Israel: గాజాపై మరోమారు బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్.. 8 మంది మృతి

ABN , First Publish Date - 2022-08-06T03:11:41+05:30 IST

పాలస్తీనా పట్టణం గాజా (Gaza)పై ఇజ్రాయెల్ (Israel) మరోమారు వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో

Israel: గాజాపై మరోమారు బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్.. 8 మంది మృతి

జెరూసెలం: పాలస్తీనా పట్టణం గాజా (Gaza)పై ఇజ్రాయెల్ (Israel) మరోమారు వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో సీనియర్ మిలిటెంట్ సహా 8 మంది మరణించారు. మరో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ వారం మొదట్లో ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో సీనియర్ మిలిటెంట్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయని, దీంతో ఇస్లామిక్ జిహాదీ తీవ్రవాద గ్రూపులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ తాజా దాడులు మరో యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ అధీనంలోని గాజాలో దాదాపు 2 మిలియన్ల మంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు.  


శుక్రవారం మధ్యాహ్నం గాజాలో పేలుడు శబ్దం వినిపించింది. ఆ వెంటనే ఓ పెద్ద భవనంలోని ఏడో అంతస్తు నుంచి దట్టమైన పొగలు రావడం కనిపించింది. గాజా స్ట్రిప్‌లో ఉగ్రవాద సంస్థలను అనుమతించేది లేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ పౌరులను బెదిరిస్తామంటే కుదరదని ఆ దేశ ప్రధాని యాసిర్ లపిడ్ తేల్చి చెప్పారు.


ఇజ్రాయెల్‌కు ఎవరైనా  హాని చేయాలని భావిస్తే కనుక వారెక్కడున్నా కనిపెట్టి తీరుతామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐదేళ్ల బాలిక సహా 8 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మరో 40 మంది వరకు గాయపడ్డారని పేర్కొంది. కాగా, చనిపోయిన వారిలో తైసీర్ అల్ జబరికి చెందిన గాజా కమాండర్ కూడా ఉన్నట్టు ఇస్లామిక్ జిహాద్ తెలిపింది. 

Updated Date - 2022-08-06T03:11:41+05:30 IST