ఇక ఐటీ ఉద్యోగుల ఆఫీస్ బాట...

ABN , First Publish Date - 2021-10-24T05:30:00+05:30 IST

రోనా తీవ్రత తగ్గిన నేపధ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు క్రమంగా ముగింపు పలుకుతూ వస్తున్నాయి. ఉద్యోగులను కార్యాలయానికి రప్పించేందుకు పలు ఐటీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

ఇక ఐటీ ఉద్యోగుల ఆఫీస్ బాట...

బెంగళూరు : కరోనా తీవ్రత తగ్గిన నేపధ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు క్రమంగా ముగింపు పలుకుతూ వస్తున్నాయి. ఉద్యోగులను కార్యాలయానికి రప్పించేందుకు పలు ఐటీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఐటీ దిగ్గజాలు టీసీఎస్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ తదితర  కంపెనీలు... ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు  రప్పించడం ద్వారా హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరించనున్నాయి. ఈ నేపధ్యంలో త్వరలో వర్క్ ఫ్రమ్ హోమ్ ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోం’ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా... ఇప్పుడు కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ దాదాపు పూర్తి కావొస్తుండడం వంటి అంశాలు ఉద్యోగులను కార్యాలయానికి రప్పించేందుకు దోహదపడుతున్నాయి.


భారత నెంబర్ వన్ ఐటీ కంపెనీ... టీసీఎస్ ఉద్యోగుల్లో 70 శాతం మంది వ్యాక్సీన్ వేయించుకున్నారు. మరో 95 శాతం మందికి కనీసం ఒక డోస్ పూర్తయింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ నేపధ్యంలో ఈ కంపెనీ ఉద్యోగుల్లో ఎక్కువమంది వ్యాక్సీన్ వేయించుకున్నారు. ఇక... '75 శాతం టీసీఎస్ ఉద్యోగులకు వ్యాక్సీన్ పూర్తయింది. మరో 95 శాతం ఉద్యోగులు కనీసం ఒక డోస్ వేసుకున్నారు' అని చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కాడ్ వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి 90 శాతం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు టీసీఎస్ ప్లాన్ చేస్తోంది. లేదా కనీసం 2022 క్యాలెండర్ ఏడాది ప్రారంభమయ్యే నాటికైనా ఈ టార్గెట్‌ను రీచ్ కావాలని భావిస్తోంది. అయితే 2025 నాటికి తమ ఉద్యోగుల్లో 25 శాతం వర్క్ ఫ్రమ్ చేయవచ్చునని పేర్కొంది. 


కరోనా నేపధ్యంలో హైబ్రిడ్ వర్క్ మోడల్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. వీటితో పాటు మారికో, విప్రో వంటి ఐటీ కంపెనీలు కూడా హైబ్రిడ్ వర్క్ మోడల్ దిశగా అడుగులేస్తున్నాయి. సంవత్సరమున్నర వర్క్ ఫ్రమ్ హోమ్ అనంతరం తమ ఉద్యోగులు వారానికి రెండుసార్లు కార్యాలయానికి వస్తున్నారని, వ్యాక్సినేషన్ పూర్తయిన వారు వస్తున్నారని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తెలిపారు. ఇక హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో సీనియర్ ఉద్యోగులు వారంలో రెండు రోజులు కార్యాలయాలకు వస్తున్నారు. 

Updated Date - 2021-10-24T05:30:00+05:30 IST