విద్యతోపాటు నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి: మేకపాటి గౌతంరెడ్డి

ABN , First Publish Date - 2020-02-20T08:37:33+05:30 IST

విద్యార్థులు విద్యతోపాటు నైపుణ్యాలను సైతం అందిపుచ్చుకునే దిశగా విశ్వవిద్యాలయాలు కృషిచేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు.

విద్యతోపాటు నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి: మేకపాటి గౌతంరెడ్డి

ఏయూ క్యాంపస్‌, ఫిబ్రవరి 19: విద్యార్థులు విద్యతోపాటు నైపుణ్యాలను సైతం అందిపుచ్చుకునే దిశగా విశ్వవిద్యాలయాలు కృషిచేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఏయూను సందర్శించారు. పాలక మండలి సమావేశం మందిరంలో నిర్వహించిన వర్సిటీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవసరాలకు అనుగుణంగా విద్యా రంగంలో అవసరమైన మార్పులు తీసుకురానున్నట్టు తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాల లక్ష్యాలతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో యువశక్తిని నైపుణ్యాలతో సుసంపన్నం చేయడమే లక్ష్యమన్నారు. ఏయూ ఇన్‌చార్జి వీసీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ అవంతి ఫీడ్స్‌ సంస్థతో ఇప్పటికే అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ఏయూలోని ఎంఎల్‌ఆర్‌ విభాగ విద్యార్థులకు అవసరమైన తర్ఫీదును అందించడంతోపాటు అధునాతన ల్యాబ్స్‌ను నిర్మించనున్నట్టు చెప్పారు. ఇన్‌చార్జి వీసీ ప్రసాద్‌రెడ్డి మంత్రి గౌతంరెడ్డికి జ్ఞాపిక అందజేసి సత్కరించారు. అనంతరం మంత్రి గౌతంరెడ్డి ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాలలోని సీమెన్స్‌ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి పరికరాలు, విద్యార్థులకు అందిస్తున్న శిక్షణను ప్రత్యక్షంగా పరిశీలించారు. శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్‌లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీసీపీ రంగారెడ్డి, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా మధుసూదనరెడ్డి, వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ వెంకట్రావు, పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-20T08:37:33+05:30 IST