అందుకే గగనానికి గీత

ABN , First Publish Date - 2021-02-27T09:06:07+05:30 IST

రేపు నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న ‘పీఎ్‌సఎల్‌వీ-సీ51’కి ఒక ప్రత్యేకత ఉంది. దీనిలో ఒక చిన్న శాటిలైట్‌లో భగవద్గీతను, ప్రధాని మోదీ చిత్రాన్ని అంతరిక్షంలోకి పంపించేందుకు రంగం

అందుకే గగనానికి గీత

రేపు నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న ‘పీఎ‌స్‌ఎల్‌వీ-సీ51’కి ఒక ప్రత్యేకత ఉంది.  దీనిలో ఒక చిన్న శాటిలైట్‌లో  భగవద్గీతను, ప్రధాని మోదీ చిత్రాన్ని అంతరిక్షంలోకి పంపించేందుకు రంగం సిద్ధమైంది.  ఈ ఆలోచన చేసింది, ఆ బృందానికి నేతృత్వం వహిస్తున్నదీ ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’ సీఈవో, మన తెలుగు మహిళ  డాక్టర్‌ శ్రీమతీ కేశన్‌. ఆమె ‘నవ్య’తో ముచ్చటించారు.


‘‘నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. అక్కడే శాన్‌ఫ్రాన్సి్‌స స్కూల్లో ప్రాథమిక విద్యా, కస్తూరిబా కాలేజీలో ఇంటర్‌, డిగ్రీ చేశాను. అమ్మ మీనా, నాన్న శ్రీనివాసన్‌. నాన్న ‘మైకోమోటార్‌ ఇండస్ట్రీ్‌స’లో పని చేసేవారు. నేను నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి తరఫున 10 జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. ఎన్‌సీసీలో ఏపీ బెస్ట్‌ క్యాడెట్‌గా నిలిచాను. ఒకసారి ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకలకు ఏపీ తరఫున నేనే ప్రాతినిధ్యం వహించాను. గురుకుల విధానంలో డాక్టరేట్‌ చేశాను. అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది. 25 ఏళ్ల క్రితం వివాహం కావడంతో చెన్నై వచ్చేశాను. 


పిల్లలను ప్రోత్సహిస్తూ...

మావారు కేశన్‌ ఓ ప్రైవేటు కంపెనీకి సీఈవో. పదహారేళ్ళు గృహిణిగా ఉన్నాక, ‘ఎడ్యుకేషనల్‌ టూరిజం’ ప్రారంభించాను. పిల్లల్ని ఇక్కడి నుంచి నాసా, కెనడీ స్పేస్‌ సెంటర్‌, రష్యన్‌ స్పేస్‌ సెంటర్‌ లాంటి వాటికి తీసుకెళ్లేదాన్ని. ఆ మూడు కేంద్రాలు నాకు ‘అంబాసిడర్‌ హోదా’ ఇచ్చాయి. తరువాత ‘స్పేస్‌ కిడ్స్‌ ఇండియా’ సంస్థను ప్రారంభించాను. నాసాకు చాలామందిని తీసుకెళ్లాను. రాకెట్‌, శాటిలైట్‌ అంటే మొదటి నుంచీ నాకు ఆసక్తి. రాకెట్లనూ, శాటిలైట్లనూ మనమే తయారు చేస్తే బావుంటుందని అనుకునేదాన్ని. కానీ నేను దానికి సంబంధించి ఏమీ చదువుకోలేదు. అందుకే ‘ప్రతిభ, ఆసక్తి వున్న విద్యార్థులు, యువతీయువకులను మనమెందుకు ప్రోత్సహించకూడదు?’ అనిపించింది.  పదేళ్లుగా దీనిపైనే పని చేస్తున్నాను. 2015 నుంచి శాటిలైట్‌ డిజైన్‌ వంటివి చేయడం మొదలుపెట్టాం. 


మోదీకి కృతజ్ఞతగా...

ఇప్పుడు మేము పంపుతున్న శాటిలైట్‌ పేరు ‘సతీ్‌షధవన్‌ శాట్‌’. దీని బరువు 1.9 కి.లో గ్రాములు. దీన్ని ‘3-యూ శాటిలైట్‌’ అంటారు. ఇది ‘టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్‌ శాటిలైట్‌’. తక్కువ పవర్‌తో ఎక్కువ సామర్థ్యంతో నెట్‌వర్క్‌ పని చేయడం ఎలా? ఎక్కువ డేటా పంపించడం ఎలా? అనే విషయాల్లో పరిశోధనలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో శాటిలైట్‌ రంగంలో ఎన్నో కొత్త ప్రయోగాలకు నాంది అవుతుంది. దీన్ని పెద్ద శాటిలైట్లకూ వినియోగించవచ్చు. మాలాంటి చిన్న సంస్థలు కూడా ‘ఇస్రో’తో ఒప్పందం కుదుర్చుకొనేందుకు, ఆ సంస్థతో కలిసి పని చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీయే అవకాశం కల్పించారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల వల్లనే ఇది సాధ్యమైంది. శాటిలైట్‌ తయారీకే కాదు, పరీక్షించడానికి కూడా చాలా వ్యయం అవుతుంది. అంతేగాక ఇండియాలో కేవలం రెండు మూడు కేంద్రాల్లో మాత్రమే ఈ టెస్టింగ్‌కి అవకాశం వుంది. మేం ఎంఓయూ చేసుకున్నాం కాబట్టి పరీక్షలన్నీ ఇస్రోలోనే చేసుకోగలిగాం. ఇందుకు కృతజ్ఞతగా మోదీ ఫోటోను అంతరిక్షంలోకి పంపించదలచాం. ఇప్పటి వరకూ ఏ ప్రధానికీ అందని అరుదైన గౌరవాన్ని ఇవ్వాలన్న సంకల్పంతో ఈ పనికి పూనుకున్నాం.


అంతా పిల్లలే..

మా సంస్థ శాటిలైట్‌ డిజైన్లు తయారుచేసి, ఆవిష్కరిస్తుంది. ఇప్పటి వరకూ 12 బెలూన్‌ శాట్‌లు, 2 సబ్‌ ఆర్బిటర్‌ శాటిలైట్‌లు పంపించింది. ఇందులో నాసా నుంచి వెళ్లిన ‘కలాం శాట్‌’ కూడా వుంది. ఇప్పటి వరకూ అంతరిక్షంలోకి వెళ్లిన అతితక్కువ బరువు కలిగిన శాటిలైట్‌ ఇదే కావడం విశేషం. అదేవిధంగా కలాంశాట్‌ వీ2 కూడా పంపించాం. మా బృందంలో పరిశోధనాసక్తి కలిగిన, 14 కన్నా తక్కువ వయసు కలిగిన యవతీయువకులే వుంటారు. ఈ శాటిలైట్‌ వ్యయానికి సుమారు రూ.50 లక్షలు వ్యయమైంది. ‘హెక్సావేర్‌ టెక్నాలజీ సంస్థ’ వారి సహకారంతో దీన్ని రూపొందించాం. 




విశ్వవ్యాప్తి కోసం..

మానవాళికి మార్గం చూపే పవిత్రమైన గ్రంథం భగవద్గీత. అన్ని మతాల వారు చదవాల్సిన గ్రంథం. మహా శాస్త్రవేత్తలు సైతం గీతలోని గొప్పదనాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. భగవద్గీతను అంతరిక్షంలోకి పంపిస్తే మరింత విశ్వవ్యాప్తి అవుతుందన్నది మా ఉద్దేశం. కొన్ని దేశాలు బైబిల్‌ను అంతరిక్షంలోకి పంపించాయి. భగవద్గీతను పంపడం ఇదే తొలిసారి. 


డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై


భవిష్యత్తులో....

ఈ సంవత్సరంలోగా రెండు శాటిలైట్లు తయారు చేయాలన్నదిశగా పని చేస్తున్నాం. వాటిలో ఒకదాని మీద బంగ్లాదేశ్‌ విద్యార్థులు, మరొకదానిమీద మాల్దీవుల విద్యార్థులు మన విద్యార్థులతో కలిసి పని చేస్తున్నారు.  వారికి గైడెన్స్‌ ఇస్తున్నాం. భవిష్యత్తులో రాకెట్‌ డిజైన్‌ చేపట్టాలన్నదే నా కోరిక. అందులో విజయం సాధిస్తామనే ఆశిస్తున్నాను.

Updated Date - 2021-02-27T09:06:07+05:30 IST