ఇజ్రాయెల్‌ దుశ్చర్య

ABN , First Publish Date - 2021-04-15T07:45:01+05:30 IST

ఇరాన్‌ అణుశుద్ధి కర్మాగారం నతాన్జ్‌ మీద ఇటీవల ఓ భారీ దాడి జరిగింది. యురేనియం శుద్ధిని మరింత వేగంగా కొనసాగించడానికి వీలుగా...

ఇజ్రాయెల్‌ దుశ్చర్య

ఇరాన్‌ అణుశుద్ధి కర్మాగారం నతాన్జ్‌ మీద ఇటీవల ఓ భారీ దాడి జరిగింది. యురేనియం శుద్ధిని మరింత వేగంగా కొనసాగించడానికి వీలుగా అధునాతన సెంట్రీఫ్యూజ్‌లను ఏర్పాటు చేసుకుని, నూక్లియర్‌ టెక్నాలజీ డే సందర్భంగా వాటిని దేశాధ్యక్షుడు రహానీ ఘనంగా ఆరంభించిన మర్నాడే మొత్తం విద్యుత్‌వ్యవస్థ ధ్వంసమైపోయి నతాన్జ్‌ కర్మాగారంలో పని నిలిచిపోయింది. గత ఏడాది జులైలో ఇజ్రాయెల్‌ దాడితో దెబ్బతిన్న వ్యవస్థను ఆధునీకరించి, కర్మాగారాన్ని మరింత శత్రుదుర్బేధ్యంగా మార్చిన తరువాత కూడా ఇలా జరగడం ఇరాన్‌కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ దాడికి ఇజ్రాయెల్‌ కారణమని ప్రకటించి, జరిగినదానికి కచ్చితంగా బదులు తీర్చుకుంటానని ఇరాన్‌ హెచ్చరించింది.


ఈ దాడిని ఇరాన్‌ ‘నూక్లియర్‌ టెర్రరిజం’గా అభివర్ణించింది. సైబర్‌దాడో, పేల్చివేతో తెలియదుకానీ, ఈ ‘ఉగ్రదాడి’ ప్రభావం చిన్నదేమీ కాదు. అణుశుద్ధిని పునరుద్ధరించడానికి కనీసం పదినెలలు పడుతుందట. ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ దాడులు చేయడం గతంలోనూ ఉన్నదే. గత ఏడాది నవంబరులో ఇరాన్‌ అణుపితామహుడు మొహ్‌సెన్‌ ఫక్రీజాదేను ఉగ్రవాదులు టెహ్రాన్‌ శివార్లలో డ్రోన్ల ద్వారా హత్యచేశారు. ఇప్పుడు అమెరికా రక్షణమంత్రి ఆస్టిన్‌ ఇజ్రాయెల్‌లో కాలూనిన రోజే నతాన్జ్‌ ఘటన జరిగింది. అమెరికా ఇజ్రాయెల్‌ బంధాన్ని బలోపేతం చేయడం వంటివి ఎజెండాలో పైకి కనిపిస్తున్నప్పటికీ, ఆయన రాక వెనుక అసలు లక్ష్యం ఇరాన్‌ అణుఒప్పందానికి తిరిగి ప్రాణప్రతిష్ఠచేయబోతున్నట్టు ఇజ్రాయెల్‌కు చెప్పడం. ఇజ్రాయెల్‌ దీనిని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా పూర్వ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2018 మే నెలలో ఏకపక్షంగా తప్పుకున్న ఒప్పందానికి తిరిగి జీవం పోయడానికి ఇటీవల ఒక ప్రయత్నం జరిగింది. ఒప్పందంలో మిగతా భాగస్వాములైన చైనా,రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇరాన్‌లు వియన్నాలో చర్చలు జరిపాయి. ఇరాన్‌ వ్యవహారాలు పర్యవేక్షించే వైట్‌హౌస్‌ ప్రత్యేక ప్రతినిధి బృందం కూడా అప్పుడు అక్కడే మకాం వేసింది. ఇరాన్‌, అమెరికాలు నేరుగా మాట్లాడుకోకపోయినా, ఈయూ మధ్యవర్తిత్వంతో మార్గం సుగమం అయినట్టే కనిపించింది. ఒప్పందాన్ని పునరుద్ధరించడం ఉత్తమం, తక్షణ కర్తవ్యం అంటూ అక్కడ చేరినవారంతా ఏకకంఠంతో ప్రకటించారు. 


అయితే, ఎవరు ముందు అన్నవిషయంలో తర్జనభర్జనలు సహజం. యురేనియం శుద్ధికార్యక్రమానికీ, సెంట్రీఫ్యూజుల అభివృద్ధికీ తక్షణమే స్వస్తిచెప్పి, ఆరేళ్ళనాటి ఒప్పందంలోని అన్ని అంశాల కట్టుబడికీ హామీ ఇవ్వాలని అమెరికా అంటున్నది. ట్రంప్ హడావుడిగా, అహంకారపూరితంగా విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయడం ద్వారా సానుకూల సంకేతాలు పంపమని ఇరాన్‌ కోరుతున్నది. జూన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న తరుణంలో, తాము అమెరికాకు లొంగివచ్చినట్టుగా కనబడకూడదని ఇరాన్‌ పాలకుల అభిప్రాయం. జో బైడెన్‌ నిజానికి ఒప్పందాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో ఇరాన్‌ వ్యవహారాలకోసం ప్రత్యేక ప్రతినిధిని నియమించడం, యెమన్‌లో సౌదీ యుద్ధానికి అమెరికా సహకారాన్ని రద్దుచేసుకోవడం వంటి సానుకూల చర్యలు తీసుకున్నారు కూడా. కానీ, ట్రంప్‌ గతంలో కొట్టిన దెబ్బతో, ఇరాన్‌ ఈ మారు అమెరికానుంచి నిర్దిష్టమైన చర్యలు డిమాండ్‌ చేస్తున్నది. ఈ నేపథ్యంలో, ఉభయపక్షాలకూ ఆమోదయోగ్యంగా ఉండే ఒక మార్గాన్ని కూచొని నిర్ణయించుకోవాలని అమెరికా–ఇరాన్‌లు సంకల్పం చెప్పుకోగానే ఎర్రసముద్రంలో ఇరాన్‌ ఓడమీద ఇజ్రాయెల్‌ దాడిచేసింది. ఇప్పుడు నేరుగా నతాన్జ్‌నే నాశనం చేసి, ఒకేదెబ్బతో ఇరాన్‌, అమెరికాలను హెచ్చరించింది. ట్రంప్‌ నిర్ణయాన్ని తిరగదోడేందుకు బైడెన్‌ ప్రభుత్వం ఏ చిన్న అడుగువేసినా ఇజ్రాయెల్‌ ఊరుకోదని ఈ దాడి అర్థం. అనుక్షణం ఇలా నిప్పు రాజేస్తూ అమెరికా–ఇరాన్‌లు ఏ క్షణంలోనూ రాజీకి రాకుండా ఇజ్రాయెల్‌ అడ్డుపడుతూనే ఉంటుంది. అమెరికా–ఇరాన్‌లు రెచ్చిపోకుండా, కుంగిపోకుండా సత్వరమే సయోధ్య దిశగా అడుగులువేసి ఒప్పందాన్ని గట్టెక్కించాలి, ఇజ్రాయెల్‌ కుట్రలను వమ్ముచేయాలి.

Updated Date - 2021-04-15T07:45:01+05:30 IST