ఇజ్రాయెల్ సమీపంలోని ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్ పరిధిలో ఉన్న శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాలస్తీనియన్లు మరణించారు. గురువారం ఉదయం జరిపిన ఈ కాల్పుల్లో మరికొంతమంది గాయపడ్డట్లు పాలస్తీనా వెల్లడించింది. రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్‌లోని జెనీన్లో పాలస్తీనాకు చెందిన వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఇటీవల ఇలాంటి ఘటనలే మరికొన్ని జరగగా, మొత్తం పదకొండు మంది ఇజ్రాయెలీలు మరణించారు. దీంతో గురువారం జెనీన్లో కొందరు అనుమానాస్పద వ్యక్తులు ఉన్నట్లు భావించి, వాళ్లను అరెస్టు చేసేందుకు వెళ్లగా వాళ్లు దళాలపై కాల్పులు జరిపారు. దీంతో ఇజ్రాయెల్ ఎదురు కాల్పులు ప్రారంభించింది. ఈ కాల్పుల్లో పాలస్తీనియన్లు ఇద్దరు మరణించారు. తమ దళాల్లోని ఒక సైనికుడు గాయపడ్డట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.