న వైసీపీ ఎంపీలతో తన అధికార నివాసంలో బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. 

Updated Date - 2020-02-16T09:47:03+05:30 IST