చుట్టూ ఇసుకున్నా.. ఇంటికి ఇసుకేదీ..!

ABN , First Publish Date - 2022-01-06T05:46:16+05:30 IST

అంగట్లో.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది ఇసుక పరిస్థితి. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మూడు నెలలుగా రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో తీవ్ర ఇసుక కొరత ఏర్పడటంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. కంటికెదు రుగా పొలాల్లో ఇసుక మేటలు ఉన్నా తీసుకోలేని స్థితి. ఇదే అదునుగా భావించి ఇసుకాసురులు టిప్పర్‌ ఇసుకను ఏకంగా రూ.35వేలకు దొంగచాటుగా రవాణా చేస్తూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు.

చుట్టూ ఇసుకున్నా.. ఇంటికి ఇసుకేదీ..!
చెయ్యేరు ఒడ్డున పొలాలపై పేరుకుపోయిన లక్షల టన్నుల ఇసుక

మూడు నెలలుగా నిలిచిపోయిన నిర్మాణాలు

పొదలకూరు నుంచి తెప్పించుకుంటున్న వైనం

టిప్పర్‌ ఇసుక ఏకంగా రూ.35 వేలు


అంగట్లో.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది ఇసుక పరిస్థితి. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మూడు నెలలుగా రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో తీవ్ర ఇసుక కొరత ఏర్పడటంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. కంటికెదు రుగా పొలాల్లో ఇసుక మేటలు ఉన్నా తీసుకోలేని స్థితి. ఇదే అదునుగా భావించి ఇసుకాసురులు టిప్పర్‌ ఇసుకను ఏకంగా రూ.35వేలకు దొంగచాటుగా రవాణా చేస్తూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. 


రాజంపేట, జనవరి 5: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో అన్నమయ్య, పింఛా డ్యాంలు తెగిపోవడంతో చెయ్యేరు నది నేటికీ ప్రవహిస్తోంది. అన్నమయ్య ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లోని 40 గ్రామాల్లోనూ, పంట పొలాల్లోనూ ఏటికి అటు ఇటు లక్షల టన్నుల ఇసుక మేట పేరుకుపోయింది. సుమారు 20వేల ఎకరాల్లో ఈ ఇసుక మేటలు ఉన్నాయి. ఈ ఇసుకపై తమకే హక్కు కల్పిస్తే కొద్దిగానైనా నష్టం తీరుతుందని బాధితులు వేడుకుంటున్నారు. అయితే పొలాల్లోని మేట వేసిన ఇసుకకు సంబంధించి రైతుకు టన్నుకు రూ.60 ఇస్తామని చెప్పడంతో వివాదం చెలరేగి ఎక్కడి ఇసుక అక్కడే ఆగిపోయింది. ఇక భారీ వరదల వల్ల గతంలో గుర్తించిన ఇసుక క్వారీలన్నీ రూపులేకుండా పోయాయి.


ఆగిన ఇళ్ల నిర్మాణాలు

రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో సుమారు 50 వేల వరకు జగనన్న కాలనీ ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. అవికాక వందలాది ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ మూడు నెలలుగా ఇసుక దొరకక ఇంటి నిర్మాణాలన్నీ ఆగిపోయాయి. కార్మికులు పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ప్రజాసంఘాలు మంగళవారం ఇసుక మేటలు ఉన్న చెయ్యేటిలో నిరసన వ్యక్తం చేశారు. రైల్వేకోడూరులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సి.హెచ.చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఇసుక దీక్షను చేపట్టి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.


పేట్రేగిపోతున్న ఇసుకాసురులు

ఇదే అదునుగా భావించి ఇసుకాసురులు పేట్రేగిపోతున్నారు. ఏకంగా 20టన్నుల టిప్పర్లను రాత్రికి రాత్రి చెయ్యేటికి తీసుకెళ్లి ఇసుకను తరలిస్తున్నారు. ప్రస్తుతం 16 టన్నుల టిప్పర్‌ ఇసుకను రూ.30 వేల నుంచి రూ.35 వేలకు డిమాండ్‌ను బట్టి గుట్టుచప్పుడు సరఫరా చేస్తున్నారు. ప్రతి రోజూ వందల టిప్పర్ల ఇసుక తరలిపోతోంది. రైల్వేకోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లె మండలాలకైతే టిప్పర్‌కు అదనంగా రూ.5వేలు వసూలు చేస్తున్నారని సమాచారం.


వరద పేరుతో.. ఇసుక క్వారీలకు మోక్షం కరువు

వరద పేరు చెప్పి నేటికీ ఇసుక క్వారీలను తిరిగి పునరుద్ధరించడం లేదు. ప్రస్తుతం ఏటిలో ఇసుక ఎత్తాల్సిన పనిలేదు. కేవలం పొలాల్లో ఇసుక మేటను ఎత్తితే కావాల్సినంత దొరుకుతుంది. ఈ ఇసుకను ఆయా గ్రామాల్లో ఒక చోట చేర్చి ప్రజల అవసరాలకు తరలిస్తే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. ఎందుకనో.. ఆ పని చేపట్టకుండా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు.

పొదలకూరు నుంచి ఇసుక తరలింపు

చిట్వేలి, రైల్వేకోడూరు, రాజంపేట, ఓబులవారిపల్లె వాసులు ఇసుక కోసం సుమారు 150 కి.మీ దూరంలోని నెల్లూరు జిల్లా పొదలకూరు వెళుతున్నారు. అక్కడి నుంచి 16టన్నుల టిప్పర్‌ ఇసుకను ఏకంగా రూ.35 వేలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. కంటికి ఎదురుగా లక్షల టన్నుల ఇసుక మేట కనిపిస్తూ ఉన్నా సుదూర ప్రాంతాల నుంచి ఇసుకను తరలించాల్సిన దుస్థితి రావడంతో చెయ్యేరు పరీవాహక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ముందర ఉన్న ఇసుకను వాడుకుంటే ఎక్కడ కేసులు నమోదు చేస్తారోనని భయపడి ఇతర ప్రాంతాల నుంచి వేలకు వేలు పెట్టి తెప్పించుకుంటున్నారు.


మూడు నెలలుగా పనులు లేవు

మాది కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతం. పదేళ్లుగా రాజంపేటలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నా. మా ప్రాంతం నుంచి కోడూరు, రాజంపేటకు 5 వేల మంది భవన నిర్మాణ కార్మికులు వచ్చి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వరదల వల్ల మూడు నెలలుగా ఇసుక కొరతతో వీరందరికీ పనుల్లేవు.

- వి.నాగరాజు, భవన నిర్మాణ మేస్త్రీ 


పనులు లేక పస్తులు

మూడు నెలలుగా పనులు లేక మేమందరం పస్తులుండాల్సిన పరిస్థితి. ఇసుక కొరత వల్లే ఇంటి నిర్మాణాలు ఆగిపోయాయి. ఇసుకొస్తే పనులు మొదలుపెడదామని ఇంటి నిర్మాణదారులు అంటున్నారు. పత్తికొండ నుంచి వచ్చిన మేమందరం పనుల్లేక ఇంటిల్లాది పస్తులుండాల్సిన పరిస్థితి.

- శివ, భవన నిర్మాణ కూలీ 


ట్రాక్టర్‌ను మూలన పెట్టా

రాజంపేట ప్రాంతంలో ఇసుక దొరకడం లేదు. నాకు ఒక ట్రాక్టర్‌ ఉంది. ఆ ట్రాక్టర్‌తో ఇసుక తోలి జీవనం సాగిస్తుంటాం. ప్రస్తుతం మూడు నెలలుగా ఇసుక లేక ట్రాక్టర్‌ను మూలన పెట్టా. దీని వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఎప్పుడూ లేదు.

- మందా శ్రీనివాసులు, 

ట్రాక్టర్‌ యజమాని, రాజంపేట



Updated Date - 2022-01-06T05:46:16+05:30 IST