ఇస్రో గూఢచర్యం కేసు : పాకిస్థాన్ ప్రమేయంపై సీబీఐ అనుమానం

ABN , First Publish Date - 2021-07-29T23:44:55+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో గూఢచర్యం కేసులో పాకిస్థాన్

ఇస్రో గూఢచర్యం కేసు : పాకిస్థాన్ ప్రమేయంపై సీబీఐ అనుమానం

కొచ్చి : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో గూఢచర్యం కేసులో పాకిస్థాన్ ప్రమేయంపై తమకు అనుమానం ఉందని సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) కేరళ హైకోర్టుకు గురువారం తెలిపింది. మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఆర్‌బీ శ్రీకుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిలు దరఖాస్తుపై విచారణ సందర్భంగా సీబీఐ ఈ అనుమానం వ్యక్తం చేసింది. 1994లో సీబీఐ నమోదు చేసిన గూఢచర్యం కేసులో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను, ఇతరులను ఇరికించేందుకు శ్రీకుమార్ కుట్ర పన్నినట్లు సీబీఐ ఆరోపించింది. ఆయనకు బెయిలు ఇవ్వవద్దని కోర్టును కోరింది. 


సీబీఐ గత నెలలో కొత్తగా ఓ ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది. దీనిలో ఎస్ విజయన్, థంపి ఎస్ దుర్గాదత్‌ సహా 18 మందిని నిందితులుగా పేర్కొంది. ఈ నిందితుల్లో కేరళ మాజీ పోలీసు ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఉన్నారు. దీనిని తిరువనంతపురం చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించింది. శ్రీకుమార్ గుజరాత్ డీజీపీగా, ఇంటెలిజెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేసి, పదవీ విరమణ చేశారు. ఆయనను సోమవారం వరకు అరెస్టు చేయరాదని హైకోర్టు సీబీఐకి తెలిపింది. విజయన్, థంపిలకు ఇటీవల రెండు వారాల తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది. 


ఈ నిందితులంతా పెద్ద కుట్రకు పాల్పడ్డారని, నకిలీ పత్రాలను సృష్టించారని సీబీఐ ఇటీవల హైకోర్టుకు తెలిపింది. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నిందితులు, గుర్తు తెలియని మరికొందరితో కలిసి కుట్ర పన్నారని తెలిపింది. 


ఓ ఇస్రో ఉన్నతాధికారి, ఓ వ్యాపారవేత్త, ఇద్దరు మాల్దీవియన్ మహిళలతో కలిసి నంబి నారాయణన్ గూఢచర్యానికి పాల్పడినట్లు 1994లో సీబీఐ కేసు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేసింది. నంబి నారాయణన్‌ 1995లో విడుదలయ్యారు. అనంతరం ఆయన తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తూ, అవిశ్రాంతంగా న్యాయ పోరాటం చేశారు. సుప్రీంకోర్టు 2020లో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నారాయణన్‌ను అక్రమంగా ఇరికించేందుకు పోలీసులు కుట్ర పన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని ఈ కమిటీని ఆదేశించింది. 


ఇదిలావుండగా నంబి నారాయణన్‌కు సుప్రీంకోర్టు రూ.50 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది. ఈ కేసులో ఆయన బాధితుడని స్పష్టం చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ రూ.10 లక్షలు పరిహారం ప్రకటించింది. వీటికి అదనంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం రూ.1.30 కోట్లు నష్టపరిహారం చెల్లించింది.


Updated Date - 2021-07-29T23:44:55+05:30 IST