దా..రుణాలు..!

ABN , First Publish Date - 2022-05-21T06:44:05+05:30 IST

దా..రుణాలు..!

దా..రుణాలు..!

టిడ్కో ఇళ్లకు బ్యాంకు రుణాల మంజూరులో జాప్యం

జిల్లాలో 11,520 ఇళ్ల నిర్మాణాల్లో అనిశ్చితి 

రుణ లక్ష్యం రూ.262.34 కోట్లు 

ఇప్పటి వరకు మంజూరైంది రూ.26.75 కోట్లే 

అంతా మంజూరైతేనే సదుపాయాల కల్పన 

నెల అన్నారు.. రెండు నెలలైనా అతీగతీ లేదు


టిడ్కో ఇళ్లు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. ‘బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నాం.. నెలలో లబ్ధిదారులకు ఇచ్చేస్తాం..’ అని అధికారులు చెప్పి రెండు నెలలైనా రుణాల మంజూరు ప్రక్రియలో పురోగతి ఏమాత్రం లేదు. జిల్లావ్యాప్తంగా రూ.262 కోట్ల రుణానికి గానూ ఇప్పటివరకు మంజూరైంది రూ.26 కోట్లే. దీంతో టిడ్కో ఇళ్ల మంజూరు ఆశలు మరింత కాలాతీతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : టిడ్కో ఇళ్లకు బ్యాంకు రుణాల మంజూరు ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. ఈ ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గానూ లబ్ధిదారుల వాటాతో పాటు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేందుకు టిడ్కో యంత్రాంగం చేపట్టిన ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కావట్లేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం 11,520 టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల కోసం బ్యాంకుల నుంచి రూ.262.34 కోట్ల మేర రుణాలు తీసుకోవాలని నిర్ణయించారు. బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపారు. బ్యాంకులు కూడా ఆసక్తి చూపాయి. అయితే రుణాల మంజూరులో పురోగతి లేదు. 

కేవలం పది శాతమే.. 

ఇప్పటివరకు కేవలం రూ.26.75 కోట్ల మేర మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. బ్యాంకుల నుంచి ఇంకా రూ.235.59 కోట్ల రుణాలు మంజూరు కావాల్సి ఉంది. ఈ జాప్యం కారణంగా టిడ్కో ఇళ్ల బ్యాలెన్స్‌ పనులు, మౌలిక సదుపాయాలు పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. విజయవాడ నగరంతో పాటు జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు పరిధిలో నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించినవి 11,520 ఇళ్లు. ఇందులో విజయవాడలోని నాలుగు అర్బన్‌ మండలాలవి 6,576 ఇళ్లు ఉన్నాయి. జగ్గయ్యపేట పట్టణంలో 3,168, నందిగామలో 240, తిరువూరులో 1,536 ఉన్నాయి. నాలుగు ప్రాంతాల్లోని 11,520 టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో 300 చదరపు అడుగు విస్తీర్ణంలోనివి 3,984 ఇళ్లు కాగా, 365 చదరపు అడుగుల విస్తీర్ణంలోనివి 2,544. ఇక 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నవి 4,992 ఇళ్లు. ఇందులో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని టిడ్కో ఇళ్లకు ఎలాంటి బ్యాంకు రుణం తీసుకోలేదు. కేవలం 430, 365 చదరపు అడుగుల విస్తీర్ణంలోని టిడ్కో ఇళ్లకే రుణాలు తీసుకోవటం జరుగుతోంది. 

రుణాల మంజూరులో జాప్యం.. సదుపాయాల కల్పనలో ఆలస్యం..

ఎట్టి పరిస్థితుల్లో నెల రోజుల్లో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. ఇప్పటికి రెండు నెలలైనా అతీగతీ లేదు. బ్యాంకులు రుణాలు ఇస్తే తప్ప బ్యాలెన్స్‌ పనులు పూర్తిచేయలేని పరిస్థితి ఏర్పడింది. టిడ్కో ఇళ్లకు సంబంధించి ఫినిషింగ్‌ పనులు చాలా ఉన్నాయి. వీటితో పాటు మౌలిక సదుపాయాలైన మంచినీటి పైపులైన్లు, భూగర్భ మురుగునీటి పారుదల, స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్లు, వాటర్‌ ట్యాంకులు, రోడ్లు, సైడ్‌ డ్రెయిన్లు, వీధి దీపాలు, విద్యుత్‌ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేయటానికి టిడ్కో వద్ద ఎలాంటి డబ్బు లేదు. ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. బ్యాంకుల నుంచి వచ్చే రుణాలతోనే పూర్తి చేయాలి. రుణ లక్ష్యం రూ.262.34 కోట్లలో 10 శాతం కూడా మంజూరు కాకపోవటంతో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు మరింత కాలాతీతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రుణాల మంజూరు ఇలా..

విజయవాడ అర్బన్‌ పరిధిలోని మూడు నియోజకవర్గాలు కలిపి జక్కంపూడిలో 6,576 ఇళ్ల పనులు చేపట్టారు. ఇవి దాదాపు తుదిదశలో ఉన్నాయి. రోడ్లు, డ్రెయున్లు, వీధి దీపాలు తదితరాల మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.189.81 కోట్ల రుణానికి ప్రతిపాదించగా, ఇప్పటి వరకు కేవలం రూ.24.13 కోట్ల రుణమే మంజూరైంది. రుణం మంజూరైన శాతం 12.71 కూడా లేదు. ఇంకా రూ.165.68 కోట్లు మంజూరు కావాల్సి ఉంది. జగ్గయ్యపేట పట్టణ పరిధిలో తలపెట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణాల కోసం రూ.55.97 కోట్ల రుణాన్ని ప్రతిపాదిస్తే, బ్యాంకులు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. నందిగామ పట్టణ పరిధిలో చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణ రుణాలను పరిశీలిస్తే రూ.3.26 కోట్లకు గానూ రూ.1.12 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.2.14 కోట్లు రుణాలు మంజూరు కావాల్సి ఉంది. నందిగామ పట్టణానికి సంబంధించి మాత్రమే కాస్త పురోగతి ఉంది. ఈ పట్టణంలోని టిడ్కో ఇళ్లకు బ్యాంకులు 34.49 శాతం మేర రుణాలు ఇచ్చాయి. తిరువూరు పట్టణ పరిధిలో రూ.13.29 కోట్ల రుణాలకు ప్రతిపాదించగా, ఇప్పటివరకు రూ.1.40 కోట్లే మంజూరయ్యాయి. మొత్తంగా చూస్తే.. నిర్దేశిత ప్రతిపాదనల్లో కేవలం 10.20 శాతం మేర మాత్రమే బ్యాంకులు రుణాలను మంజూరు చేశాయి. 

Updated Date - 2022-05-21T06:44:05+05:30 IST