గగనయాన్‌కు ISRO తొలి అడుగు

ABN , First Publish Date - 2022-05-14T02:19:02+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకమైన మానవసహిత అంతరిక్ష యాత్ర (గగనయాన్‌) ప్రయోగానికి తొలి అడుగు వేసింది.

గగనయాన్‌కు ISRO తొలి అడుగు

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకమైన మానవసహిత అంతరిక్ష యాత్ర (గగనయాన్‌) ప్రయోగానికి తొలి అడుగు వేసింది. ఈ ప్రయోగంలో ఉపయోగించనున్న లాంచ్‌ వెహికల్‌ మాడ్యూల్‌-3 (ఎల్‌విఎం-3)లో ప్రథమ దశ ఘన ఇంధన బూస్టర్‌ హెచ్‌ఎస్‌-200కు ఇస్రో శుక్రవారం భూస్థిర పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌థావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లో శుక్రవారం ఉదయం 7.20 గంటలకు ఈ పరీక్ష జరిగింది. 20 మీటర్ల పొడవు, 3.2 మీటర్ల వ్యాసం కలిగిన హెచ్‌ఎస్‌-200 బూస్టర్‌లో 203 టన్నుల ఘన ఇంధనాన్ని నింపి షార్‌లోని ఎస్‌ఎంపీసీ విభాగంలో భూస్థిర పరీక్షను నిర్వహించారు. శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగా ఈ బూస్టర్‌ 135 సెకండ్ల పాటు విజయవంతంగా పనిచేసినట్లు ఇస్రో వెల్లడించింది. 700 పారామీటర్లతో ఈ బూస్టర్‌ పనితీరును పరీక్షించినట్లు పేర్కొంది. ఈ హెచ్‌ఎస్‌-200 బూస్టర్‌ను తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో తయారుచేయగా, ఇందులో ఉపయోగించే ఘన ఇంధనాన్ని షార్‌లో తయారుచేశారు. ఈ బూస్టర్‌ పరీక్ష విజయవంతం కావడంతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఘన ఇంధన బూస్టర్‌ను ఇస్రో రూపొందించుకున్నట్లు అయ్యింది. 


Read more